నీవా బాబూ నీతులు చెప్పేది : ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి

మాట మీద నిలబడే వ్యక్తి మా నాయకుడు
మాయ చేయడానికి చంద్రబాబు నంద్యాల వచ్చారు
బాబు మాటలు నమ్మొద్దు
తీర్పు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది

నంద్యాల: మా నాయకుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాట్లాడే మాటలకు గానీ, మనస్తత్వానికి చంద్రబాబు దేనికి సరితూగరని, మా నాయకుడి కాలి గోటికి కూడా సరిపోవని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి వ్యాఖ్యానించారు. నంద్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు.  వైయస్‌ జగన్‌ అత్యంత విశ్వసనీయత కలిగిన వ్యక్తి అని, మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తి అన్నారు. చంద్రబాబు  మాదిరిగా వాడుకొని వదిలేసే రకం కాదన్నారు. జనం కోసం పరితపించే నాయకుడని వెల్లడించారు. జనానికి ఏదైనా చేయాలని తాపత్రయపడే వ్యక్తి వైయస్‌ జగన్‌ అని స్పష్టం చేశారు. పదవి కంటే ప్రజా సంక్షేమమే గొప్పదని నమ్మి అబద్ధాలు ఆగకుండా ఈ రోజు ప్రతిపక్షంలో ఉండి రోడ్ల వెంట ఓ సామన్యమైన నాయకుడిలా జనం కోసం పరితపిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు తెల్లవారింది మొదలు అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు.నీవా మాకు భాష నేర్పేది అని రాచమల్లు ప్రశ్నించారు.

ఇన్నాళ్లు అభివృద్ధి గుర్తుకు రాలేదా?
చంద్రబాబు 40 నెలల కాలంలో పూర్తి చేయలేని అభివృద్ధి కార్యక్రమాలను మరో ఇరవై నెలల్లో నెరవేర్చుతానని మాయ మాటలు చెబుతున్నారని రాచమల్లు మండిపడ్డారు. ఇన్నాళ్లు కర్నూలు జిల్లా అభివృద్ధి కనిపించలేదా అని చంద్రబాబును నిలదీశారు. ఇల్లు లేని పేదవాళ్లు ఎవరు ఉండకూడదని, అందరికి ఇల్లు కట్టిస్తానని ఇప్పుడు మాయమాటలు చెబుతున్నారని ఫైర్‌ అయ్యారు. నంద్యాలలో టీడీపీ చేపడుతున్న ఇంటి నిర్మాణం స్కీమ్‌ గురించి మాట్లాడాలంటే..ఇది స్కీమ్‌కాదు పెద్ద స్కామ్‌ అని నిప్పులు చెరిగారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు మూడు సెంట్ల స్థలంలో వ్యక్తిగత పక్కా ఇల్లు నిర్మించి ఇస్తానని మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఉచితంగా ఇల్లు కట్టిస్తానని చెప్పిన చంద్రబాబు మాట తప్పారని విమర్శించారు. 300 చదరపు అడుగుల ఇంటికి ఒక కేటగిరిగా, 365 చదరపు అడుగులు మరో కేటగిరిగా, 450 చదరపు అడుగుల ఇంటిని ఇంకో కేటగిరిగా మార్చారన్నారు. ముక్కాల్‌ సెంట్‌ స్థలంలో పేదవాళ్లకు అపార్టుమెంట్‌ కట్టిస్తావా అని ప్రశ్నించారు. నీ కారు పార్కింగ్‌ చేసేంత స్థలాన్ని పేదవాళ్లకు నివాస స్థలంగా ఇవ్వవా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అపార్టుమెంట్లలో ఎన్నో అసౌకర్యాలు ఉన్నాయని గుర్తు చేశారు. వృద్ధులు, వికలాంగులు మూడంస్తుల అపార్టుమెంట్‌ ఎలా ఎక్కుతారని, వ్యవసాయం చేసుకునే రైతు తమ పాడి పశువులను ఎక్కడ కట్టేసుకోవాలని ధ్వజమెత్తారు. 300 చదరపు అడుగుల ఇంటికి రూ.6.65 లక్షలు విలువ కట్టారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.3 లక్షలు సబ్సిడీ ఇవ్వగా, మిగిలిన రూ.3.65 లక్షలు లబ్ధిదారులు భరించాలట.  ఆ లబ్ధిదారుడు అంత డబ్బు చెల్లించే శక్తి లేదు కాబట్టి బ్యాంకు నుంచి రుణం ఇప్పిస్తారట. ఆ బ్యాంకుకు ఇల్లు తాకట్టు పెట్టి రుణం ఇస్తారని తెలిపారు. వాటికి 30 ఏళ్ల పాటు నెలకు 3 వేల చొప్పున వడ్డీతో కలిపి రూ.6.50 లక్షలు చెల్లించాల్సి వస్తుందన్నారు. బాబు కట్టించే ఈ ఇల్లు మూడేళ్లు కూడా ఉండదని, బతికున్ననాళ్లు బ్యాంకుకు వడ్డీలు కట్టాల్సిందే అని తెలిపారు. 430 చదరపు ఇంటికి రూ.4.50 లక్షలు అప్పుగా పెడుతున్నారు. మీ నెత్తిన ముప్పావుల వడ్డీ పెడుతున్నారు. మిమ్మల్ని ఇంట్లో నుంచి బయట పడేసే కుట్ర చేస్తున్నారు. మూడు సెంట్ల స్థలం ఇచ్చి ఉచితంగా ఇల్లు కట్టిస్తే మీకు సలాం చేస్తాం. లేదా చొక్కా పట్టుకొని పేదవాళ్ల కోసం నిలదీస్తామని హెచ్చరించారు. ఇదేనా మీరు ఇల్లు కట్టించేందని నిలదీశారు. 

