అసెంబ్లీ భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదు

చిత్తూరు: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నూతనంగా నిర్మించిన అసెంబ్లీ భవనాల ప్రారంభోత్సవానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం ఆహ్వానం పలకలేదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. కనీసం ఫోన్‌లో కూడా మెసేజ్‌ పెట్టలేదని ఆయన తెలిపారు. గురువారం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..బస్సు ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్‌ మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండానే చేసినట్లు చెప్పిన జిల్లా కలెక్టర్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌కు మద్దతు పలికిన ఐఏఎస్‌ సంఘాలు వనజాక్షి విషయంలో ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో గుర్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఐఏఎస్‌లు అధికార పార్టీకి వత్తాసు పలకడం సరికాదని ఆయన హితవు పలికారు. అధికారులు నిష్పక్షపాతంగా పని చేయాలని పెద్దిరెడ్డి సూచించారు. బస్సు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కేసు నమోదు చేయడం బాధాకరమన్నారు.

Back to Top