మళ్ళీ ప్రైవేటీకరణ దిశగా బాబు అడుగులు

హైదరాబాద్, సెప్టెంబర్ 22: ఆంధ్రప్రదేశ్‌లోని సహకార పంచదార ఫ్యాక్టరీలను తన వంది మాగధులకు కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం కోఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. 1995-2004 మధ్య కాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నపుడు నష్టాలొస్తున్నాయనే నెపంతో ఎలాగైతే ప్రభుత్వ రంగ సంస్థలను తన వారికి ధారాదత్తం చేశారో ఇపుడు కూడా అలాగే వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... పచ్చచొక్కాల కన్ను ఏ ప్రభుత్వ సంస్థపై పడుతుందో దానికి నష్టాలొస్తున్నాయని చెప్పి తన వారికి కట్టబెట్టారని ఆరోపించారు. 2004లో ఓటమి పాలయ్యాక తాను మారానని చెప్పుకున్న చంద్రబాబు ఇప్పటికీ ఏ మాత్రం మారలేదని నిరూపించుకుంటున్నారన్నారు. ఏపీలోని పంచదార ఫ్యాక్టరీల పనితీరు అధ్యయనం కోసం తాజాగా నియమించిన కమిటీయే అందుకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రైవేటీకరణకు ముందు అధ్యయనం పేరుతో ఇలా కమిటీని వేయడం, నష్టాలొస్తున్నాయని వారితో తూతూ మంత్రంగా నివేదిక ఇప్పించడం, ఆ తరువాత తన వాళ్లకు కట్టబెట్టడం అనేది చంద్రబాబు పథక రచనలో భాగం. పంచదార ఫ్యాక్టరీల పనితీరును అధ్యయనం చేయడానికి నియమించిన కమిటీలో అందరూ ప్రయివేటు పంచదార ఫ్యాక్టరీల యజమానులే ఉండటం ఏమిటి?

రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16వ తేదీన జారీచేసిన 289 నంబరు జీవో ద్వారా ఏర్పాటైన కమిటీలో తూర్పుగోదావరిలోని సర్వారాయ షుగర్స్‌కు చెందిన సుధాకర్ చౌదరి, ఖమ్మం జిల్లా పాలేరు పంచదార ఫ్యాక్టరీ ప్రతినిధి భరద్వాజ, బ్రహ్మయ్య అండ్‌కో ఆడిటింగ్ కంపెనీకి చెందిన శ్రీనివాస మోహన్‌లు సభ్యులుగా ఉన్నారు. బ్రహ్మయ్య అండ్‌ కో కంపెనీ అధినేత దేవినేని సీతారామయ్య ఎన్టీఆర్ ట్రస్టులో ఒక సభ్యుడు.

గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పాలేరు షుగర్స్‌ను కారు చౌక ధర రూ.5 కోట్ల రూపాయలకే కట్టబెట్టిన మధుకాన్ కంపెనీ ప్రతినిధి భరద్వాజ, సుధాకర్ చౌదరి కూడా టీడీపీకి సన్నిహితులే. పంచదార ఫ్యాక్టరీలన్నింటినీ ఒక పథకం ప్రకారం ప్రైవేటీకరించే దురుద్దేశంతోనే వీరిని సభ్యులుగా నియమించారు. ఒక కుక్కను చంపే ముందు పిచ్చికుక్క అని ముద్ర వేసిన చందంగానే... ఒక ప్రభుత్వ రంగ సంస్థను తన వారికి ధారాదత్తం చేసే ముందు దానికి నష్టాలు వస్తున్నాయని చెప్పించడం చంద్రబాబుకు అలవాటు.

కోవూరు(నెల్లూరు) షుగర్ ఫ్యాక్టరీ పనితీరు, దాని ఆధునీకరణ అధ్యయనం కోసం 290 జీవోను జారీ చేశారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ అధ్యయనానికి ప్రైవేటు ఆపరేటర్లయిన కేశినేని, దివాకర్ ట్రావెల్ సంస్థల ప్రతినిధులతో కమిటీని వేసినట్లుగా చంద్రబాబు వైఖరి ఉంది. తొమ్మిదేళ్ల పాలనలో ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడాన్ని కూడా తన ఘనతగా చెప్పుకుంటూ పుస్తకాల్లో కూడా రాశారు.

గత ఎన్డీయే హయాంలో దేశం మొత్తం మీద 84 ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరిస్తే అందులో 54 ఆంధ్రప్రదేశ్‌లోనివే. తన పాలనలో ప్రభుత్వ సంస్థలకు నష్టాలొస్తే దాన్ని కూడా ఘనతగా చెప్పుకోవడం చంద్రబాబుకే చెల్లింది.

తెరవెనుక చినబాబు

చక్కెర ఫ్యాక్టరీల ప్రైవేటీకరణ యత్నం వెనుక చినబాబు హస్తం ఉంది. ఆయన ఒక రాజ్యాంగేతర శక్తిగా ఉంటూ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు. చిన్నబాబును కాబోయే ముఖ్యమంత్రిగా తన మంత్రులతో చంద్రబాబు ప్రచారం చేయించుకుంటున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పోస్టింగ్‌లను చినబాబే నిర్దేశిస్తున్నారు. ఎక్కడ ఏ సంస్థలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలో కూడా ఆయనే చెబుతున్నారు.

ఇంత దారుణంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, ప్రభుత్వ సంస్థలను పందికొక్కుల్లాగా దోచుకుంటూ ఇంకొకరిని అవినీతి పరులంటూ నిందించే నైతికత టీడీపీ వారికెక్కడిది? ప్రభుత్వ రంగ సంస్థలను చంద్రబాబు తన మనుషులకు దత్తం చేయకుండా వైఎస్సార్‌సీపీ తుదికంటా పోరాడుతుంది.

Back to Top