నిరూపించగలవా.. గాయపడలేదని?

గుంటూరు, మాచర్ల:

వైయస్ఆర్ కాంగ్రెస్ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల కాలికి అసలు శస్త్ర చికిత్సే కాలేదని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు చేసిన ఆరోపణపై ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. గుంటూరులో గురువారం విలేకరుల సమావేశంలో అంబటి, మాచర్లలోని నెహ్రూ నగర్‌లో పిన్నెల్లి ఈ అంశంపై మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నాయకులు నీచ ఆరోపణలు చేస్తూ రాజకీయాలు చేయడం సరికాదని అంబటి చెప్పారు. శ్రీమతి షర్మిలకు అసలు దెబ్బే తగలలేదనీ, శస్త్ర చికిత్స డ్రామా అని గాలి వ్యాఖ్యానించడం దురదృష్టకరమన్నారు.

     అలిపిరి బాంబు పేలుడులో నాటి సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్రంగా గాయపడితే  దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తిరుపతిలో మౌన దీక్ష చేశారనీ, హెలిప్యాడ్‌లో చంద్రబాబును చూసి ఆయన కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారనీ గుర్తులేదా అని ఆయన గాలిని ప్రశ్నించారు. టీడీపీ నేతలు, చంద్రబాబు ఈ తరహా కక్షపూరిత రాజకీయాలు చేయడం సరికాదనీ, శ్రీమతి షర్మిల కాలికి గాయాలు కాలేదని నిరూపించగలరా అనీ అంబటి నిలదీశారు. శ్రీమతి షర్మిల గాయంపై నీచమైన ఆరోపణలు చేసిన గాలి బేషరతుగా ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. రోజుకో పార్టీలో చేరి రాజకీయ వ్యభిచారిగా మారిన ముద్దుకృష్ణమకు ఎదుటివారిపై నోటికొచ్చినట్లు మాట్లాడటం అలవాటైందన్నారు. ‘మరో ప్రజాప్రస్థానా’నికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. వాటిని వెనక్కు తీసుకోకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Back to Top