ప్రజల మనోభావాలకు భిన్నంగా నాయుళ్ల ప్రవర్తన

  • ప్యాకేజీ మేలంటూ బాబు మరోసారి మోసం
  • ఎంతటి పోరాటమైనా చేసి హోదా సాధించుకుంటాం
  • విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో పోరాడతాం
  • వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి
విశాఖపట్నం: ప్రత్యేక హోదాపై 5 కోట్ల ఆంధ్ర ప్రజల మనోభావాలకు భిన్నంగా కేంద్రమంత్రి వెంకయ్య, సూపర్‌ సీనియర్‌ చంద్రబాబులు ఉండడం రాష్ట్ర దౌర్భాగ్యమని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి విమర్శించారు. విశాఖ అక్కయ్యపాలెంలో నిర్వహించిన చైతన్యపథం కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ... ప్రజలు పోరాడుతున్న హోదా కంటే కేంద్రం ప్రకటించిన ప్యాకేజీనే మేలని వెంకయ్య, చంద్రబాబులు వారి మనోభావాలను ప్రజలపై రుద్దుతున్నారన్నారు. ప్యాకేజీ ప్రకటించిన తరువాత టీడీపీ పెద్దలు, కొన్ని పత్రికలు హోదా గురించి 60 శాతం మంది ప్రజలకు అవగాహన లేదని చెప్పడం నిజంగా సిగ్గుచేటన్నారు.

 ప్రజలకు తెలియదని గుడ్డిగా చెబుతున్నారంటే పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగుతున్నట్లుగా వాళ్లు ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు స్వాగతించిన ప్యాకేజీయే మేలు అని చెప్పడానికి టీడీపీ నేతలు ప్రజలపై కుట్రపూరిత ఆలోచనలు రుద్దుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో రెండుసార్లు 175 మంది ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా తీర్మాణం చేసి పంపించినా కేంద్రం హోదాను పట్టించుకోలేదని దుయ్యబట్టారు. అసెంబ్లీలో ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ హోదాపై చర్యకు పట్టుబడితే ప్యాకేజీపై స్టేట్‌మెంట్‌ ఇస్తాననడం దుర్మార్గమన్నారు. ప్యాకేజీ ప్రకటించనున్నారని కేంద్రం నుంచి సూచనలు వస్తే ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు సంయుక్తంగా బంద్‌ నిర్వహిస్తే అక్రమంగా అరెస్టు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే చంద్రబాబు ప్యాకేజీ కోరుకుంటున్నట్లు స్పష్టంగా అర్థమైందన్నారు. 

స్వార్థ ప్రయోజనాల కోసం హోదాను తాకట్టపెట్టిన చంద్రబాబు ...దానివల్ల ఒరిగేదేమీ ఉండదని ప్రజలను మరోసారి మోసం చేయడానికి సిద్ధపడ్డారన్నారు. విభజన చట్టంలోని విశాఖ రైల్వేజోన్‌పై చంద్రబాబు ఇప్పటి వరకు ప్రస్తావించలేదని ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్‌ కోసం ....విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు నినాదంతో శాంతియుత ఉద్యమం చేసి సాధించుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బాక్సైట్‌ విషయంలో గిరిజనులంతా ఏకమై గనులను తవ్వకుండా ప్రభుత్వాన్ని ఏవిధంగా ఎదుర్కొన్నారో అదే విధంగా హోదా సాధన కోసం విశాఖ ముందుంటుందన్నారు. యువత, విద్యార్థులు హోదాపై చైతన్యవంతులు కావాలని కోరారు. 

 
Back to Top