కిరణ్‌, బాబు జనం తిరస్కరించిన నేతలు

హైదరాబాద్:

చంద్రబాబు నాయుడు, కిరణ్‌కుమార్‌రెడ్డి ఇద్దరినీ ప్రజలు తిరస్కరించారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ప్రచారంలో ప్రజలకు చెప్పుకోవడానికి వారిద్దరూ సాధించిందేమీ లేదని ఆమె విమర్శించారు. తమ పరిపాలనను మళ్ళీ తీసుకువస్తామని చెప్పుకునే ధైర్యం చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డికి ఉందా? అని ప్రశ్నించారు. అయితే.. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలన నాటి సువర్ణయుగాన్ని తీసుకువస్తామని‌ శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ సగర్వంగా ఓటర్లకు చెప్పగలదన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వాసిరెడ్డి పద్మ చంద్రబాబు, కిరణ్‌రెడ్డిలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిని నేరుగా ఎదుర్కొనే సత్తా లేక చంద్రబాబు దొంగ ఎత్తుగడలు వేస్తున్నారని వాసిరెడ్డి పద్మ నిప్పులు చెరిగారు. మూడున్నరేళ్లుగా శ్రీ జగన్‌పై అక్రమ కేసులు పెట్టి వేధించిన చంద్రబాబు, కిరణ్‌బాబు ఇతర బాబులంతా కలసి ఎన్నికల సమయంలో ఒకటికి పది తలలుగా పుట్టుకొస్తున్నారని ఆమె విమర్శించారు. కొత్తగా పుట్టిన పార్టీలు, పుట్టబోయే పార్టీల బండారాన్ని వైయస్ఆర్‌సీపీ త్వరలోనే బయటపెడుతుందని చెప్పారు.

చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి ఇద్దరూ వారి బలాలేంటో చెప్పుకోకుండా శ్రీ వైయస్ జగన్‌పై దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకున్నారని పద్మ విమర్శించారు. రాజమండ్రి వేదికగా కిరణ్ ‌ఎంతసేపు ప్రసంగించినా.. తన మూడున్నరేళ్ల పాలనను పొరపాటున కూడా ప్రస్తావించలేదన్నారు. కిరణ్ హయాంలో విద్యుత్, ఆర్టీసీతో పాటు అన్ని రకాల వడ్డింపులతో ప్రజలు ముప్పుతిప్పలు పడ్డారని వివరించారు. ఆఖరి దాకా సీఎం పదవి‌ని పట్టుకొని వేలాడిన కిరణ్‌కు తమ పార్టీ అధినేత శ్రీ జగన్‌ను విమర్శించే అర్హతలేదన్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉండి ఉంటే సీఎంను చేసేవారమని ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జిగా వ్యవహరించిన గులాంనబీ ఆజాద్ చెప్పిన విషయం కిర‌ణ్‌కు గుర్తులేదా? అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు.

చంద్రబాబుకు శ్వాస అబద్ధాలే!:

ఉదయం లేచింది మొదలు అబద్ధాలే శ్వాసగా తీసుకొని చంద్రబాబు బతుకుతున్నారని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. ‘బీజేపీతో శ్రీ జగన్ కలసిపోవడం ఖాయం’ అంటూ కడప ఉప ఎన్నికల స‌మయంలో దొంగ ప్రచారం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు అదే బీజేపీతో పొత్తుకు వెంపర్లాడుతున్న వైనాన్ని తెలుగు ప్రజలు గమనిస్తున్నారన్నారు. శ్రీ జగన్‌కు ఓటేస్తే కాంగ్రెస్‌కు వేసినట్లని కొత్తగా ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. మూడున్నరేళ్లుగా కాంగ్రెస్‌కు అడుగడుగునా మడుగులొత్తిన చంద్రబాబు చర్యలన్నీ ప్రజలకు గుర్తున్నాయన్నారు. తెలుగు ప్రజలకు తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్‌ పార్టీ కాళ్లు నరికేయాలని చెప్పిన శ్రీ జగన్ అదే పార్టీతో కలవరనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు.

చంద్రబాబు గోబె‌ల్సు ప్రచారం చేసినా ఎవరూ నమ్మరన్నారు. చంద్రబాబుకు తన తొమ్మిదేళ్ల చీకటి పాలనను తిరిగి తీసుకొస్తానని చెప్పే ధైర్యం ఉందా? అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ‌చంద్రబాబుది విజన్ 2020 కాదని, 420 అని తానే ముచ్చటగా రాసుకున్న ‘మనసులో మాట’ పుస్తకం చూస్తే తెలుస్తుందన్నారు. చంద్రబాబుకు నిజంగా ఒక విజన్ ఉంటే తన మనసులో‌ మాట పుస్తకం, 2004, 2009 ఎన్నికల మేనిఫెస్టోను ఎందుకు బ్లాక్ చేశారని‌ వాసిరెడ్డి పద్మ సూటిగా ప్రశ్నించారు.

Back to Top