ఆంటోని కమిటీతో ఏమిటీ ప్రయోజనం?

రైల్వేకోడూరు (వైయస్ఆర్‌ జిల్లా),

17 ఆగస్టు 2013 : కాంగ్రెస్‌ పార్టీ వేసిన ఎ.కె. ఆంటోని కమిటీ వల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనం అని రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ప్రశ్నించారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌ అనుసరిస్తున్న నిరంకుశ, ఏకపక్ష ధోరణికి నిరసనగా ఆయన రైల్వేకోడూరులో నిరవధిన నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన చేస్తున్న ఆమరణ నిరశన దీక్ష శనివారానికి మూడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మీడియాతో శ్రీనివాసులు మాట్లాడుతూ... రాష్ట్ర విభజనకు సహకరించిన పార్టీలు అన్ని భూస్థాపితం కాక తప్పదని హెచ్చరించారు.

ఇలా ఉండగా, వైయస్ఆర్ కడప జిల్లాలో సమైక్యవాదులు చేపట్టిన నిరసనల హోరు ఉధృతంగా ‌కొనసాగుతోంది. కడప నగరంలో‌ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి,‌ కడప మాజీ మేయర్ రవీంద్ర‌నాథ్‌రెడ్డిలతో పాటు ఇదే జిల్లాలోని రాజంపేటలో స్థానిక ఎమ్మెల్యే ఆమర్నా‌థ్‌రెడ్డి చేస్తున్నారు. శ్రీకాంత్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డిల ఆమరణ నిరాహార దీక్ష శనివారం ఆరవ రోజుకు చేరుకుంది. కడప కలెక్టరేట్ ఎదుట వికలాంగుల ఆమరణ దీక్షతో‌ పాటు న్యాయవాదులు, ఉపాధ్యాయులు చేస్తున్న రిలే దీక్షలు కూడా కొనసాగుతున్నాయి.

Back to Top