నవనిర్మాణ దీక్ష కాదు నయవంచన దీక్ష

ఆనాడు అంగీకరించి..నేడు అన్యాయమంటారా..?
ఓటుకు కోట్లు కోసం ఏపీ ప్రయోజనాలు తాకట్టు పెట్టాడు
రాష్ట్రంలో స్కాములు తప్ప ఒక్క స్కీమ్ లేదు
దుష్టపోకడలకు బాబు బుర్ర కేంద్రస్థానంగా మారింది
బాబు పాలన భయానకం..మాటలు బూటకం

హైదరాబాద్ః రాష్ట్ర విభజనకు కారకుడైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్నది నవ నిర్మాణ దీక్ష కాదని, నయవంచన దీక్ష అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఈ మేరకు పార్టీ నేటి ఉదయం ఒక ప్రకటన విడుదల చేసింది. చంద్రబాబువి అన్నీ హిట్లర్ ఆలోచనలేనని మండిపడింది. రాష్ట్ర విభజన కోసం బాబు ఒకటి కాదు, రెండు కాదు.. నాలుగు సార్లు లేఖలు ఇచ్చారు.  విభజనకు లోక్‌సభలో తొలి ఓటు తమ పార్టీదేనని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడితో ప్రకటింపజేశారని,  ఇప్పుడు రాష్ట్ర  విభజనకు వ్యతిరేకంగా నవనిర్మాణ దీక్ష చేస్తానంటున్నారని పార్టీ విమర్శించింది. 

అవినీతి మీద, కుట్ర రాజకీయాల మీద ప్రజలు ధ్వజమెత్తాలన్న నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ ప్రకారం..... ప్రజల తొలి లక్ష్యం ఇక చంద్రబాబు ప్రభుత్వమే కావాలని అన్నారు. ఓటుకు కోట్ల కేసు కోసం కృష్ణా- గోదావరి నదులను తెలంగాణ ప్రభుత్వానికి, అవినీతి అక్రమాలపై సీబీఐ విచారణ జరగకుండా ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టేశారని వైయస్ఆర్‌సీపీ మండిపడింది. ఒకవైపు ఏపీ అభివృద్ధిని, మరోవైపు ప్రాణాధారమైన జలాలను కూడా అమ్మేసిన ముఖ్యమంత్రి ఈరోజు చేసేది నవనిర్మాణ దీక్ష అంటే ఎవరైనా నమ్ముతారా అని ప్రశ్నించింది.

ప్రతి ఒక్కరూ దీక్షలో పాల్గొనాలి.. 11 గంటలకు ఎక్కడివారక్కడ నిలిచిపోవాలి అంటూ చివరికి నియంతృత్వ దేశాల్లో కూడా చేయని వెర్రిమొర్రి ఆలోచనలకు, ఎమర్జెన్సీని మించిన దుష్టపోకడలకు చంద్రబాబు బుర్ర కేంద్రస్థానంగా మారిందని పార్టీ విమర్శించింది. పరిపాలన లేదు, రెండేళ్లుగా చేసిన మంచి లేదు, చెప్పుకోదగ్గ పథకమంటూ ఒక్కటి కూడా లేదని, స్కాములు తప్ప స్కీములు లేవని తెలిపింది. వ్యవసాయం సర్వనాశనం అయిందని, కృష్ణా, గోదావరి ద్వారా రావల్సిన నీటిలో చుక్కను కూడా వదులుకోబోమన్న భరోసా లేదని గుర్తుచేసింది. 

ప్రత్యేక హోదా తెస్తామన్న హామీ లేదని, విభజన చట్టాన్ని అమలు చేయించే ప్రయత్నం లేదని, పారిశ్రామిక రాయితీలు, ఉద్యోగావకాశాల ఊసు కూడా లేవని తెలిపింది. ఇప్పుడేం జరుగుతోందో, మూడేళ్లలో ఏం చేస్తారో చెప్పే సత్తా లేదు గానీ, ఈ రాష్ట్రం 2022కి, 2029కి, 2050కి ఎలా అభివృద్ధి అవుతుందో, దానికోసం ఈ రోజు ఏపీ ప్రజలు ఎక్కడివారు అక్కడే నిలిచిపోయి చంద్రబాబు చేయించే నయవంచన ప్రతిజ్ఞను చదవాలా అని ప్రశ్నించింది. హిట్లర్ ఆలోచనా ధోరణికి కొనసాగింపే ఈ నాటకమని, చంద్రబాబు పాలన భయానకం, మాటలు బూటకమని పార్టీ ఆ ప్రకటనలో విమర్శించింది.
Back to Top