సమైక్యానికి జాతీయ పార్టీలు సానుకూలం

న్యూఢిల్లీ, 8 అక్టోబర్ 2013:

రాష్ట్ర ప్రజల ఇబ్బందుల గురించి జాతీయ స్థాయి నాయకులకు వివరించి, సమైక్యాంధ్రకు మద్దతు కూడగట్టేందుకే తన నేతృత్వంలో పార్టీ ప్రతినిధి బృందం ఢిల్లీ వచ్చినట్లు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ స్పష్టంచేశారు. ఈ క్రమంలో శ్రీమతి విజయమ్మ బృందం మంగళవారం పలువురు జాతీయ పార్టీల నాయకులతో భేటి అయింది. రాష్ట్ర విభజనపై అసెంబ్లీ తీర్మానం పెట్టాలని తాము జాతీయ పార్టీలను కోరుతున్నట్లు శ్రీమతి విజయమ్మ చెప్పారు. తమ విజ్ఞప్తిపై జాతీయ పార్టీలు సానుకూలంగా స్పందించాయని ఆమె తెలిపారు. శ్రీమతి విజయమ్మ తమ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఢిల్లీలో డిఎంకె ఎం.పి. కనిమొళి, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కారత్, ఆ పార్టీ ‌పొలిట్బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరిలను క‌లుసుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి సహకరించాలని ఆమె వారికి విజ్ఞప్తి చేశారు.

అనంతరం శ్రీమతి విజయమ్మ మీడియాతో మాట్లాడుతూ.. ముందు నుంచీ తాము సమైక్యాంధ్రనే కోరుకుంటున్నట్లు తెలిపారు. సిపిఎం కూడా ముందు నుంచీ సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నట్లు ఆ పార్టీ నాయకులు చెప్పారన్నారు. విభజన నిర్ణయం ప్రకటన వెలువడినప్పటి నుంచీ రాష్ట్రంలోని సుమారు 60 శాతం మంది ప్రజలు 70 రోజులుగా ఆందోళనతో రోడ్ల మీదకు వచ్చి ఉద్యమాలు చేస్తున్నారని శ్రీమతి విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన ఆసాంతం కుంటుపడిందని, అనేక విభాగాలు పనిచేయడంలేదని, విద్యుత్‌ అందని దుస్థితి నెలకొన్నదని విచారం వ్యక్తంచేశారు.

ఇంతవరకూ ఎక్కడ ఏ రాష్ట్రాన్ని విభజించినా అసెంబ్లీ తీర్మానం తప్పనిసరిగా ఉండేదని, కాని ఆంధ్రప్రదేశ్‌ విభజన విషయంలో ఆ ఆనవాయితీని కేంద్రం పక్కకు పెట్టేయడం సరికాదని శ్రీమతి విజయమ్మ తప్పుపట్టారు. అసెంబ్లీ తీర్మానం లేకుండానే కాంగ్రెస్‌ పార్టీ కేబినెట్‌ నోట్‌ రూపొందించడమేమిటని ప్రశ్నించారు. 2004 ఎన్నికలలో టిఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ పార్టీ నాయకులు రెండవ ఎస్సార్సీకి అంగీకరించారని ఆమె గుర్తుచేశారు. 2009లో మళ్ళీ మహానేత వైయస్ఆర్‌ సిఎంగా ఉన్నప్పుడు తెలంగాణపై రోశయ్య కమిటీ వేసిన వైనాన్ని ప్రస్తావించారు.

రాష్ట్ర విభజన విషయంలో శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను కాంగ్రెస్‌ పట్టించుకోవడంలేదేమని శ్రీమతి విజయమ్మ నిలదీశారు. రాష్ట్ర విభజనకు నియమించిన మంత్రుల కమిటీ మరో సైమన్ క‌మిషన్ లాంటిదని ఆమె విమర్శించారు. ఎలాంటి షరతులు లేకుండా తెలంగాణ ఇవ్వాలంటూ చంద్రబాబు నాయుడు 2008 నుంచే కోరారని ఆరోపించారు. అలాంటి చంద్రబాబు ఈ రోజు దీక్ష ఎందుకు చేస్తున్నారో ఆయనకే తెలియాలని శ్రీమతి విజయమ్మ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు ఎవరి కోసం, ఎందు కోసం దీక్ష చేస్తున్నారో ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చేయవలసిన ప్రయత్నాలన్నీ వై‌యస్ఆర్ ‌కాంగ్రెస్‌ పార్టీ చేస్తోంది. ఢిల్లీ వచ్చిన పార్టీ బృందంలో ఎం.పి. మేకపాటి రాజమోహన్‌రెడ్డి, రాజకీయ వ్యవహారాల కమిటి సభ్యుడు డాక్టర్‌ ఎం.వి. మైసూరారెడ్డి, కేంద్ర పాలక మండలి సభ్యులు ప్రొఫెసర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, హెచ్.ఎ. రెహ్మాన్‌, శాసనసభా పక్షం ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి తదితరులు ఉన్నారు.

Back to Top