బాబు, మంత్రులు రాజధానికి ఏమిచ్చారు..?

రాజధాని ముసుగులో రైతుల భూములు కొల్లగొట్టే యత్నం
భూసేకరకు వచ్చిన సీఆర్డీఏ అధికారులపై రైతుల ఆగ్రహం
పేద రైతులను దోచుకొని వీదేశీయలకు కట్టబెడతారా
బాబు, మంత్రుల ఆస్తులు ఎందుకు ఇవ్వరని నిలదీసిన రైతులు
 
గుంటూరు(మంగళగిరి):రాజధాని ప్రాంతంలో  భూములివ్వని రైతులపై  ప్రభుత్వం కక్షసాధింపుకు పాల్పడుతోంది.  రాజధాని ముసుగులో రైతుల భూములను కొట్టేసేందుకు సిద్ధమైన ప్రభుత్వానికి ఉండవల్లి, పెనుమాక రైతులు గట్టి షాక్ ఇచ్చారు. భూసేకరణ వైపు అడుగులు వేస్తున్న సీఆర్‌డీఏకు ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని నగర భూసేకరణ, సామాజిక ప్రభావం అంచనా అధ్యయనం కోసం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో గ్రామసభ నిర్వహించారు. జిల్లా సీఆర్‌డీఏ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావు, పెనుమాక సీఆర్‌డీఏ డిప్యూటీ కలెక్టర్ రాధాకృష్ణ తదితరులు హాజరయ్యారు. గ్రామసభ విషయమై గ్రామస్తులెవరికీ సమాచారం ఇవ్వలేదు. ఉదయం 11 గంటల సమయంలో సభ జరుగుతున్న విషయం తెలుసుకున్న గ్రామ రైతులు సుమారు 70 మంది అక్కడికి చేరుకుని సీఆర్‌డీఏ అధికారులను నిలదీశారు.

తమ భూములిమ్మంటున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణలు రాజధానికి ఏమిచ్చారని ప్రశ్నించారు. వారి భూములు, ఆస్తులు దాచి పెట్టుకుంటారు.. మా భూములు మాత్రం త్యాగంచేయాలా అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  పేద రైతుల భూములు లాక్కొని విదేశీ సంస్థలకు కట్టబెట్టి అందినకాడికి దోచుకోవడమేనా సీఎం, మంత్రుల త్యాగం అంటూ ధ్వజమెత్తారు. దీంతో కంగుతిన్న సీఆర్‌డీఏ అధికారులు  సర్వే నిర్వహించే ఈపీటీఆర్ సంస్థను పరిచయం చేసి వారికి సహకరించాలని మాత్రమే కోరడానికి వచ్చామని, ఆ ప్రతినిధులు మీ ఇళ్లకు వచ్చినప్పుడు మీ అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు. గ్రామసభ జరిగినట్లు రైతులు సంతకాలు చేయాలని కోరగా తాము సంతకాలు చేయబోమంటూ రైతులు మూకుమ్మడిగా సమాధానం ఇవ్వడంతో చేసేదేమిలేక అధికారులు, ఈపీటీఆర్ ప్రతినిధులు గ్రామసభను వాయిదా వేసి వెనుదిరిగారు.
Back to Top