నిరూపిస్తే ఇంటికి వెళ్లిపోతా

వల్లభి(ఖమ్మం జిల్లా):

‘రక్షణ స్టీల్సు’తో తమకెలాంటి సంబంధం లేదని శ్రీమతి వైయస్ షర్మిల విస్పష్టంగా ప్రకటించారు. ఉందని నిరూపిస్తే అదే రోజు తాను పాదయాత్ర ఆపేసి ఇంటికెళ్ళిపోతానని సవాలు చేశారు. నిరూపించలేకపోతే చంద్రబాబు ఆయన పదవులకు రాజీనామా చేసి ఇంటికెళ్లిపోతారా? అని నిలదీశారు. బయ్యారం ఖనిజాన్ని తవ్వుకొనే హక్కును దివంగత మహానేత  రక్షణ స్టీల్సు సంస్థకు ఇవ్వలేదనీ,  ప్రభుత్వరంగ సంస్థ ఏపీఎండీసీనే తవ్వాలని ఆకాంక్షించారనీ ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ పెట్టాలని సంకల్పించారని కూడా శ్రీమతి షర్మిల చెప్పారు. ఆ గనులతో తమకు సంబంధం లేదని అనేక మార్లు చెప్పినప్పటికీ  కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ నేతలు పదేపదే అవే ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. బయ్యారం గనులు, రక్షణ స్టీల్సు ఒప్పందం రద్దు చేసి రెండేళ్లకు పైనే అవుతోందనీ, అప్పుడు, ఇప్పుడూ మా పక్షాన, మా పార్టీలోనే ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి అనే మంత్రి దాన్ని రద్దు చేశారనీ వివరించారు. రద్దు చేసి ఇన్ని రోజులైనా.., అది నాదని, మహానేత నాకు కట్నం కింద ఇచ్చారనీ, రక్షణ స్టీల్సు నాదనీ, నా బినామీలే ఉన్నారనీ నాయకులు ఈ రోజుకూ ప్రచారం చేస్తున్నారన్నారు. అంటే వాళ్ల మనసులో ఎంత దురుద్దేశం ఉందో అర్థమవుతోందని పేర్కొన్నారు.

వందసార్లు చేశారీ ఆరోపణలు
ఈ ఆరోపణలు ఒకటి, రెండుసార్లు కాదు ఇప్పటికి 100 సార్లు చేసుంటారన్నారు. ప్రతిసారీ వీళ్లకు సమాధానం ఇస్తూనే ఉన్నామనీ అయినా..‘దున్నపోతు మీద వాన పడ్డట్టు’ ఉంది కానీ తమ మాటలు వాళ్ల మట్టి బుర్రలకు ఎక్కడంలేదని ధ్వజమెత్తారు. ఈ పార్టీ నాయకులందరికీ.. మరీ ముఖ్యంగా చంద్రబాబునాయుడుకు సవాల్ చేస్తున్నాం. చంద్రబాబుగారూ..! ఇంకొకసారి బయ్యారం గనులను వైయస్ఆర్ అల్లునికి, కూతురుకు కట్టబెట్టారని అనే ముందు ఒకసారి ఆలోచన చేసుకొని నా సవాల్‌ను జ్ఞాపకం చేసుకోవాలని సూచించారు. దివంగత మహానేత  బిడ్డగా నేను సవాల్ చేస్తున్నాను.. బయ్యారం గనుల్లో, రక్షణ స్టీల్సులో నాకు భాగం ఉంది అని చంద్రబాబుగారు నిరూపించగలిగితే.., అదే రోజున నేను పెట్టేబేడా సర్దుకొని, ప్రజలకు క్షమాపణ చెప్పి, పాదయాత్ర ముగించి ఇంటికి వెళ్లిపోతానని సవాలు చేశారు.

కానీ.. చంద్రబాబుగారూ..! మీరు నిరూపించలేకపోతే మీ పార్టీకి, మీ పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోతారా? అని నిలదీశారు. దీనికి చంద్రబాబుగారు సమాధానం చెప్పాలన్నారు. నా మీద ఆరోపణలు చేస్తున్న ఎవరైనా సరే నా సవాలును స్వీకరిస్తారా అని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబునాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించింది. మధిర నియోజకవర్గం వల్లభి గ్రామంలో తనకు స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలనుద్దేశించి షర్మిల ప్రసంగించారు.

ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే...


