బాబే పెద్ద దరిద్రం

* దేవినేని ఓ వెధవ ఇరిగేషన్‌ మంత్రి
* వైయస్‌ఆర్‌పై ఆరోపణలు చేస్తే రైతాంగం చెప్పుతో కొడతారు
* ఆరోగ్యశ్రీలో కూడా బాబు అవినీతి
* వైయస్‌ జగన్‌ బహిరంగ లేఖతో ప్రభుత్వంలో చలనం
* ఆరోగ్యశ్రీ అమలుపై 9న కలెక్టరేట్‌ల ఎదుట ధర్నా
* వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి

హైదరాబాద్‌: సీఎం పీఠమెక్కిన చంద్రబాబుకు ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన లేకపోవడం వల్లే రాష్ట్రానికి దరిద్రం పట్టిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి మహానేత  డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి పేద ప్రజలకు కార్పోరేట్‌ వైద్యం అందాలని చేపట్టిన ఆరోగ్యశ్రీని చంద్రబాబు ప్రభుత్వం నీరుగారుస్తుందని పార్థసారధి మండిపడ్డారు. గడప గడపకూ  వైయస్‌ఆర్‌ కార్యక్రమంపై వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సమీక్ష అనంతరం ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడుతూ రాష్ట్రంలోని అనేక సమస్యలపై ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ ఆరు జిల్లాల పార్టీ ఎమ్మెల్యేలు, కో–ఆర్డినేటర్లులతో క్షుణ్ణంగా చర్చించారని చెప్పారు. ప్రత్యేకంగా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిస్థితుల గురించి చర్చించారని పేర్కొన్నారు. పేదల ఆరోగ్యంతో కూడా ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ఆరోపించారు. ఆరోగ్యశ్రీకి  సంవత్సరానికి దాదాపు రూ. వెయ్యి కోట్లు కేటాయించాల్సిన అసవరం ఉందని తీర్మాణం చేసినా కేవలం రూ. 520 కోట్లు కేటాయించి ఆ సొమ్మును కూడా రిలీజ్‌ చేయకుండా ఆసుపత్రుల యాజమాన్యాన్ని, రోగులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది దాదాపు రూ. 400 కోట్లు అవసరానికంటే తక్కువ అలాట్‌ చేసిందన్నారు. గత సంవత్సరపు ఆరోగ్యశ్రీ బకాయిలు రూ. 380 కోట్లు అలాగే ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఆసుపత్రులకు బకాయిలు పెట్టడం మూలంగానే ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజలకు వైద్యం అందడం లేదన్నారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మారుస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై నిరసనగా ఈ నెల 9వ తేదిన రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ముందు ధర్నాకు పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం చేసే ఈ ధర్నా కార్యక్రమానికి ప్రతి వైయస్‌ఆర్‌ సీపీ నాయకుడు  తప్పకుండా పాల్గొనాలని పార్థసారధి విజ్ఞప్తి చేశారు.

వైయస్‌ జగన్‌కు ధన్యవాదాలు
ఆరోగ్యశ్రీలో కూడా ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని పార్థసారధి ధ్వజమెత్తారు. రోగులకు చేసే దాదాపు 60 పరీక్షలను ప్రైవేట్‌ ఎజెన్సీలకు అప్పగించి అవసరం లేకపోయినా డాక్టర్‌లతో ఆ టెస్టులు జరిగేలా చేయిస్తున్నారన్నారు. డాక్టర్‌ల ద్వారా ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందన్నారు. ముడుపులపై ఉన్న ఇంట్రస్టు పేద ప్రజల ఆరోగ్యంపై లేదన్నారు. ఆరోగ్యశ్రీకి నిధులు విడుదల చేయండి అని ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాసేవరకు ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారిన నేపథ్యంలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిసెంబర్‌ 3వ తేదిన బహిరంగ లేఖ రాశారని గుర్తు చేశారు. వైయస్‌ జగన్‌ లేఖ రాసిన తరువాత ప్రభుత్వం ఆదివారం రూ. 575 కోట్లు కేటాయిస్తూ జీవో విడుదల చేసిందన్నారు. పేదల కోసం లేఖ రాసి ప్రభుత్వంలో చలనం తీసుకువచ్చి నిధులు విడుదల చేపించినందుకు పార్థసారధి వైయస్‌ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేకంగా డయాలసిస్, క్యాన్సర్‌ రోగులు ఆరోగ్యశ్రీ అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డయాలసిస్‌ పేషంట్‌కు సంవత్సరానికి సుమారు 3 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. ఇటీవల కృష్ణా జిల్లా మల్లవల్లి గ్రామంలో ఓ నిరుపేదవ్యక్తికి ప్రమాదంలో తలకు గాయమై విజయవాడ ఆసుపత్రికి తీసుకువస్తే ఆరోగ్యశ్రీ కింద చేర్చుకోవడానికి వైద్యులు నిరాకరించారని చెప్పారు. దాంతో. అతని భార్య ఇంటిని అమ్మేసి రూ. 1.5 లక్షను ఆసుపత్రిలో కట్టి వైద్యం చేయించే దుస్థితి ఏర్పడిందన్నారు.

చంద్రబాబు చేతగాని తనం మూలంగానే..
దేవినేని ఉమామహేశ్వర్‌రావు అంత వెధవ మంత్రి ఈ రాష్ట్రానికి ఇరిగేషన్‌ మంత్రిగా ఉన్న దాఖళాలు లేవని పార్థసారధి ఆరోపించారు. దివంగత మహానేత వైయస్‌ఆర్‌ మూలంగానే కృష్ణడెల్టాకు ఈ దుస్థితి ఏర్పడిందన్న దేవినేని వ్యాఖ్యలను పార్థసారధి తప్పబట్టారు. ప్రస్తుతం కృష్ణ డెల్టా ఎదుర్కొంటున్న సమస్యలకు టీడీపీ కారణం కాదా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత చంద్రబాబు హయాంలో కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసు వేస్తే టీడీపీ అసమర్థత వాదనల వల్లే నీరు రాకుండా పోయింది నిజం కాదా అని నిలదీశారు. చంద్రబాబు చేతగాని తనం మూలంగా కృష్ణా జలాల మీద హక్కులను కోల్పోవడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వాస్తవాలను తప్పుదోవపట్టిస్తూ వైయస్‌ఆర్‌పై బురదజల్లాలని చూస్తే కృష్ణా డెల్టా ప్రజలు దేవినేనిని చెప్పుతీసుకొని కొట్టే పరిస్థితులు ఏర్పడుతాయని హెచ్చరించారు.

17న మళ్లీ సమీక్షలు
రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంగా ప్రజల చేత బాబు పాలనపై మార్కులు వేయించాలని అధినేత జగన్‌ ఆదేశించినట్లు చెప్పారు. డ్వాక్రా, రైతుల రుణమాఫీ, వ్యవసాయరంగం ఇబ్బందులు, నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై సమీక్షలో చర్చించారన్నారు. ప్రత్యేకంగా సంక్షేమ హాస్టళ్లు, కరువుపై చర్చించారన్నారు. వ్యక్తిగత కారణాలతో సమీక్షకు హాజరుకాలేకపోయిన వారికి 17వ తేదిన మళ్లీ సమీక్ష ఉంటుందని చెప్పారు. 
Back to Top