నువ్వు కాదు.. మీ నాన్నను రమ్మను

  • వైయస్ జగన్ గురించి మాట్లాడే అర్హత లోకేష్ కు లేదు
  • లోకేష్ ఇంకా బొడ్డు కూడా కోయని పసిబాలుడు
  • దమ్ముంటే వైయస్ జగన్ తో బహిరంగచర్చకు బాబును రమ్మను
  • తన స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టాడు
  • వైయస్సార్సీపీ అంటే చంద్రబాబుకు భయం పట్టుకుంది
  • చేసిన తప్పులకు బాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
  • వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
హైదరాబాద్ః విభజన హామీలు వంద శాతం పూర్తి చేశామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా చంద్రబాబు తలాడించడం సిగ్గుచేటని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అధ్యక్షతన ఢిల్లీకి తీసుకెళ్లాలని ఆయన డిమాండ్‌ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రం ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ రైల్వే జోన్, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ, ఇండస్ట్రియల్‌ కారిడార్, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇలాంటివన్నీ ఎక్కడ నెరవేర్చారని ఆయన ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో భయపడి కేంద్రాన్ని అడగాలంటే చంద్రబాబు వణికిపోతున్నారని అంబటి ఎద్దేవా చేశారు. 
 
పోలవరం కోసం రాష్ట్రం భవిష్యత్తు తాకట్టు 
పోలవరం కాంట్రాక్టులను దక్కించుకుని బినామీలకు లబ్ధి చేకూర్చే ఉద్దేశ్యంతోనే ప్రత్యేక హోదా అంశాన్ని బాబు ఢిల్లీలో తాకట్టు పెట్టాడని అంబటి విమర్శించారు. నల్లధనం మార్చుకున్నా.. బినామీలు దొరికినా కేసులు పెట్టకుండా ఉండేలా కేంద్రంతో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. తన సొంత ప్రయోజనాల కోసం ఐదున్నర కోట్ల మంది ఆంధ్రుల మనోభావాలను తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడేమో ప్రత్యేక హోదా కావాలని చెప్పిన బాబు తర్వాత ప్యాకేజీయే బాగుందని చెప్పిన మాటను రాష్ట్ర ప్రజలంతా చూశారని అన్నారు. జైట్లీ ప్రకటన చూసి రక్తం మరిగిపోయిందని మాట్లాడిన బాబు ఆ తర్వాత పోలవరం కాంట్రాక్టు దక్కినందుకు చల్లబడ్డారన్నారు. అత్యవరసమైన అంశాలను పక్కనబెట్టి కూరగాయలకు, ఆటో డ్రైవర్లకు స్వైపింగ్‌ మెషిన్లు అంటూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా చంద్రబాబు మేల్కొని రాష్ట్ర ప్రయోజనాల కోసం అఖిల పక్షాన్ని సమావేశ పర్చాలని సూచించారు. సాధ్యం కాదు ప్రత్యేక హోదా సాధించే సత్తా లేదనుకుంటే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. 

లోకేష్‌ నిక్కర్లు వేసుకునే వయసు దాటలేదు
లోకేష్‌ ఇంకా నిక్కర్లు వేసుకునే వయసు దాటలేదని అంబటి చమత్కరించారు. వైయస్‌ఆర్‌సీపీ అధినేత హైదరాబాద్‌ విడిచి రాలేదని లోకేష్‌ పేర్కొనడంపై అంబటి ఫైర్ అయ్యారు.  పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ను వదిలి ఎందుకు రావాలి అని బదులు ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా ఇరుక్కోబట్టే చంద్రబాబు మూటాముల్లే సర్దుకుని అమరావతికి చెక్కేశారని ఆరోపించారు. తెలంగాణలో టీడీపీని అధికారంలోకి తెచ్చేదాకా హైదరాబాద్‌ను విడిచిపోనన్న ముఖ్యమంత్రి ఉన్నట్టుండి ఎందుకు వెళ్లాడో పసివాడైన లోకేష్‌కు తెలియడం లేదన్నారు. వెంకయ్య నాయుడు ఇద్దరు ముఖ్యమంత్రులను పిలిపించి (కేసీఆర్, చంద్రబాబు) బాబు హైదరాబాద్‌ విడిచి వెళ్లేలా రాజీ చేశారని ఆరోపించారు. తమకు అలాంటి భయం లేదన్నారు. 

