స్వార్థం కోసం హక్కులను తాకట్టుపెడుతున్న చంద్రబాబు

* నీటి కేటాయింపుల విషయంలో ఏపీకి అన్యాయం
* నోరు మెదపకుండా చోద్యం చూస్తున్న చంద్రబాబు
* అసెంబ్లీ సీట్ల పెంపుపై ఉన్న శ్రద్ధ ఏపీ ప్రయోజనాలపై లేదు
* ఓటుకు కోట్ల కేసు నాటి నుంచి చంద్రబాబుది ఇదే వైఖరి
* సోమవారం మీటింగ్‌లో ఎన్ని అప్పులను ప్రజల నెత్తిన వేయనున్నారో
* మోసపూరిత అవినీతి పరిపాలనపై ప్రజలంతా పోరాటాలకు సిద్ధం కావాలి
* వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి పిలుపు

హైదరాబాద్‌: తన స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హక్కులను, ప్రయోజనాలను తాకట్టుపెడుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రాజెక్టులు కడుతూ నీటిని మళ్లించుకుంటుంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారని ధ్వజమెత్తారు. నీటి కేటాయింపుల్లో ఆంధ్రకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కృష్ణా నీటి కేటాయింపుల సాధనలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విశ్వేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విధంగా ప్రయత్నించకుండా కేవలం లెటర్లు రాస్తూ నామమాత్ర ధోరణిలో వ్యవహరిస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రాజెక్టులు కట్టుకుంటూ నీటిని ఏపీకి రాకుండా మళ్లించుకుంటుంటే చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. డిండీ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల విషయంలో కూడా చంద్రబాబు నోరు మెదపలేదని గుర్తు చేశారు. కృష్ణాబోర్డు కూడా నిర్వీర్యమైన వ్యవస్థలా తయారవుతోందని ఆరోపించారు.

హక్కుల సాధనలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు
చంద్రబాబుకు అసెంబ్లీ సీట్లు పెంపుపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రజల హక్కులను సాధించడంలో లేదని విశ్వేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. నీరే ప్రాణం, ఆధారంగా మారిన ఈ రోజుల్లో ఏపీ ప్రభుత్వం నీటిని ఆంధ్రప్రజలకు దక్కకుండా చేస్తోందని ఆరోపించారు. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు పూర్తిగా లొంగుబాటు వైఖరితో వ్యవహరిస్తున్నాడన్నారు. ఓటుకు కోట్ల కేసు తరువాత చంద్రబాబు పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకుండా చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తోందని పేర్కొన్నారు. కేవలం తన కేసుకు భయపడి పది సంవత్సరాల ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను విడిచిపెట్టి అమరావతిలో తలదాచుకున్నారని దుయ్యబట్టారు. నీరు లేక రైతులు సంవత్సరాల తరబడి పెంచుకున్న పండ్ల తోటు ఎండిపోతున్నా సర్కార్‌ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవ పరిస్థితులను పట్టించుకోకుండా... జలసంరక్షణ, నీరు–చెట్టు అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని బాబుపై నిప్పులు చెరిగారు. ఇంకుడు గుంతల పేరుతో వందల కోట్లు ఖర్చు చేశారని, కోట్లు ఖర్చు చేస్తే ఎందుకు సరైన ఫలితాలు రావడం లేదని, భూగర్భ జలాలు దారుణంగా పడిపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. తీవ్రమైన అవినీతి, ప్రచారం కోసం పాకులాడడం తప్ప ఫలితాలు సాధించడంలో శ్రద్ధ లేదని దుయ్యబట్టారు.

ఈసారైనా ప్రయోజనాలను కాపాడుతారా?
గవర్నర్‌ సమక్షంలో తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో బాబు ఎన్ని అప్పులను ప్రజల నెత్తిన మోపనున్నారోనన్న భయం కలుగుతుందని ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గవర్నర్‌ సమక్షంలో సమావేశం కానున్నట్లు చెప్పారు. విభజన చట్టం 9, 10లోని ఆస్తులు, హక్కులు, అప్పులపై చర్చించబోతున్నట్లుగా తెలిసిందన్నారు. అయితే ఆ సమావేశంలోనైనా సరే ఏపీ ప్రయోజనాలను కాపాడుతారా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఎన్ని లక్షల కోట్ల నష్టం పంచుకుంటారోనని భయంగా ఉందన్నారు. ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత ప్రచారాన్ని నమ్మకుండా రాష్ట్ర హక్కులను, ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం ప్రజలంతా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. హక్కుల సాధన కోసం ప్రజలు చేసే ప్రతీ పోరాటానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అండదండగా ఉంటుందని భరోసా కల్పించారు.

Back to Top