నారా బాబు.. నీరో చక్రవర్తి

జనం సొమ్ము తినడమే..!
ధరల తగ్గించే ఆలోచనే చేయకపోవడం దుర్మార్గం..!

హైదరాబాద్ః వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఎంతసేపు జనం సొమ్ము తినాలని ఆలోచన చేస్తాడు తప్పితే, ప్రజలు ఏం తింటున్నారో ఏనాడు ఆలోచన చేయడని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. సామాన్యుడు మూడు పూటలా భోంచేసే పరిస్థితి లేదని, నీరో లాంటి నారా చక్రవర్తి ధరలను అదుపు చేయడంపై ఏమాత్రం ఆలోచన చేయకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ  వైఎస్సార్సీపీ చేపట్టిన దీక్ష విజయవంతం అయ్యిందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. తమ డిమాండ్ లతో కూడిన వినతిపత్రాన్ని  అన్ని తహశీల్దార్ కార్యాలయాల్లో సమర్పించినట్లు చెప్పారు. 

ప్రభుత్వ తీరువల్లే..!
ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకోకుండా... ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరువల్లే ధరలు పెరుగుతున్నాయని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.  కందిపప్పు కనీస మద్దతు ధర రూ.4300 ఉన్నా... రైతులకు గిట్టుబాటు కల్పించకుండా దళారులకు లబ్ది చేకూరుస్తోందని శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.  కందిపప్పు రూ.210, మినపప్పురూ. 190 ఎండుమిర్చీ రూ. 140.  ఇలా ధరలు భగ్గుమంటుంటే ఎలాంటి చర్యలు లేవని ఎత్తిపొడిచారు.  రైతుల మద్దతు ధర కోసం 5 వేల కోట్లు, ధరల స్థిరీకరణ నిధి కోసం రూ. 1000 కోట్లు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి  చంద్రబాబు దాన్ని విస్మరించారన్నారు.  

పేదలను దంచుడే పని..!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ . రాజశేఖర్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీల  కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు చేపట్టారని శ్రీకాంత్ రెడ్డి ఈసందర్భంగా గుర్తుచేశారు. రాజశేఖర్ రెడ్డి  ఒక్కరిపై కూడా పన్నుల భారం మోపలేదన్నారు.  కానీ చంద్రబాబు అదికారంలోకి వచ్చిన ప్రతిసారి ఆర్టీసీ, పవర్ ఛార్జీలు పెంచుతూ పన్నులు విధిస్తున్నాడన్నారు. పబ్లిసిటీ కోసం వేలకోట్లు ఖర్చు చేసే చంద్రబాబు ప్రజలకోసం మాత్రం ఎలాంటి ఆలోచన చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సీబీఐ విచారణకు సిద్ధమా చంద్రబాబు..!
చంద్రబాబు విజయవాడలో ఆర్భాటంగా మీటింగ్ లు పెట్టడం తప్ప చేసిందేమీ లేదని శ్రీకాంత్ రెడ్డి  దుయ్యబట్టారు. తన హెరిటేజ్ ను మాత్రం లాభాల పంట పండిస్తూ..సామాన్యునికి పూట తిండి కూడా లేకుండా నలిగిపోయేలా చేస్తున్నారని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ధరలు, ఛార్జీలు తగ్గించడంతో పాటు రైతులను ఆదుకోవాలని,  ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఇక  హరిరామజోగయ్య పుస్తక వివరణపై స్పందించిన శ్రీకాంత్ రెడ్డి చంద్రబాబు గత చరిత్ర అంతా అందరికీ తెలిసిందేనన్నారు. దమ్ముంటే చంద్రబాబు తనపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ చేత విచారణకు సిద్ధపడాలని శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు.  
Back to Top