'నితాఖత్' సంక్షోభ పరిష్కార చర్యలు చేపట్టండి

హైదరాబాద్, 17 మే 2013:

సౌదీ అరేబియాలో నూతనంగా ప్రవేశపెట్టిన కార్మిక చట్టం నితాఖత్ అమలు కారణంగా ఏర్పడిన సంక్షోభాన్ని పరిష్కరించేందుకు  తక్షణ చర్యలు చేపట్టాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ప్రధాన మంత్రికి విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు ఆమె ప్రధాని మన్మోహన్ సింగ్‌కు శుక్రవారం ఓ లేఖ రాశారు.

ప్రధానికి శ్రీమతి విజయమ్మ రాసిన లేఖ పూర్తి పాఠం..

ప్రవాస భారతీయ కార్మికులు స్వదేశానికి తిరిగి వెళ్ళడానికి మరో మూడు నెలల గడువు ఇవ్వాలన్న అంశాన్ని సౌదీ అరేబియా ప్రభుత్వం తిరస్కరించిన నేపథ్యంలో  ఈ చర్య తప్పని సరి. జూలై మూడో తేదీకి ఈ గడువు ముగుస్తోంది. నితాఖత్ అమలు ప్రారంభమయ్యే లోపు అవసరమైన పత్రాలను పొందడం కార్మికులకు కష్టసాధ్యం.  ఈ అంశంలో భారత ప్రభుత్వం జోక్యం చేసుకుని సౌదీ ప్రభుత్వంపై దౌత్యపరమైన ఒత్తిడి తెచ్చి, నితాఖత్ చట్టం అమలులో సరళంగా వ్యవహరించేలా చూడాలి. లేకుంటే భారతదేశం నుంచి ఉపాధి కోసం అక్కడికి వెళ్ళిన కార్మికులు పెను సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదముంది.

సౌదీ ప్రభుత్వం నితాఖత్ చట్టాన్ని అమలుచేసేందుకు కృతనిశ్చయంతో ఉంది. తద్వారా సౌదీ వాసులకు ఉపాధి కలిగేలా చర్యలు తీసుకుంటోంది. దీనివల్ల ప్రవాస భారతీయులు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో వారికి ఉపాధి కల్పించేందుకు వీలుగా భారత్ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నితాఖత్ చట్టం కారణంగా 12 లక్షల మంది భారతీయులు ఇబ్బంది పడే అవకాశముంది. వీరిలో లక్ష మంది మన రాష్ట్రానికి చెందిన వారే ఉంటారు. ఈ కారణంగా ఉపాధి కోల్పోయే కార్మికుల ప్రభావం రాష్ట్రంలో ఆర్థిక, సామాజిక సంక్షోభాన్ని సృష్టించే అవకాశం కూడా ఉంది. దీనివల్ల మన రాష్ట్రానికి ప్రవాస భారతీయ నిధులు తగ్గుతాయని  వేరే చెప్పాల్సిన అవసరం లేదు.

నితాఖత్ చట్టం అమలులోకి తెచ్చేందుకు ఎక్కువ సమయం తీసుకోవాలని కోరుతూ సౌదీ ప్రభుత్వానికి అత్యవసరంగా ఒక లేఖను పంపాలని మిమ్మల్ని కోరుతున్నాను. దీనివల్ల ప్రవాస భారతీయులకు ఎక్కువ సమయం చిక్కుతుంది. ఇప్పటికిప్పుడు వారికి ఇబ్బందులు ఎదురుకావు. ఈ అంశాన్ని పరిష్కరించడానికి సౌదీ ప్రభుత్వంతో దౌత్యపరమైన చర్చలు ప్రారంభించాలి.

నితాఖత్ చట్టం అమలు, ఎదురయ్యే పరిణామాలను సమర్థంగా ఎదుర్కొనడానికి అత్యున్నత అధికారాలు కలిగిన కార్యాచరణ కమిటీని నియమించాలని కూడా కోరుతున్నాను. ఈలోగా సౌదీలో ఉన్న ప్రవాస భారతీయులకు ప్రత్యామ్నాయ ఉపాధికి  ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కూడా విజ్ఞప్తిచేస్తున్నాను.

ఇట్లు
శ్రీమతి వైయస్ విజయమ్మ
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు

Back to Top