నారావారి నయవంచన దీక్ష

హైదరాబాద్‌: చంద్రబాబు మూడేళ్ల పాలన పూర్తి ప్రజా వ్యతిరేక పాలన అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం చేస్తుందని నవ నిర్మాణ దీక్ష కాదని, అది నారా వారి నయవంచన దీక్ష అని రోజా అభివర్ణించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రోజా మీడియాతో మాట్లాడారు. టీడీపీ మేనిఫెస్టోలోని హామీలను నెరవేర్చి ప్రజల మెప్పు పొంది మరోమారు అధికారంలోకి రావాల్సింది పోయి..అవినీతి డబ్బుతో ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ నేతలు చేసిన పాపాలు కడుక్కునేందుకు 24 గంటలు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇటీవల నిర్వహించిన టీడీపీ మహానాడులో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పకుండా ప్రతిపక్ష నేతపై విమర్శలు చేయడం సిగ్గు చేటు అన్నారు. ప్రజా ధనాన్ని లూటీ చేస్తూ దొంగ దీక్షలు చేస్తున్న టీడీపీ నాయకులను అడుగడుగునా అడ్డుకోవాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది.
Back to Top