సీఐడీ కాదు సీబీఐతో విచారణ జరిపించాలి

  • ఎవరో పైపు కోయడం వల్లే నీరొచ్చిందని స్పీకర్ చెప్పడం హాస్యాస్పదం
  • అసెంబ్లీలోకి స్పీకర్ తమను ఎందుకు ఆహ్వానించలేదు
  • జరిగిన ఘటనను పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది
  • అసెంబ్లీ నిర్మాణ దశనుంచే బాబు వందలాది కోట్లు దోచుకున్నారు
  • వైయస్సార్సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి
విజయవాడః అసెంబ్లీ భవనంలోకి వర్షపు నీరు వచ్చిన ఘటనపై సీఐడీ ఎంక్వైరీ జరిపిస్తామని స్పీకర్ చెప్పడం హాస్యాస్పదమని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎవరో పైపు కోయడం వల్లే నీరు వచ్చాయని స్పీకర్ చెప్పడం శోచనీయమన్నారు. స్పీకర్ తో పాటు తమను అసెంబ్లీలోకి ఆహ్వానించి ఉంటే ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఛాంబర్ తో పాటు ముఖ్యమంత్రి, స్పీకర్, మంత్రుల పేషీలను మీడియాకు చూపించేవాళ్లమని ఆర్కే అన్నారు. తమను ఎందుకు పిలవలేదని నిలదీశారు.  నిరంతరం పోలీసు పహారాలో ఉండే అసెంబ్లీలోకి ఎవరో వచ్చి పైపులు కోశారని స్పీకర్ చెప్పడం, సీఐడీ విచారణకు ఆదేశించడం చూస్తుంటే దీన్ని అటకెక్కించడానికే ఆ పనిచేస్తున్నారన్న అనుమానం కలుగుతోందన్నారు. ఎమ్మెల్యేలను, మీడియానే లోపలికి అనుమతించనప్పుడు అసెంబ్లీలోకి ఇంకెవరో ఎలా వస్తారని ప్రశ్నించారు. అన్యాయంగా ఎవరు వచ్చారో సీసీ పుటేజీ తెచ్చుకుంటే తెలుస్తోంద్నారు.  పోలీసులు మీ జేబులో మనుషులని సీఐడీ విచారణకు ఆదేశించడం కాదని సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆర్కే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

సెక్రటేరియట్ లో కూడ ఇలాంటి లీకేజీ జరిగిందని విలేకరులు ప్రశ్నిస్తే దాంతో నాకు సంబంధం లేదు...దీనిపై సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నామని స్పీకర్ చెప్పడం విడ్డూరమని ఆర్కే అన్నారు. నిర్మాణ దశనుంచే అసెంబ్లీని అడ్డంపెట్టుకొని  బాబు వందలాది కోట్లు దోచుకున్నారని ఆర్కే ధ్వజమెత్తారు. పీసీసీ, ఆర్ సీసీలతో కూడిన ప్లోరింగ్ లు కుంగిపోయినప్పుడే విచారణ జరిపిస్తే బాగుండేదన్నారు. ఆనాడు మేము నెత్తి నోరు మొత్తుకున్నా మమ్మల్ని విమర్శించడానికే సమయం వాడుకున్నారు తప్ప  వాస్తవాలను బయటకు తీసుకురాలేదని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. సీఐడీ విచారణ అని స్పీకర్, విచారణ అయిపోయింది వైయస్సార్సీపీ వాళ్లే ఈ పని చేశారని ఓ మంత్రి మాట్లాడుతున్నారంటే... జరిగిన ఘటనను కప్పిపుచ్చడానికి ఎంతగా ప్రయత్నిస్తారో అర్థమవుతోందన్నారు. 

ప్రస్తుతం కురిసింది కేవలం సెం.మీటరేనని ఇకపై  తుఫాన్ లు వస్తే ఈ ప్రాంతం పరిస్థితేమిటని ఆర్కే ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. రాజధానిలో ప్రభుత్వ అవినీతి నుంచి నిన్నటి లీకుల వరకు సీబీఐ ఎంక్వైరీ వేసి నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. నిన్నటి పైపును మాత్రమే ఫోటోలు చూయించారని, ఇవాళ మీడియాను తీసుకెళ్లేసరికి మళ్లీ జాయింట్ చేశారని ఆర్కే తెలిపారు. అలా జాయింట్ చేసినప్పుడు మీరు సీఐడీ ఎంక్వైరీ వేస్తే  ఏమని రిపోర్ట్ ఇస్తుందని స్పీకర్ తీరును ఎండగట్టారు. ఛాంబర్ లు మీడియాకు చూపించకుండా సాక్ష్యాలు మూసేసి... సీఐడీ విచారణకు ఆదేశించడం అటకెక్కించడానికేనని ఆర్కే దుయ్యబట్టారు. ఎవరు చేసినా తప్పు తప్పేనని,  సీబీఐ ఎంక్వైరీ వేసి వాస్తవలను ప్రజల ముందుకు తీసుకురావాలన్నారు. 
Back to Top