వైయస్సార్సీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరు

నంద్యాల:నంద్యాల ఉప ఎన్నికలో వైయస్సార్సీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని వైయస్సార్సీపీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి అన్నారు. శనివారం నంద్యాల పట్టణం 32వ వార్డులో విశ్వాసపురం, జ్ఞానాపురం, వీధుల్లో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  వైయస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు  ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా శిల్పామోహన్‌రెడ్డి మాట్లాడుతూ వైయస్సార్సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో నంద్యాల ఉప ఎన్నికల్లో విజయ ఢంకా మోగించడం తథ్యమన్నారు. ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవని, ఓటు విలువైందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారిని కోరారు. ఈ ఎన్నికలు ధర్మానికి , అధర్మానికి  మధ్య జరుగుతున్న పోరాటమని, ఈ పోరులో ధర్మానికి  ప్రాతినిధ్యం వహిస్తున్నవైయస్సార్సీపీదే  అంతిమ విజయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నీతి, న్యాయమైన పాలన సాగాలంటే జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమవుతుందని, దీనికి ప్రతి ఒక్కరి మద్దతు కావాలని ప్రజలను కోరారు. రాష్ట్ర ప్రజలు జగన్‌ను ముఖ్యమంత్రిగా చూసేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నారన్నారు. నంద్యాల ప్రజలు వైయస్సార్సీపీకి బ్రహ్మరథం పడుతున్నారని, బహిరంగ సభను విజయవంతం చేయడం ద్వారా ప్రజలను దీనిని నిరూపించారని అన్నారు. కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ సమిష్టిగా కృషి చేసి తనను గెలిపించాలని కోరారు. ప్రచారంలో కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దేశం సులోచన, వార్డు ఇన్‌చార్జి పాషావలి, నాయకులు జడ్సన్, డాక్టర్‌మనోజ్‌కుమార్, మోహన్‌రావు, మేకల శేఖర్, అమృతం, ప్రసాద్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top