అన్న రాకకోసం ఆసక్తితో నెల్లూరు ప్రజానికం

23 నుంచి నెల్లూరులో ప్రజా సంకల్పయాత్ర
9 నియోజకవర్గాల్లో 230 కిలోమీటర్ల మేర పాదయాత్ర

చిత్తూరు: వైయస్‌ జగన్‌ రాకకోసం నెల్లూరు జిల్లా ప్రజలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో పాల్గొన్న కాకాణి మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 23వ తేదీన నెల్లూరు జిల్లాలోకి వైయస్‌ జగన్‌ పాదయాత్ర అడుగుపెట్టనుందని చెప్పారు. నెల్లూరు జిల్లాలో 9 నియోజకవర్గాల్లో 20 రోజుల పాటు 230 కిలోమీటర్ల మేర ప్రతిపక్షనేత పాదయాత్ర చేయనున్నారన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి నెల్లూరు కంచుకోట అని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ప్రజా సంకల్పయాత్రకు ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తుందని, నెల్లూరు ప్రజలు కూడా అన్న వస్తున్నాడని ఎదురుచూస్తున్నారన్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చి వైయస్‌ జగన్‌కు ఆశీర్వాదం అందజేయనున్నారని చెప్పారు. 

బాబుకు ఆ నైతిక హక్కు లేదు

కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టిన వ్యక్తి చంద్రబాబు అని కాకాణి ధ్వజమెత్తారు. ఓటుకు కోట్ల కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి అమరావతి పారిపోయి వచ్చి కేంద్రం కాళ్లు పట్టుకున్నారని విమర్శించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రజానికి మొత్తం తెలుసన్నారు. తన కేసుల నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను, ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారని మండిపడ్డారు. అంతే కాకుండా అవినీతికి పాల్పడేందుకు ప్యాకేజీలు కూడా మాట్లాడుకున్నారని ఆరోపించారు. దేశంలో అత్యంత అవినీతికి పాల్పడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మరొకరిపై విమర్శలు చేసే నైతిక హక్కు కోల్పోయారన్నారు. కమీషన్‌లు దండుకుంటున్నారు కాబట్టే కేంద్రం కూడా చంద్రబాబును నమ్మే పరిస్థితిలో లేదన్నారు. బాబు చేసిన తప్పులకు ప్రజలు క్షమించే పరిస్థితిలో లేరన్నారు. కచ్చితంగా రానున్న ఎన్నికల్లో టీడీపీకి గుణపాఠం తప్పదన్నారు. 
Back to Top