లోకేష్‌ను ఎలా సీఎం చేసుకోవాల‌న్న‌దే బాబు వర్రీ

ఢిల్లీ:  సీఎం చంద్ర‌బాబు రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు విస్మ‌రించి త‌న కుమారుడు లోకేష్‌ను ఎలా సీఎం చేసుకోవాల‌ని వ‌ర్రీ అవుతున్నార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి మండిప‌డ్డారు. కేంద్రం ప్ర‌క‌టించిన బ‌డ్జెట్‌లో రాష్ట్రానికి ప్ర‌యోజ‌నం క‌లిగించే అంశాలు ఏమీ లేవ‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల్లో పాల్గొన్న వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు బుధ‌వారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మేక‌పాటి మాట్లాడుతూ..విభ‌జ‌న చ‌ట్టంలోని ప్ర‌త్యేక హోదా ఏపీకి వ‌చ్చి ఉంటే ఎంతో ల‌బ్ధి చేకూరేద‌న్నారు. టీడీపీ గంట‌కో మాట మాట్లాడుతుంద‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. ఎన్నిక‌ల ముందు ప్ర‌త్యేక హోదా ప‌దిహేనేళ్లు కావాల‌న్న చంద్ర‌బాబు మాట మార్చార‌ని, ఇప్పుడు ప్యాకేజీ ముద్దంటున్నార‌ని మండిప‌డ్డారు. హోదా కోసం ప‌ట్టుబ‌ట్టాల్సింది పోయి ప్యాకేజీ కోసం కృషి చేయాల‌ని చంద్ర‌బాబు త‌న ఎంపీల‌కు సూచించ‌డం స‌రికాద‌న్నారు. హోదా వ‌స్తే అనేక ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తాయ‌ని, ఉపాధి అవ‌కాశాలు పెరుగుతాయ‌న్నారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాయ‌క‌త్వంలో ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం చేస్తామ‌ని మేక‌పాటి స్ప‌ష్టం చేశారు. కేంద్రం ప్ర‌క‌టించిన అంశాల్లో రాజ‌ధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చిన రైతుల‌కు ప‌న్ను మిన‌హాయింపు త‌ప్ప‌..ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌న్నారు. ఇందులో కూడా టీడీపీ నేత‌ల‌కే అధిక ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌న్నారు. పేద‌ల‌కు ఎలాంటి మేలు జ‌రిగే విధంగా ఈ బ‌డ్జెట్ లేద‌ని అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

Back to Top