చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం


() ప్ర‌భుత్వం అన్ని రంగాల్లో వైఫ‌ల్యం చెంద‌టంపై నిర‌స‌న‌
() అవినీతి లో మునిగి తేల‌డం మీద వ్య‌తిరేక‌త‌
() అవిశ్వాసం తెచ్చేందుకు వైఎస్సార్సీపీ నిర్ణ‌యం

హైద‌రాబాద్‌) చంద్రబాబు ప్రభుత్వంపై రానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం పెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నిర్ణయించింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 
ప్రభుత్వం అన్నిరంగాల్లో వైఫల్యం చెందడం, అవినీతిలో మునిగితేలడం, హామీల అమలులో మాటతప్పడం వంటి అంశాలకు నిరసనగా అవిశ్వాసతీర్మానాన్ని ప్రవేశపెట్టాలని వారు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎమ్మెల్యేలనుద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టడంలో పార్టీ శాసనసభ్యులంతా ముందుండాలన్నారు. ప్రజాసమస్యలు, ప్రభుత్వ వైఫల్యాల్ని అసెంబ్లీలో ప్రస్తావించకుండా పక్కదోవ పట్టించేందుకు అధికారపక్షం ప్రయత్నిస్తుందంటూ ఎమ్మెల్యేలను ఆయన అప్రమత్తం చేశారు. అధికారపక్షం వ్యూహాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ప్రజాసమస్యలపైనే దృష్టినంతా కేంద్రీకరించాలని, వైఫల్యాలపై ప్రభుత్వాన్ని ఎండగట్టాలని జగన్ సూచించారు. రెండేళ్ల పాలనలో చంద్రబాబు ప్రభుత్వం అవినీతిలో మునిగితేలుతోందని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు.
Back to Top