లోకేష్ కు ఆ స్థాయి లేదు
ఎవరో కట్టుకున్న గెస్ట్‌హౌస్‌లో చంద్రబాబు కాపురం పెట్టాడని సొంతంగా ఒక్క భవనం నిర్మించలేని అమసర్థ ముఖ్యమంత్రి అని అంబటి విమర్శించారు. మా నాయకుడు వైయస్‌ జగన్‌ను విమర్శించే అర్హత లోకేష్‌కు లేదన్నారు. బహిరంగ చర్చకు రావాలంటే రాష్ట్రంలో ఎక్కడ్నుంచైనా పోటీ చేసి గెలవమని సలహా ఇచ్చారు. కనీసం నాలుగు ఓట్లు సాధించి సత్తా నిరూపించుకోవాలని సూచించారు. దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబును వైయస్‌ జగన్‌తో బహిరంగ చర్చకు రమ్మనాలని లోకేష్ కు సవాల్‌ చేశారు. లోకేష్‌ ఇంకా బొడ్డు కూడా కోయని పసిబాలుడని విమర్శించారు. అధికారం ఉంది కాబట్టి, తండ్రి సీఎం కాబట్టి కొందరు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఆయన వద్దకు వచ్చి పైరవీలు చేయించుకుంటున్నారు తప్ప ఆయన మేధావి కాదన్న విషయం గ్రహించాలన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చామని ప్రచారం చేసుకుంటున్న టీడీపీ ప్రభుత్వానికి సిగ్గుండాలన్నారు. రైతులు, డ్వాక్రామహిళలకు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ప్రత్యేక హోదా, పేదలకు ఇళ్లు స్థలాలు, సుజల స్రవంతి పథకం వీటిలో ఏ ఒక్క హామీ అయినా నెరవేరిందా అని ప్రశ్నించారు. నల్లధనంతో అడ్డంగా దొరికిన టీటీడీ సభ్యుడు శేఖర్‌ రెడ్డి చంద్రబాబు, శశికళలకు బినామీ అని మరోసారి స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో పోలీసు రాజ్యం
వైయస్‌ఆర్‌సీపీ అంటే చంద్రబాబుకు భయం పట్టుకుందని అంబటి రాంబాబు పేర్కొన్నారు. అందుకే నరసరావుపేటలో జరిగే బహిరంగ సభకు అనుమతి నిరాకరించారని తెలిపారు. రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తుందన్నారు. నరసరావు పేటలో ఎప్పుడూ బహిరంగ సభ జరిగే పల్నాడు సెంటర్‌లో ఎందుకు అనుమతి నిరాకరించారో చెప్పాలన్నారు. దివంగత ముఖ్యమంత్రులు మ్రరి చెన్నారెడ్డి, వైయస్‌ రాజశేఖరెడ్డి దగ్గర్నుంచి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, చంద్రబాబు వరకు అందరూ పల్నాడు సెంటర్‌లో బహిరంగ సభల్లో ప్రసంగించారని అప్పుడు లేని అడ్డంకులు ఇప్పుడెలా వచ్చాయని ప్రశ్నించారు. స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌లు కోరడం వల్లే అనుమతి నిరాకరించారని ఆయన వెల్లడించారు. ఏదైమైనా సభను జయపద్రం చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీకి ఎన్నికలంటే భయం పట్టుకుందని అందుకే మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించడం లేదని, ఓడిపోతామనే భయంతోనే పార్టీ ఫిరాయించిన వారిని టీడీపీ టికెట్‌ మీద బరిలోకి దింపడం లేదని ఎద్దేవా చేశారు. ఏదో ఇప్పుడు అధికారం ఉన్నంత మాత్రాన అన్ని రోజులు తాము అనుకున్నదే నడుస్తుందని అనుకోవడం పొరపాటని రానున్న ఎన్నికల్లో తప్పకుండా గెలిచి అధికారం చేపడతామని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంను చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు చేసిన అన్ని తప్పులకు బాబు మూల్యం చెల్లించుకునే రోజు తొందర్లోనే వస్తుందన్నారు. 
Back to Top