ఈ ఖమ్మం జిల్లాలోనే ఉన్న బయ్యారం గనులను తవ్వుకునే హక్కును వైయస్ఆర్‌ గారు రక్షణ స్టీల్సుకు ఇవ్వలేదు. బయ్యారం గనులు ఎప్పటికీ ప్రభుత్వరంగ సంస్థ ఏపీఎండీసీకే చెందాలని ఆకాంక్షించారు. ఏపీఎండీసీ లాభాలు చూసుకొని బయ్యారం ఖనిజాన్ని రక్షణ స్టీల్సుకు అమ్మాలని, రక్షణ స్టీల్సు  కంపెనీ తెలంగాణ ప్రాంతంలోనే ఉక్కు పరిశ్రమను కట్టించి అందులోనే బయ్యారం ఖనిజాన్ని ఉపయోగించాలని వైయస్ఆర్ సంకల్పించారు. ఆమేరకే ఒప్పందం చేశారు. తెలంగాణ వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు, గిరిజనులకు ఉపాధి కల్పించడం కోసం, బయ్యారానికి సమీపంలోని వరంగల్ జిల్లా రాజోలి గ్రామంలో ఉక్కు పరిశ్రమ పెట్టాలని ఆయన సంకల్పించారు.

బయ్యారం గనులను మహానేత ప్రైవేటుపరం చేయబోతే, తాను విశాఖ ఉక్కుకు ఇచ్చానని ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్న కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ గిరిజనులకు తీవ్ర అన్యాయం చేశారు. కిరణ్‌కుమార్ రెడ్డిగారు, తెలుగుదేశం నాయకులారా..! ఒక్కసారి రాజోలి వెళ్లి అక్కడి గిరిజనులను అడగండి. వాళ్లు చెప్తారు.. ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ రాకపోతే తెలంగాణ ప్రజలకెంత అన్యాయం జరుగుతుందో తెలుస్తుంది. ఇదే చంద్రబాబునాయుడుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 25 లక్షల ఎకరాల వజ్రాల గనులను ఓ ప్రైవేటు కంపెనీకి కేటాయించారు. అది సక్రమమే అయినప్పుడు డాక్టర్ వైయస్ఆర్ ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీకి లాభం వచ్చేలా చేసి తెలంగాణ ప్రాంతంలో ఒక పరిశ్రమ పెట్టేలా చేస్తే అక్రమమెలా అవుతుందని అడుతున్నా.

చంద్రబాబుగారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున ఐఎంజీ అనే ఒక బోగస్ కంపెనీకి 850 ఎకరాలు కేటాయించారు. అప్పుడు దాని విలువ రూ. 2,500 కోట్లు. ఈరోజు దాని విలువ రూ,10 వేల కోట్లు. కానీ.. చంద్రబాబునాయుడు కేవలం రూ.4 కోట్లకు ఆయన బినామీ సంస్థకు కట్టబెట్టారంటే ఆయనది అవినీతి కాదా అని అడుగుతున్నాం. చంద్రబాబునాయుడుగారి అవినీతి ఈ సీబీఐకి కనిపించడంలేదా అని అడుగుతున్నాం. మీకు కనపడదు. ఎందుకంటే చంద్రబాబు, కాంగ్రెస్, సీబీఐ కుమ్మక్కయ్యారు కనుక. వారు ఒకరిని ఒకరు కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు.

చైతన్యం రావాల్సింది ఈ ప్రభుత్వంలో..
కరెంటు లేక, నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయి. వేసిన ప్రతి పంటలో నష్టమొచ్చి రైతులంతా అప్పులపాలై అల్లాడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇవాళ ‘రైతు చైతన్య యాత్రలు’ అంటూ బయల్దేరింది. నిజానికి చైతన్యం కావాల్సింది రైతులు కాదు. ఈ ప్రభుత్వంలో చైతన్యం రావాలి. రైతును ఇంత దుస్థితికి దిగజార్చిన ఈ కాంగ్రెస్ పాలకులు ఈరోజు ఏ మొఖం పెట్టుకోని రైతు చైతన్య యాత్రలని వెళ్తున్నారు? ఈ కాంగ్రెస్ పాలకులకు చెప్తున్నాం.. మీరు రైతు చైతన్య యాత్రలు చేయండి.. కానీ జాగ్రత్త. ప్రజలు మిమ్మల్ని రాళ్లతో కొడతారేమో.. చూడండి.

Back to Top