నవరత్నాల సభను జయప్రదం చేయాలి

దర్శి : స్థానిక తాలూకా క్లబ్‌ సమావేశం హాలులో శనివారం నిర్వహించే నవరత్నాల సభను జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి కోరారు. స్థానిక ఆ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ‘నవ్యాంధ్రకు నవరత్నాలు’ కరపత్రాలను వైయస్సార్‌సీపీ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బూచేపల్లి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల అవసరాలను గుర్తించి రైతులు, మహిళలు, పేదలకు చేదోడువాదోడుగా ఉండేందుకు వైయస్సార్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే నవరత్నాల పథకాలను ప్రవేశపెట్టనున్నారని చెప్పారు. వైయస్సార్‌ రైతు భరోసా పేరుతో ప్రతి రైతుకు రూ.50 వేలు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు, పొదుపు సంఘాలకు 15 వేల కోట్లతో వైయస్సార్‌ ఆసరా, వృద్ధులకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయలకు వృద్ధాప్య పింఛన్‌లు, అమ్మఒడి పేరుతో పేదలకు చదువుల బడిని రూపొందించడం, పేదలకు పార్టీలకతీతంగా 25 లక్షల పక్కా ఇళ్లు, పేదల ఆరోగ్యం కోసం మళ్లీ వైయస్సార్‌ పాలనలోలా ఆరోగ్య శ్రీ వైయస్సార్‌, పూర్తి ఫీజురీయంబర్స్‌మెంట్‌తో పాటు భోజన వసతి కోసం ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ.20 వేలు అందజేయడం, యుద్ధప్రాతిపదికన జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టులు పూర్తి చేయడం, దశలవారీగా మద్యపాన నిషేద్ధం వంటి నవరత్నాల్లాంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే కార్యకర్తలు కంకణం కట్టుకోవాలని బూచేపల్లి కోరారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక కమిటీలకు తావులేకుండా రాజన్న పద్ధతిలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ పింఛన్‌ అందేలా చూస్తారని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా మద్యం ఏరులై పారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం మత్తులో పేదల బతుకులు నలిగిపోతుంటే ఆ మహిళలు పడే వేదన చూడలేక జగన్‌ మద్యపాన నిషేధాన్ని ప్రకటించారని గుర్తు చేశారు. వీటితో పాటు మరికొన్ని పథకాలతో రాజన్న బాటలో జగనన్న నడుస్తారని బూచేపల్లి వివరించారు. నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు నవరత్నాల సభను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్‌ వెన్నపూస వెంకటరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మెత అంజిరెడ్డి, యూత్‌ కన్వీనర్‌ వీసీ రెడ్డి, నాగార్జున సాగర్‌ కుడికాలువ మాజీ వైస్‌ చైర్మన్‌ సద్ది పుల్లారెడ్డి, మాజీ సర్పంచి చంద్రగిరి గురవారెడ్డి, కోరే సుబ్బారావు, ఎంపీటీసీ సోము దుర్గారెడ్డి, మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, కొడవటి జాన్‌, గర్నెపూడి సామ్యేల్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు దామెర్ల చంద్రం, సర్పంచి పాణెం కృష్ణారెడ్డి, వెన్నపూస బాపిరెడ్డి, సుసీలా ప్రతాప్, మారం నాగిరెడ్డి, నాదెండ్ల అంజయ్య, గంజి వెంకటేశ్వరరెడ్డి, యాదాల వెంకటేశ్వర్లు, బ్రహ్మరెడ్డి, సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Back to Top