బాబు నీతులు చెప్పడం ఆశ్చర్యకరం
చంద్రబాబు మాకు నీతులు చెప్పడం ఆశ్చర్యకరంగా ఉందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు.  భాష గురించి మాట్లాడాల్సి వస్తే..నిండు అసెంబ్లీలో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తనను చంద్రబాబు వేలు చూపిస్తూ నీ అంతు చూస్తా అంటూ, నిన్ను ప్రొద్దుటూరులో తిరుగకుండా చేస్తానని బెదిరించినట్లు గుర్తు చేశారు.  మైండ్‌ గేమ్‌ ఆడుతున్నావు..నీ అంతు తేలుస్తా అని హెచ్చరించారని తెలిపారు. వందల సార్లు అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బెదిరించారని చెప్పారు. ప్రజలను తాట తీస్తానంటావు. తమాషా చేస్తున్నా అని ప్రజలను కళ్లు పెద్ద పెద్దగా చేసి తిట్టే నీవా మాకు నీతులు చెప్పేది. తెలుగు భాష గురించి నీవు సుద్దులు చెబితే మేం నేర్చుకోవాలా అని ప్రశ్నించారు. 

టీడీపీకి ఎందుకు ఓటు వేయాలి
టీడీపీకి ఉప ఎన్నికలో ఎందుకు ఓటు వేయాలని నంద్యాల ప్రజలు చంద్రబాబును నిలదీయాలని రాచమల్లు శివప్రసాదరెడ్డి పిలుపునిచ్చారు.  2014 నుంచి 2017 వరకు చేయని అభివృద్ధి గురించి ఓటు వేయాలా?ఇప్పటి నుంచి చేస్తామన్న అభివృద్ధికి ఓటు వేయాలా అని నిలదీయండి అన్నారు. పేదరికాన్ని ఆసరా చేసుకొని పింఛన్‌ తీసుకొనే వృద్ధులు, వికలాంగులను బెదిరించి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారన్నారు. ఇంతకంటే నీచంగా ఏ నాయకుడు వ్యవహరించడు. ఇదేనా మీరు చేసే అభివృద్ధి. ఓట్లు వేయకపోతే అభివృద్ధి నిలిపివేస్తామని బెదిరిస్తారా అన్నారు. పేదవాళ్లకు సారా పోసి ప్రలోభపెడుతున్నావు. ఉద్యోగులను బెదిరించి ఓట్లు వేయించుకుంటున్నావు. తప్పుడు కేసులు పెడుతున్నావు. గారడీ విద్యలు ప్రదర్శంచే మాటలు చెబుతున్నారని ఫైర్‌ అయ్యారు. 

బాబు మాటలు నమ్మకు..
బాబు చెప్పే మాటలు వింటే మా పల్లెల్లో చెప్పే సామెత గుర్తుకు వస్తుందని రాచమల్లు చెప్పారు. బాబు మాటలు నమ్మకురా..ఇంట్లో గింజలు అమ్మకురా చెడిపోతావు అన్న సామెతలా ఉందన్నారు. ఇది వాస్తవం. నంద్యాల ప్రజలు ఇది గుర్తించాలని రాచమల్లు సూచించారు. భూమా నాగిరెడ్డి మీ నమ్మకాన్ని వమ్ము చేసి చంద్రబాబు పాదల వద్ద అమ్మినందుకు ఓటు వేయాలా? మూడు సంవత్సరాలుగా ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు ఓటు వేయాలా? అని నిలదీశారు. తీర్పు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని, నంద్యాల ప్రజలు ఆలోచించి ధర్మానికి, న్యాయానికి ఓటు వేయాలని రాచమల్లు శివప్రసాదరెడ్డి విజ్ఞప్తి చేశారు.

తాజా వీడియోలు

Back to Top