నూతనోత్తేజం తెచ్చిన ‘మరో ప్రజాప్రస్థానం’

మిర్యాలగూడ (నల్గొండ జిల్లా) : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రతో తమ జిల్లాలోని పార్టీ కార్యకర్తల్లో నూతనోత్తేజం వచ్చిందని పార్టీ జిల్లా కన్వీనర్ బీరవోలు సోమిరెడ్డి అన్నారు. ‌మిర్యాలగూడలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి 8వ తేదీన జిల్లాలోని మాల్ వద్ద ప్రారంభమైన‌ శ్రీమతి షర్మిల పాదయాత్ర మునుగోడు, నల్లగొండ, దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాలలో ‌కొనసాగి దామరచర్ల మండలం వాడపల్లిలో ముగిసిందన్నారు.

నల్గొండ జిల్లాలో మొత్తం 16 రోజుల పాటు శ్రీమతి షర్మిల పాదయాత్ర చేశారని బీరవోలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అభిమానులు, ప్రజలు తరలివచ్చి పాదయాత్రను విజయవంతం చేశారన్నారు. యువకులు, మహిళలు, మైనార్టీలతో పాటు అన్ని వర్గాల ప్రజలు పాదయాత్రలో బ్రహ్మరథం పట్టారన్నారు. మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే ఇంత ఆదరణ‌ రావడానికి కారణమని అన్నారు.

మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని అనేక ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్‌, టిడిపిలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెబుతారని సోమిరెడ్డి హెచ్చరించారు. బడుగు, బలహీన వర్గాలు శ్రీ జగన్ వెంట ఉన్నారని‌ శ్రీమతి షర్మిల పాదయాత్రకు తరలివచ్చిన ప్రభంజనాన్ని చూస్తే స్పష్టంగా అర్థమవుతుందన్నారు. నల్గొండ జిల్లాలో శ్రీమతి షర్మిల పాదయాత్ర విజయవంతం కావడానికి సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.‌ హైదరాబాద్ జంట పేలుళ్లకు కార‌కులను కఠినంగా శిక్షించాలని బీరవోలు డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.

వైయస్‌ఆర్‌సిపి సీఈసీ సభ్యురాలు పాదూరి కరుణ మాట్లాడుతూ, శ్రీమతి షర్మిల పాదయాత్రకు సహకరించిన మిర్యాలగూడ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సీఈసీ సభ్యుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా స్టిరింగ్ కమిటీ సభ్యులు ఖా‌సిం, చిలకల శ్రీనివాస్‌రెడ్డి, పట్టణ కన్వీనర్ ముండ్లగిరి కాంతయ్య, నేరేడుచర్ల, మేళ్లచెరువు మండల పార్టీ కన్వీనర్లు పోరెడ్డి నర్సిరెడ్డి, తిరుపతి వెంకయ్య, నాయకులు నరేంద‌ర్‌రెడ్డి, లచ్చిరెడ్డి, సత్యనారాయణరెడ్డి, ఎక్కల శెట్టి రాము, వెంకట్రామ్ తదితరులు పాల్గొన్నారు.
Back to Top