పట్టిసీమతో రాయ‌లసీమ‌కు ప్రయోజనం శూన్యం


ఉరవకొండ: రాయలసీమ పట్ల చంద్రబాబు అనుసరిస్తున్న  తీరును వైయస్‌ఆర్‌సీపీ
నేతలు తూర్పారబట్టారు. రాయ‌లసీమ‌ పేరు చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రం వద్ద, ఇతర బడా పారిశ్రామిక వేత్తల వద్ద పెద్ద
ఎత్తున నిధులు సేకరించి స్వాహ చేస్తున్నాడే తప్ప రాయ‌లసీమ‌ అభివృద్ధి కోసం ఒక్క
పైసా కుడా వినియోగించడం లేదని అనంతపురం మాజీ పార్లమెంట్‌ సభ్యులు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన
కార్యదర్శి అనంతవెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. సోమ‌వారం నియోజకవర్గ కేంద్రమైన
ఉరవకొండలోని చెంగల వీధిలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకూ వైయస్‌ఆర్‌
కాంగ్రెస్‌ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన పార్టీ
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి  విలేకరులతో
 మాట్లాడుతూ శ్రీశైలం నీటి విషయంలో అనంతపురం జిల్లాకు  చెందిన మంత్రులు, అధికార పార్టీ  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విప్‌లు నోరు మోదపక పోవడం బాధకరమ‌న్నారు.
శ్రీశైలం నుండి దిగువనున్న రాయ‌లసీమ‌కు నీళ్లు ఇవ్వాల్సి ఉన్నా.. చుక్క నీరు వదలడం
లేదన్నారు. జలాశయంలో నీరు పూర్తి గా  రాకముందే కృష్ణా డెల్టాకు
వదులుతున్నారని తెలిపారు. శ్రీశైలం జలాశయంలో 836 అడుగుల నుండి 854 అడుగులకు నీరు వస్తే కృష్ణాకు  విడుదల
చేయాల్సి వుండగా,
కరువు పీడిత రాయ‌లసీమ‌
 జిల్లాలకు అన్యాయం చేస్తూ కృష్ణాకు నీరు తీసుకెళుతున్నారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సమ‌ర్ధిస్తూ జీవో నెం 69ను విడుదల చేసిందని  దీని ద్వారా రాయ‌లసీమ‌
ప్రాంత అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. పట్టిసీమ‌తో
రాయ‌లసీమ‌కు ఎంతో ఉపయోగం అని చెబుతున్నా ప్రభుత్వం సీమ ప్రజలను మ‌భ్యపెట్టి కోట్లు
కొల్లగొడుతున్నారని ఆరోపించారు.  ప్రభుత్వం హంద్రీనీవా ద్వారా చెరువులు
నింపుతామ‌ని చెబుతుందని,
అయితే చెరువుల
కింద ఉన్న ఆయ‌కట్టు కూడా నీరు అందిస్తారో లేదో చెప్పాలని నిలదీశారు. హంద్రీనీవా
మొదటి దశ కింద ఉరవకొండ,
రాయ‌దుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాలలో 85 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి వుండగా, చంద్రబాబు అధికారం చేపట్టి రెండేళ్లు పూర్త‌యినా
చుక్కనీరు ఇవ్వలేదన్నారు.

నీటి కోసం పోరాటం ఆగదు: ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి

హంద్రీనీవా ను పూర్తి చేసి ఆయకట్టుకు నీరు ఇవ్వాలని గతంలో తాము ఎన్నో పోరాటాలు
చేశామ‌ని,
జిల్లా రైతుల
సంక్షేమం కోసం పోరాడుతునే ఉంటామని ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు.
ఆగస్టు నెలాఖరులోగా 30 వేల ఎకరాలకు నీరు అందేలా చేస్తామ‌ని హామీ
ఇచ్చిన అధికార పార్టీ నేతలు మాట తప్పుతున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఆగస్టు నెల సమీపిస్తున్నా
ఎక్కడా ఆదిశగా చర్యలు చేపట్టడం లేదన్నారు.   

 

తాజా వీడియోలు

Back to Top