ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో వాస్తవాలు లేవు

హైదరాబాద్:

రానున్న ఆరు నెలల కోసం ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో సరైన సమాచారం లేదని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యాఖ్యానించింది. ఏదో మొక్కుబడిగా ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లు ఉందని దుయ్యబట్టింది. బడ్జెట్‌ సమర్పణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణే కనిపించిందని విమర్శించింది. అంపశయ్య మీద ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజా విద్రోహక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని పార్టీ మండిపడింది. అంకెల గారడీతో ప్రజలను మోసపుచ్చిందని దుయ్యబట్టింది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ గురించి గొప్పలు చెప్పుకొన్నప్పటికీ అందులో తాజా గణాంకాలు లేనేలేవని పేర్కొంది. టీడీపీలో ఎప్పుడు చేరిపోదామా అనే తొందరే మంత్రి ఆనంలో కనిపించిందని వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ‌సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

బడ్జెట్‌ ప్రసంగాన్ని సభలో చదడానికి మంత్రి ఆనం ఏమాత్రం ఓపిక లేకుండా వ్యవహరించారు తూర్పారపట్టారు. శాసనసభలో ఆర్థిక మంత్రి ఆనం రాజ్యంగ సాంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించారని రామచంద్రారెడ్డి విమర్శించారు. సభను సజావుగా నిర్వహించడం స్పీకర్‌ బాధ్యత అయినప్పటికీ బడ్జెట్‌ను పూర్తిగ చదవడానికి మంత్రి ఆనం ఏమాత్రం ఓర్పు వహించకపోవడమే కాకుండా సభ అదుపులో లేదని వ్యాఖ్యానించడం తగదన్నారు. బడ్జెట్‌లోని పేజీలకు పేజీలు తప్పించి ప్రసంగాన్ని మంత్రి చదవడాన్ని ఆయన తప్పుపట్టారు. ఆర్థిక మంత్రి  బడ్జెట్‌లో వాస్తవాలు లేవని అన్నారు. గత ఏడాది ఏమి సాధించారో బడ్జెట్‌లో చెప్పలేదన్నారు. సంక్షేమ పథకాలకు నిధులు వెచ్చించలేదని ఎత్తి చూపారు. ప్రభుత్వ అసమర్ధత వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తీసుకురాలేకపోయిందని కాపు అన్నారు.

ఈ చేతకాని ప్రభుత్వాన్ని చూస్తే సిగ్గేస్తుందని కాపు అన్నారు. ప్రభుత్వ చేతగానితనం కళ్లకు కట్టినట్లుందని పేర్కొన్నారు. పీఆర్పీకి పట్టిన గతే టీడీపీకీ పడుతుందన్నారు. చంద్రబాబు టీడీపీని త్వరలోనే బీజేపీలో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవికి పరిమితం అవుతారని రామచంద్రారెడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం ఆడిస్తున్నట్టల్లా ఆడుతున్న సీఎం కిర‌ణ్‌కుమార్‌రెడ్డి బండారం త్వరలోనే బట్టబయలు కానుందని రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని విభజించాలని సీడబ్ల్యూసీ నిర్ణయించిన రోజే కిరణ్ రాజీనామా చే‌సి ఉంటే విభజన జరిగేదే కాదన్నారు.

Back to Top