దీపావళికి చంద్రన్నకానుకలు

 

 దీపావళికి ముఖ్యమంత్రి చంద్రబాబు తనదైన శైలిలో
కానుకలు ఇచ్చారు. ఉద్యోగుల్ని వేధించటంలో  ఎప్పుడూ
ముందు ఉండే చంద్రబాబు.. తాజాగా సిబ్బంది, అధికారులకు షాక్ ఇచ్చారు. ఉద్యోగ విరమణ
చేసిన తరువాత ఇచ్చే గ్రాట్యుటీని రు.10 లక్షలకు పరిమితం చేస్తూ రాష్ర్ట ప్రభుత్వం
నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి దీనిపై ఈ నెల 2వ తేదీన విజయవాడలో జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నారు. కానీ
ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఈ విషయం
బైటపెట్టారు.



పదవీ విరమణ చేసిన
ఉద్యోగులకు గ్రాట్యుటీగా రూ. 12 లక్షలు ఇవ్వాలని 
పదో వేతన సవరణ
కమిషన్ (పీఆర్సీ) సిఫార్సు చేసింది. ప్రస్తుతం గ్రాట్యుటీ రూ. 8 లక్షలుగా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం
పీఆర్సీ సిఫార్సులను పట్టించుకోకుండా రూ. 10 లక్షలకు పరిమితం చేసింది.



తొమ్మిదవ వేతన
సవరణ కమిషన్ గ్రాట్యుటీ రూ. 6 లక్షలు ఇవ్వాలని సిఫార్సు చేయగా అప్పటి ప్రభుత్వం అదనంగా మరో రెండు లక్షలు
పెంచుతూ గ్రాట్యుటీ రు. 8 లక్షలుగా ఖరారు చేసింది.  వాస్తవానికి గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని రూ. 15 లక్షలకు పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు.
అయితే కనీసం పీఆర్సీ సిఫార్సు చేసినట్లుగా రూ.12 లక్షలైనా ఇవ్వకుండా రూ.10 లక్షలకు కుదించడం పట్ల ఉద్యోగులు ఆందోళన
చెందుతున్నారు.

 పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వం
ఉద్యోగుల గ్రాట్యుటీని పీఆర్సీ సిఫార్సుల మేరకు రూ. 12 లక్షలుగా ప్రకటించి ఉత్తర్వులు కూడా జారీ
చేసింది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం పీఆర్సీ సిఫార్సులను పట్టించుకోలేదు. మరోవైపు
గ్రాట్యుటీపై గత కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నప్పటికీ  బయటకు చెప్పకుండా రహస్యంగా ఉంచడం విశేషం.
గ్రాట్యుటీని పరిమితం చేయడం వల్ల 30 ఏళ్ల సర్వీసు గల ఉద్యోగ విరమణ చేసిన
ఉద్యోగులందరూ లక్షల్లో నష్టపోనున్నారు.

 

తాజా వీడియోలు

Back to Top