వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులుండవు

ఎన్నికలు
ఎప్పుడు వచ్చినా విజయం మాదే

సీనియర్
నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి

 

అనంతపురం : ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన
మోసాన్ని గర్హిస్తూ, వారి వంచనను ప్రజలకు వివరించడానికి సోమవారం నాడు అనంతపురం లో
వైయస్ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వంచన పై దీక్ష ను నిర్వహిస్తున్నారు. పార్టీకి
చెందిన మాజీ ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ,నియోజకవర్గాల సమన్వయ కర్తలు,
సీనియర్ నాయకులంతా ఈ దీక్ష లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం
ప్రత్యేక హోదా కోసం పదవులను తృణప్రాయంగా వదులుకున్న మాజీ ఎంపిలు మేకపాటి రాజమోహన్
రెడ్డి, మిథున్ రెడ్డి, వరప్రసాద్ , మాజీ ఎంపి అనంత వెంకట్రామిరెడ్డి లు మీడియాతో
మాట్లాడారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో వైయస్ ఆర్ కాంగ్రెస్ ఏ పార్టీతోనూ
పొత్తు పెట్టుకోబోదని సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి మరోసారి స్పష్టం
చేశారు.

మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ విభజన చట్టంలోని హామీలను
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నెరవేర్చలేదని, అలాగే నాలుగేళ్లుగా బిజెపితో కలిసి
ఉన్న టిడిపి ప్రత్యేకంగా సాధించేదేమీ లేదని విమర్శించారు. కేవలం రాజకీయ
ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఎన్నికలకు ముందు ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన
చంద్రబాబు, ప్రధానమంత్రిపై నిందలు వేసి తప్పించుకో చూస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రయోజనాల కోసమే పార్టీ నేతలు ఎంపీ
పదవులకు రాజీనామాలు చేసినట్లు వెల్లడించారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం
పెట్టగానే చంద్రబాబు భయపడ్డారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం నుంచి 25
స్థానాలు గెలుచుకుని వైయస్ ఆర్ కాంగ్రెస్ కేంద్రంలో కీలకంగా మారుతుందని, ఎన్నికలు
ఎప్పుడు వచ్చినా తమ పార్టీ సిద్ధంగా ఉందని, ఉపఎన్నికలు వచ్చినా గెలుపు తమదే అని
ధీమా వ్యక్తం చేశారు.

 వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై
చంద్రబాబు నాయుడు అర్థంలేని విమర్శలు చేస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన
600 పైగా హామీలపై చంద్రబాబు పూర్తిగా విస్మరించారన్నారు. దళితుల్లో ఎవరైనా
పుట్టాలని కోరుకుంటారా అని వ్యాఖ్యానించిన చంద్రబాబు దళిత తేజం కార్యక్రమంతోఆ
వర్గాలను ఉద్దరిస్తామని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

రాష్ట్ర ప్రయోజనాలపై
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని  మాజీ ఎంపి మిథున్‌ రెడ్డి  విమర్శించారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి
నాయకత్వంలోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని స్పష్టం చేశారు.

చంద్రబాబు నాయుడు ఓ జిత్తుల మారి నక్కలా
వ్యవహరిస్తున్నారని, డబ్బు కోసమే హోదాను తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజికి
ఒప్పుకున్నారని మాజీ ఎంపి వరప్రసాద్ మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు భారీ అవినీతికి
పాల్పడుతున్నారని ఆరోపించారు. అనేక సార్లు విదేశీ పర్యటనలకు వెళ్లిన ముఖ్యమంత్రి
ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. పేదలను అవమానించే వ్యక్తికి సిఎంగా
కొనసాగే అర్హత లేదన్నారు. 

తాజా వీడియోలు

Back to Top