బాబును విమర్శించేందుకు తెలుగులో మాటల్లేవ్

కావలి/ బుచ్చిరెడ్డిపాలెం (నెల్లూరు జిల్లా) : రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాలని కాంగ్రెస్‌ తీసుకున్న నిర్ణయానికి సహకరించిన చంద్రబాబు నాయుడిని విమర్శించేందుకు తెలుగులో మాటలు కూడా లేవని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ఓట్లు, సీట్లు ప్రాతిపదికన కాంగ్రెస్‌ పార్టీ మన రాష్ట్రాన్ని విభజించాలని కుట్ర పన్నితే, దానికి అనుకూలంగా లేఖ ఇచ్చి సహకరించిన దుర్మార్గుడు చంద్రబాబు అని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శ్రీమతి షర్మిల సమైక్య శంఖారావం బస్సు యాత్రలో ఆదివారం పాల్గొన్న మేకపాటి ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన సభల్లో ప్రసంగించారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో మన రాష్ట్రం స్వర్ణయుగంగా ఉందన్నారు. తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌కు సహకరించడం సిగ్గుచేలు అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో ప్రజాభీష్టాన్నిపట్టించుకోవడం లేదన్నారు.

రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడిగొడితే సీమాంధ్రుల ప్రయోజనాలు పూర్తిగా దెబ్బతింటాయని మేకపాటి ఆందోళన వ్యక్తం చేశారు. విభజన ప్రకటనతో సీమాంధ్ర ఒక్కసారిగా భగ్గుమనడంతో బెంబేలెత్తిన బాబు సీమాంధ్రకు న్యాయం జరగాలంటూ ఆత్మగౌరవ యాత్ర మొదలు పెట్టడం సిగ్గుచేలు అన్నారు. అసలు విభజనకు కారణం బాబు కాదా అని మేకపాటి ప్రశ్నిం చారు. విభజన కోసం చంద్రబాబు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకున్న తర్వాతే సీమాంధ్రలో యాత్ర చేయాలని సూచించారు. రాష్ట్రాన్ని ఎప్పటికీ సమైక్యంగానే ఉంచాలని, ఇందు కోసం వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తుందని మేకపాటి చెప్పారు.

జూలై 30న రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన వెంటనే తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసిన విషయాన్ని ఎంపి మేకపాటి గుర్తు చేశారు. స్పీకర్‌ ఫార్మాట్‌లోనే తాము రాజీనామాలు చేశామని, వాటిని ఎప్పుడైనా ఆమోదించవచ్చని చెప్పారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top