'చంద్ర‌బాబే మొద‌టి దోషి'

హైద‌రాబాద్‌: ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పేరు 22 సార్లు ఏసీబీ ఛార్జ్ షీటు లో ప్ర‌స్తావించటాన్ని బ‌ట్టి ఓటుకి కోట్లు కుంభ‌కోణంలో ఆయ‌నే ప్ర‌ధాన దోషి అన్న సంగ‌తి అర్థం అవుతోంది. అయిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు పేరును మొద‌టి నిందితుడు ( ఏ-1) ప్ర‌క‌టించ‌క పోవ‌టంపై ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. ఇదే అంశాన్ని వైఎస్సార్‌సీపీ త‌ర‌పున పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి బొత్సా స‌త్య‌నారాయ‌ణ లేవనెత్తారు. ఓటుకి కోట్లు కేసు పూర్తిగా చంద్రబాబు మార్గద‌ర్శ‌క‌త్వంలోనే జ‌రిగిన‌ట్లు అర్థం అవుతోంద‌ని, అందుచేత ఆయ‌న్ని మొద‌టి దోషిగా నిల‌పాల‌ని బొత్సా డిమాండ్ చేశారు. 

ఢిల్లీ టూర్ ఆంత‌ర్యం
ఇప్ప‌టికిప్పుడు ఢిల్లీ ప‌ర్య‌ట‌న చంద్ర‌బాబు ఎందుకు పెట్టుకొన్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప‌రిస్థితి చూస్తుంటే ప్ర‌జ‌లకు కావ‌ల‌సిన ప్ర‌యోజ‌నాల కోసం కాకుండా, ఈ కేసు నుంచి కాపాడుకొనేందుకు ఢిల్లీ యాత్ర చేప‌ట్టిన‌ట్లు అర్థం అవుతోంద‌ని బొత్సా అభిప్రాయ ప‌డ్డారు. అందుచేత‌నే రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా డిమాండ్ చేయ‌కుండా చంద్ర‌బాబు దొంగాట ఆడుతున్నార‌ని ఆయ‌న అన్నారు. రాష్ట్ర ప్ర‌జ‌ల త‌ర‌పున ప్ర‌త్యేక హోదా కోరుతూ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో ఢిల్లీలో ధ‌ర్నా చేసి కేంద్రం  మీద ఒత్తిడి తెచ్చిన సంగ‌తిని ఆయ‌న గుర్తు చేశారు. కానీ ఆ మ‌ర్నాడే తెలుగుదేశం ఎంపీలు ప‌రిగెత్తుకొని వెళ్లి, కేంద్ర ఆర్థిక మంత్రి ని క‌లిసి ప్ర‌త్యేక ప్యాకేజీ గురించి డిమాండ్ చేయ‌డాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. ప్ర‌త్యేక ప్యాకేజీలు కేటాయిస్తే తాము సంతోషిస్తామ‌ని, కానీ ప్ర‌త్యేక హోదా మాత్రం క‌చ్చితంగా కావాల్సిందే అని బొత్సా స్ప‌ష్టం చేశారు. పైగా ఈ విష‌యంలో క‌చ్చితమైన హామీ లేద‌ని ఆయన గుర్తు చేశారు. బీహార్ కు కేంద్రం 1.65 ల‌క్ష‌ల కోట్ల రూపాయిల ప్యాకేజీ ప్ర‌క‌టించింద‌ని, చంద్ర‌బాబు కానీ, టీడీపీ ఎంపీలు కానీ నోరెత్త‌కుండా ఎందుకు ఉన్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఓటుకి కోట్లు కుంభ‌కోణం కేసు నుంచి త‌ప్పించుకొనేందుకే ఈ విష‌యాల్ని ప్ర‌శ్నించ‌టం లేద‌ని ఆయ‌న అన్నారు. 
Back to Top