ఆస్తుల ప్రకటనకు ఇదా సమయం?

హైదరాబాద్, 16 సెప్టెంబర్ 2013:

'ఫిడేల్‌ వాయించిన నీరో చక్రవర్తి' మాదిరిగా చంద్రబాబు నాయుడి తీరు ఉందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎద్దేవా చేసింది. ఒక వైపున రాష్ట్రం చీలిక అంచున, సంక్షోభం అంచున ఉంటే.. ఎటు పోయి ఎటు పడుతుందో అని మెడ మీద కత్తి వేలాడుతుంటే.. ఢిల్లీ పెద్దల కుట్రలకు బలైపోతుంటే.. వాటి మీద స్పందించకుండా నేను ఆస్తులు ప్రకటించాను.. మీరూ ప్రకటించండి అంటూ చంద్రబాబు నాయుడు చేసిన డ్రామా ఇదే తీరును తలపిస్తోందని దుయ్యబట్టింది. మీరు మీ ఆస్తులు ప్రకటిస్తే.. అవినీతి తగ్గిపోతుందా? అని నిలదీసింది. కాకిలెక్కలు చెబితే అవినీతి తగ్గిపోదని వ్యాఖ్యానించింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు మాట్లాడుతూ.. చంద్రబాబు ఆస్తుల ప్రకటన తీరును తప్పుపట్టారు. చంద్రబాబు నాయుడికి దమ్ముంటే.. గతంలో శ్రీమతి విజయమ్మ వేసిన పిటిషన్‌పై మళ్ళీ దర్యాప్తును కోరాలని సవాల్‌ చేశారు.

రాష్ట్రం నిట్ట నిలువునా చీలిపోయి.. రెండు ప్రాంతాల ప్రజలు ఉద్యమాల్లో ఉంటే.. ఏం చేయాలో అర్థం కాక, అను నిత్యం తనను అనుమానిస్తున్న ప్రజలకు సమాధానం చెప్పలేక, బస్సు యాత్ర నుంచి పారిపోయి తిరిగి వచ్చిన చంద్రబాబు నాయుడు ఆస్తులు ప్రకటించిన తీరు చూస్తే.. 'తాటిచెట్టు ఎందుకు ఎక్కావంటే.. దూడ గడ్డి కోసం' అని సామెత చెప్పినట్టుగా ఉందని జూపూడి ఎద్దేవా చేశారు. సమయం సందర్భం లేకుండా చంద్రబాబు వ్యవహరించిన తీరును ఆయన గర్హించారు. ప్రజలకు జ్ఞాపకశక్తి ఉండదు అని నమ్మేవాళ్ళలో మొదటి వ్యక్తిగా తన ఆస్తులను ప్రకటిస్తున్నానని, ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకులందరూ తన బాటలో ఉంటే ఈ దేశంలో అవినీతి తగ్గుతుంది.. అని చెప్పే ఒక విచిత్ర సిద్ధాంతకర్త చంద్రబాబు నాయుడు రాజకీయ నాయకుడెలా అయ్యారో అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన అస్తులు తాను ప్రకటించవచ్చన్నారు. కానీ ఆస్తులు ప్రకటించినంత మాత్రాన ఈ దేశంలో అవినీతి తగ్గుతుందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఆస్తులు ప్రకటిస్తే.. దేశమంతా ప్రకటించాలని రూలు ఎక్కడైనా ఉందా? అన్నారు.

ఆదాయపు పన్ను శాఖ సాధారణంగా ఫిబ్రవరి, మార్చి నెలల్లో‌ ఆదాయ వివరాలు అడుగుందని, ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల సంఘానికి ఆదాయ వివరాలతో అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుందని జూపూడి తెలిపారు. కానీ చంద్రబాబు నాయుడు గతంలో ప్రకటించిన తప్పుల తడక, బినామీ ఆస్తుల గురించి మాట్లాడకుండా.. ఆయన కొడుకు, భార్య, తాత ముత్తాతల ఆస్తులను సరైన పద్ధతిలో చెప్పకుండా ఆయన ఇష్టం వచ్చినట్లుగా ఒక తెల్ల కాగితంపై సంతకం లేకుండా బయట పడేసే చిత్తు పేపర్‌లా తన ఆస్తులు ప్రకటించాను మీరంతా పేపర్లో రాయండి, టివీల్లో వేయండని, మిగతా వాళ్ళు ప్రకటించకపోతే నిలదీయండని చెప్పే చంద్రబాబు వాదనలో పస ఉన్నదా? అని ప్రశ్నించారు.

చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఆస్తుల వివరాలు సరైనవే అని భావిస్తే.. శ్రీమతి విజయమ్మ వేసిన కేసుని హడావుడిగా, గందరగోళ పడి ఎందుకు ఆయన తన మీద కేసు లేకుండా చేసుకున్నారని జూపూడి నిలదీశారు. దేశంలో అవినీతి పోవాలని అన్నా హజారే ఉద్యమించిన ఆగస్టు 15 నాడు జెండా భుజాన వేసుకుని చంద్రబాబు నాయుడు అటు ఇటు తిరిగి సంవత్సరం దాటినా అవినీతి పోయిందా? అన్నారు.

