నేతన్నకు న్యాయం చేయండి : ఆగష్టు 1, 2012

రాష్ట్రంలోని చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. మంగళవారం సచివాలయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసిన పార్టీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి, నేతలు గట్టు రామచంద్రరావు, కె.కె.మహేందర్‌రెడ్డి, జి.నగేశ్, రాజ్‌ఠాకూర్, పుట్టా మధులు ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. అనంతరం గట్టు మీడియాతో మాట్లాడారు. నేత కార్మికుల సమస్యల పరిష్కారానికి నిర్దిష్ట డిమాండ్లతో సీఎంను కలిసినట్లు చెప్పారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధర్మవరంలో దీక్ష చేపట్టారని, ఆ దీక్షలో భాగంగా చేసిన డిమాండ్లలో ఏ ఒక్కటీ పరిష్కారానికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దీక్షకు కొనసాగింపుగానే పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఇటీవల సిరిసిల్లలో ధర్నా చేపట్టి నేతన్నల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపర్చాల్సిన బాధ్యత ఆ అధికారాన్ని అనుభవిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. తమ పార్టీ డిమాండ్లపై సీఎం నిర్దిష్టమైన హామీ ఇచ్చినట్లుగా కనిపించలేదని గట్టు అన్నారు. కేంద్రం చేయాల్సినవి కేంద్రం చేసినా, తాము చేయాల్సినవి తాము చేస్తామని కూడా సీఎం చెప్పలేదన్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ వినతిపత్రంలో డిమాండ్లు...

గతంలో దివంగత సీఎం వైఎస్ చేనేత కార్మికులకు ప్రకటించిన రూ.312 కోట్ల రుణమాఫీని అమలుచేయాలి.

నేతన్నలకు వృద్ధాప్య పింఛన్‌ను రూ.1,000కి పెంచాలి.
నూలుపై ఇన్‌పుట్ సబ్సిడీని 20 శాతానికి పెంచాలి.
చేనేత మగ్గాలకు విద్యుత్ సబ్సిడీని 75 శాతానికి పెంచాలి.
నూలు ఉత్పత్తుల మద్దతు ధరను నిర్ణయించేందుకు అమ్మకపు ధరతో పాటు మ్యాచింగ్ గ్రాంటును కలపాలి.
నేతన్నల ఉత్పత్తుల విక్రయానికి ఔట్‌లెట్‌లు ఏర్పాటు చేయాలి.
చేనేత కార్మికుల పిల్లలందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీంను వర్తింపజేయాలి.
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, రుణమాఫీలో లబ్ధి పొందేందుకు చేనేత కార్మికులందరికీ గుర్తింపుకార్డులివ్వాలి.
మగ్గాల షెడ్‌లను ఏర్పాటు చేసుకునేందుకు గాను వడ్డీలేని రుణాలనివ్వడంతో పాటు ఆర్థిక సాయం చేయాలి.
35 కిలోల బియ్యాన్ని పొందేందుకు అంత్యోదయ కార్డులివ్వాలి.
తమిళనాడు, కేరళ తరహాలో చేనేత సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేయాలి.
నేతన్నలకు ఉద్యోగ భృతి కల్పించి, కనీస వేతనాలను అమలుపర్చాలి.
బీమా సౌకర్యాన్ని పొందేందుకు ఉన్న 58 ఏళ్ల పరిమితిని ఎత్తివేయాలి.
రాజీవ్ విద్యామిషన్ ద్వారా ఇచ్చే అన్ని స్కూల్ యూనిఫాంలను, ప్రభుత్వ రంగ సంస్థలకు జౌళి ఉత్పత్తులన్నింటినీ ఆప్కో ద్వారానే కొనుగోలు చేయాలి.

ఆప్కోకు చెల్లించాల్సిన బకాయిలన్నింటినీ వెంటనే చెల్లించాలి.
చేనేతకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయడంతో పాటు జాతీయ జౌళి విధానాన్ని అమలు చేయాలి.

Back to Top