అన్యాయం తెలియడంలేదా బాబూ?

బి.కొత్తకోట (చిత్తూరు జిల్లా) :

రాజకీయ విలువలను కాంగ్రెస్, టీడీపీలు దిగజారుస్తున్నాయని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. అసెంబ్లీ తీర్మానం లేకుండా రాష్ట్రాన్ని విడగొట్టడం అన్యాయం అని జాతి మొత్తం అంటున్నా సీఎం కిరణ్, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడికి మాత్రం తెలియడం లేదని దుయ్యబట్టారు. వాస్తవాన్ని ఏమాత్రం గ్రహించకుండా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించే ప్రక్రియను యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ గుడ్డిగా కొనసాగిస్తున్నారని ఆయన నిప్పులు చెరిగారు. సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా ఆదివారంనాడు ఆయన చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి. కొత్తకోటలో జరిగిన భారీ బహిరంగ సభలో శ్రీ జగన్‌ ప్రసంగించారు. అసెంబ్లీ తీర్మానం లేకుండా రాష్ట్రాన్ని విడగొట్టడం ఏమి న్యాయం అని ఆయన ప్రశ్నించారు.

తన కుమారుడు రాహుల్‌ గాంధీని ప్రధాని పదవిలో కూర్చోబెట్టడం కోసమం సోనియా గాంధీ అసెంబ్లీ అభిప్రాయం తెలుసుకోకుండానే మన రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగా ముక్కలు చేస్తున్నారని శ్రీ జగన్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. సోనియా గీసిన గీత దాటకుండా ఆమె నిర్ణయాలను సీఎం‌ కిరణ్ అమలు చేస్తున్నారని, విభజన ప్రక్రియ విజయవంతంగా జరిగేందుకు చంద్రబాబు నాయుడు పూర్తిగా సహకరిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కేవలం కొన్ని ఓట్లు, సీట్ల కోసమే ఈ ముగ్గురూ రాష్ట్ర ప్రజలను నిలువునా ముంచేస్తున్నారని శ్రీ జగన్ ఆరోపించారు. చంద్రబాబు నోటి నుంచి సమైక్యం అనే ఒక్క మాట ఎందుకు రావడంలేదని నిలదీశారు. సీమ గడ్డ మీద పుట్టిన కిరణ్, చంద్రబాబులకు ఏమైనా సిగ్గు ఉందా? అని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఒక పక్కన సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలతో సమైక్యం అనిపిస్తున్నారని, మరో వంక టీటీడీపీ సభ్యులతో విభజనకు అనుకూలంగా మాట్లాడిస్తూ.. ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని శ్రీ వైయస్‌ జగన్‌ తూర్పారపట్టారు. విశ్వసనీయత ఏమాత్రం లేని చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని దొంగ హామీలిస్తున్నారని ఆరోపించారు. తన హయాంలో గ్రామ గ్రామానా బెల్టు షాపులు పెట్టించి మద్యాన్ని పారించింది చంద్రబాబు కాదా? అని ఆయన నిలదీశారు. తొమ్మిదేళ్ళ పాలనలో ఒక్క హామీని అమలు చేయని చంద్రబాబు ఇప్పుడు ఒక్క రూపాయి ఇస్తానన్నా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు.

సమైక్యాంధ్రకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని శ్రీ జగన్‌ స్పష్టంచేశారు. మొదటి నుంచీ తమ పార్టీ ఇదే విధానన్ని అనుసరిస్తోందని చెప్పారు. ప్రస్తుత రాజకీయాల్లో నిజాయితీ ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుందన్నారు. సమైక్యాంధ్ర తీర్మానం చేయమని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ కోరింది. అయితే, ఆయన అసెంబ్లీని సమావేశ పరచలేదు. తీర్మానం చేయడం కోసం ఒక్క అడుగూ వేయలేదని శ్రీ జగన్‌ విమర్శించారు. సమైక్యవాదినని ఒక పక్కన అభివర్ణించుకుంటున్న కిరణ్‌ కాంగ్రెస్‌ అధిష్టానానికి అత్యంత విశ్వసపాత్రుడుగా వ్యవహరిస్తున్నారని అన్నారు.

ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య ఇప్పుడు పోరాటం జరుగుతున్నదని శ్రీ జగన్‌ అభివర్ణించారు. రాజకీయంగా జరుగుతున్న కుట్ర, మోసం ఆగిపోవాలని, విలువలతో కూడిన రాజకీయాలు రావాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాయని, అందుకు మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి అందరి హృదయాల్లోనూ నిలిచి ఉన్నారని అన్నారు. సమైక్యంగా ఉన్నప్పుడే పై రాష్ట్రాల అవసరాలు తీరిన తరువాత గానీ ఒక్క చుక్క నీరు రానప్పుడు మధ్యలో మరో రాష్ట్రం వస్తే.. గాలేరు - నగరి ప్రాజెక్టు ఏ విధంగా పూర్తవుతుందని శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు.

రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోనివ్వబోమని సభకు హాజరైన అశేష ప్రజానీకం చేత శ్రీ జగన్‌ ప్రమాణం చేయించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top