నిరుద్యోగులంటే చంద్ర‌బాబుకు చుల‌క‌న‌

నిరుద్యోగులంటే చంద్ర‌బాబుకు చుల‌క‌న‌
డాబాగార్డెన్స్‌: నిరుద్యోగులంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి చులకనగా ఉందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి తుల్లి చంద్రశేఖర్ ధ్వ‌జ‌మెత్తారు. మూడేళ్ల పాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వ‌క‌పోవ‌డంతో నిరుద్యోగులంతా రోడ్డున ప‌డ్డార‌న్నారు. జగదాంబ జంక్షన్ సమీపంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో చంద్ర‌శేఖ‌ర్ మాట్లాడారు. జాబు కావాలంటే బాబు రావాలన్న ఎన్నికల ముందు నినాదం..కాస్తా మారి జాబు రావాలంటే బాబు పోవాలి అనే స్లోగ‌న్‌గా మారిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం లేకుంటే నెలకు రూ.2వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారని, మూడేళ్ల కాలంలో ఒక్క ఉద్యోగం ఇవ్వ‌క‌పోగా.. ఒక్క నిరుద్యోగికైనా నిరుద్యోగ భృతి ఇచ్చారా? అని ప్రశ్నించారు. నెలకు రూ.2వేలు చొప్పున మూడేళ్లకు రూ.72వేలు ఒక్కో నిరుద్యోగికి చంద్రబాబు బకాయిపడి ఉన్నారని ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు సుమారు రూ.15వేల కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. విశాఖ‌లో రెండు సార్లు పాట్న‌ర్‌షిప్ సమ్మిట్‌లు ఏర్పాటు చేశారు కానీ ఒక్క ప‌రిశ్ర‌మ‌నైనా తీసుకొచ్చారా.. ఒక్క ఉద్యోగ‌మైన ఇచ్చారా అని నిల‌దీశారు. ఈ వైఫల్యాల నుంచి నిరుద్యోగల దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం కొత్త ఎత్తులు వేస్తోందని విమర్శించారు.
అనుభ‌వంలేని వ్య‌క్తి ఐటీశాఖ‌
చంద్రబాబు తన కొడుకును ప్రజాక్షేత్రంలో గెలిపించుకునే ద‌మ్ములేక‌ దొడ్డిదారిన ఎమ్మెల్సీ తీసుకొచ్చార‌ని చంద్ర‌శేఖ‌ర్ మండిప‌డ్డారు. అనుభవం లేని వ్య‌క్తికి కీలక శాఖ అప్పజెప్పడం దౌర్భాగ్యమన్నారు. ఐటీ విద్యార్ధి అడిగిన ప్రశ్నలకే సమాధానం చెప్పలేని ఐటీ శాఖమంత్రి లోకేష్‌కు ఆ పదవిలో కొనసాగడం తగదన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని, ప్రతీ నిరుద్యోగికి బాకీప‌డ్డ బకాయిలు వెంటనే చెల్లించాలని, గ్రూప్‌–2 మెరిట్ సెలక్షన్స్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్ ప్రకారం నియామకాలు జరపాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాజీవ్‌గాంధీ, బలిరెడ్డి గోవిందరాజు, సోమేష్, అన్నాజీ పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top