మాట తప్పిన నాయుళ్లు

  • పోలవరం కాంట్రాక్ట్ కోసం హోదాను తాకట్టుపెట్టారు
  • బాబు, వెంకయ్యలవి మోసపూరిత రాజకీయాలు
  • ఏపీ ప్రజలను అన్యాయానికి గురిచేస్తున్నారు
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వేణుగోపాలకృష్ణ
రాజమండ్రి: సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ కోసం ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారని వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. విభజనతో అన్యాయానికి గురైన ఆంధ్రరాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలుపుతామని చెప్పిన మాటలకు విరుద్ధంగా అధికార బీజేపీ, టీడీపీలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన చైతన్యపథం కార్యక్రమానికి హాజరైన వేణుగోపాల కృష్ణ ప్రత్యేక హోదా పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్‌ సాక్షిగా హోదాను పుట్టించిన పార్టీలే గిట్టించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాష్ట్రాన్ని విభజించే ముందు ఏపీ ప్రజలు కోల్పోయిన ఆదాయాన్ని పూడ్చాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్‌ సమక్షంలో గత ప్రధాని చెప్పారని గుర్తు చేశారు. అనుభవజ్ఞుడినని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసం హోదాను తాకట్టుపెట్టి ప్రజలను అన్యాయానికి గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. 5 కోట్ల ఆంధ్ర ప్రజలు హోదా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారన్నారు. చిన్న బాలుడు నుంచి పండు వృద్ధుడి వరకు హోదా కోసం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసే పరిస్థితి కల్పించారని ధ్వజమెత్తారు.

 ప్రజలు ఎంతో నమ్మకంగా రాజకీయ నాయకులపై నమ్మకంతో అధికార పీఠం ఎక్కిస్తే టీడీపీ, బీజేపీ వారికి చేస్తున్న మేలేంటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యదేశంలో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక వెంకయ్యనాయుడు, చంద్రబాబు అబద్ధాలతో రాజకీయాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి చేకూరే లబ్ది ఏంటో సామాన్య ప్రజలకు అడిగినా చెబుతారన్నారు. అలాంటి హోదాను స్వప్రయోజనాల కోసం తాకట్టుపెట్టడం దుర్మార్గమన్నారు. 
 
Back to Top