నారాయణకు నెల్లూరుపై శ్రద్ధ లేదు: కోటంరెడ్డి

నెల్లూరుః స్థానిక టీడీపీ నాయకుడు, మున్సిపల్‌ మంత్రి నారాయణకు సొంత జిల్లా అభివృద్ధిపై శ్రద్ధ లేదని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. ఆయన గురువారం 25వ డివిజన్‌లో ప్రజాబాట నిర్వహించారు. ప్రతి వీధిలో తిరుగుతూ స్థానిక సమస్యలపై ప్రజలతో చర్చించారు. అధ్వాన్నపు పారిశుధ్యం, కరెంటు సరఫరాలో జరుగుతున్న అవాంతరాలపై స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ దళితవాడలు, గిరిజన కాలనీల అభివృద్ధికి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టాలను ప్రభుత్వాలు కల్పించాయని ఎస్సీ సబ్‌ప్లాన్‌ కింద చేపట్టాల్సిన పనులు రాష్ట్రంలోనే అన్ని మున్సిపాలిటీలలో, కార్పొరేషన్‌లో పూర్తయినా మున్సిపల్‌ మంత్రి సొంత కార్పొరేషన్‌లో ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదన్నారు. కనీసం టెండర్ల ఆమోదం, కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్‌ ప్రక్రియ కూడా కాకపోవడం దురదృష్టకరమన్నారు. జిల్లా మంత్రి నారాయణ దీన్ని అవమానంగా భావించాలని శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద చేపట్టాల్సిన పనులు ఇప్పటివరకు టెండర్ల పిలవకపోవడం దారుణమన్నారు. కొద్దిపాటి చొరవ చూపి పనులు వేగవంతంగా ప్రారంభించాల్సిన బాధ్యత నగర మేయర్, జిల్లా మంత్రి నారాయణ మీద ఉందన్నారు. ఇంకా మీనమేషాలు లెక్కిస్తే కాలయాపన చేస్తే మళ్లీ పోరాటం తప్పదని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వేల్పుల అజయ్, అరవ శీను, హృదయ్‌ కుమార్, నీళ్ల సునీల్, అరవింద్, రాఘవేంద్ర రావు, కె. భాస్కర్, ఖాదర్‌ భాషా, పంటా గోపాల్‌ రెడ్డి, ఎ.అనిల్‌ రెడ్డి, రూబెన్, హరనాధరెడ్డి, ప్రసాద్, భారతి తదితరులు ఉన్నారు.

Back to Top