చంద్రబాబు నాయుడు గత ఏడాది ప్రకటించిన ఆస్తుల లెక్కలు, ఇప్పుడు ప్రకటించినవి తమ దగ్గర ఉన్నాయని జూపూడి తెలిపారు. 2012లో లోకేష్‌కు 673 లక్షల రూపాయల ఆస్తులున్నాయని చంద్రబాబు ప్రకటించారని, ఇప్పుడు 492 లక్షలు ఉన్నట్లు తెలిపారన్నారు. అంటే హెచ్చు తగ్గులు చూపించడానికి ఇదేమైనా స్టాక్‌ మార్కెట్టా? అని ఆయన ప్రశ్నించారు. లేక చంద్రబాబు కుమారుడికి వ్యాపారం చేయడం చేతకాక నష్టాల్లో పడిపోయారా? అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, ఆయన భార్య, కోడలి ఆస్తులు గత ఏడాది కన్నా పెరిగితే సుపుత్రుడి ఆస్తులు మాత్రం ఎందుకు తగ్గిపోయాయో వివరించలేదని నిలదీశారు.

తాను ప్రకటించిన ఆస్తులు కాకుండా ఎక్కడైనా ఇంకా ఉన్నట్లు నిరూపిస్తే.. ప్రజలకు రాసి ఇస్తానన్న చంద్రబాబు సవాల్‌ను జూపూడి ఎద్దేవా చేశారు. అంటే ఆయన దాచిపెట్టుకున్న ఆస్తులను కనుక్కుని ఆయనకు చెబితే ఆయన మాకు రాసిస్తారా? అన్నారు. చంద్రబాబు ఆస్తులు ఎక్కడున్నాయో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజలకు లేదన్నారు. చంద్రబాబు బినామీ ఆస్తులపై వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ అడిగిన విచారణను అలాంటి దర్యాప్తు సంస్థ ఏదైనా ఉంటే తేల్చుకుంటుందన్నారు. రాష్ట్రం విడిపోతున్న ఈ సమయంలో ప్రజలేం గగ్గోలు పెడుతున్నారు? మీరేం భావిస్తున్నారు చంద్రబాబు గారూ అని ప్రశ్నించారు.

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని ప్రజల మధ్య నుంచి తీసుకువెళ్ళి 16 నెలలుగా జైలులో నిర్బంధించారని జూపూడి ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్రీ జగన్‌ ప్రతి సంవత్సరం తన ఆస్తులను ప్రకటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు. చంద్రబాబులాగా దొంగ లెక్కలు, కాకి లెక్కలు, లేక మసిపూసి మారేడుకాయ చేసే విధానాన్ని ఆయన ఎంచుకోలేదన్నారు. చంద్రబాబు నాయుడు అవినీతిపరుడు కాకపోతే శ్రీమతి విజయమ్మగారు వేసిన 2.424 పేజీల అఫిడవిట్‌పై కేసును తిరగదోడమని కోరాలని జూపూడి డిమాండ్‌ చేశారు. తనపై వచ్చిన కేసులను పలుకుబడి ఉపయోగించి కొట్టి వేయించుకున్న చంద్రబాబు నాయుడిని ప్రజలు నమ్మడం లేదన్నారు. చంద్రబాబు నాయుడు ఆస్తులను ప్రకటించినంత మాత్రాన ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతారనుకుంటే అదంతా భ్రమ అవుతుందన్నారు. చంద్రబాబుకు ఉన్న బినామీ ఆస్తులు, వ్యాపారాలు, సింగపూర్‌లోని ఆస్తులు, ఆయన కొడుకును చదివించిన రామలింగరాజు, లోకేష్‌ వెలగబెట్టిన డిగ్రీలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని జూపూడి వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు ఒక వేళ న్యూటనో.. ఐన్‌స్టీనో, లేక ఆర్థికవేత్తో అవ్వాలనుకుంటే.. ఇది మార్గం కాదని హితవు పలికారు.

ఆస్తుల ప్రకటన అంటే.. ఆర్థిక సంవత్సరంలో చేసే ఒక ప్రక్రియ అని, రాజకీయ నాయకులు ఎన్నికల సంఘానికి ఇచ్చే ఒక అపిడవిట్‌ అన్నారు. ఇది ఒక ప్రక్రియ అన్నారు. అంతే గాని పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా ఉన్నట్లు దేశం అంతా రుద్దాలని భావిస్తే.. పొరపాటవుతుందన్నారు. ముప్పై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కాకిలెక్కలు చెబితే అవినీతి తగ్గుతుందని ఎవరూ భావించడం లేదన్నారు. అవినీతి తగ్గడానికి వేరే సూత్రాలున్నాయని, అవినీతి పెరగడానికి వేరే మార్గాలున్నాయని అన్నారు. రాష్ట్రంలోని సమస్యలకు పరిష్కార మార్గాలు వెతకాలని చంద్రబాబుకు జూపూడి సూచించారు. చంద్రబాబు మీద ఉన్న ఐఎంజి లాంటి కుంభకోణాలపై ఆయన విచారణ కోరితే అయొనా ప్రజలు ఆయనను విశ్వసిస్తారేమో ప్రయత్నించాలని అన్నారు. చంద్రబాబు నాయుడు కాకమ్మ కథలు చెప్పడం మానుకోవాలని కోరారు.

Back to Top