బాబు.. నిప్పా? తుప్పా?

*నైతిక విలువలు ఉంటే తక్షణమే సీఎం పదవి నుంచి తప్పుకోవాలి
*ఏసీబీ చార్జ్‌షిట్‌లో సీఎం పేరు ప్రస్తావనపై బాబు సమాధానం చెప్పాలి
*స్వ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు
*ఓటుకు కోట్లు కేసు తరువాత తోక ముడుచుకొని విజయవాడ పరార్‌
*ఈ కేసు నుంచి బయటపడేందుకు ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారు
*ప్రత్యేక హోదాపై ప్రైవేట్‌ బిల్లు పెడుతాం
*వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ

హైదరాబాద్‌:  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి చంద్రబాబు తక్షణమే తప్పుకోవాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబే ప్రధాన ముద్దాయి అని, ఆయన పేరు రెండు చార్జిషిట్లలో నమోదు అయ్యిందని, ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన వెంటనే సీఎం పదవికి రాజీనామా చేసి మరొకరిని ఆ పదవిలో నియమించుకోవాలని బొత్స సూచించారు. గురువారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ఏసీబీ రెండో చార్జిషిట్‌ విడుదల చేసిన నేపథ్యంలో బాబు తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. మొదటి చార్జిషిట్‌లో బాబు పేరు 26 సార్లు ప్రస్తావనకు రాగా, రెండో చార్జిషిట్‌లో 22 సార్లు నమోదు చేసినట్లు అందులో ఉందన్నారు. ఈ  కుట్ర ఎక్కడి నుంచి ప్రారంభం అయ్యిందని ఏసీబీ తన చార్జిషిట్‌లో పేర్కొందన్నారు. టీడీపీ మహానాడు నుంచి ప్రారంభమై హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌ వరకు ఓటుకు కోట్లు కేసు సాగిందని చెప్పారు. దీనిపై చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. 

ఏ ముఖం పెట్టుకొని సీఎంగా కొనసాగుతారు?
రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిజంగా మీకు నైతిక విలువలు తెలిసి ఉంటే..నిప్పు నిప్పు అని చెబుతుంటారు కదా. ఇవాళ మీరు నిప్పా? తుప్పా సమాధానం చెప్పాలని బొత్స నిలదీశారు. నైతిక విలువలు ఉంటే ముందుగా మీరు పక్కకు తప్పుకొని, మీ పార్టీ నుంచి ఎవరో ఒకరికి పెట్టుకోవాలని సలహా ఇచ్చారు. ఆ పదవి నుంచి తప్పుకొని  మంచి సందేశం ఇవ్వాలని హితభోద చేశారు. ఒక అవినీతి కేసులో సీఎంపై ఆరోపణలు రావడం, కోర్టు నోటీసులు ఇచ్చిన సందర్భాలు ఎక్కడా లేదన్నారు. రాష్ట్ట్రంలోని 5 కోట్ల ప్రజల ప్రయోజనాలను ఇవాళ మీరు తాకట్టు పెట్టుతున్న నేపథ్యం బాధాకరమన్నారు. ఇదేదో మేం చెబుతున్న మాట కాదని, తెలంగాణలో జరిగిన పరిణామాలు, సంఘటనలు బేరిజు వేసుకుంటే ఇవాళ మనం ఎంత కోల్పొయామో అందరికి తెలుసు అన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని, అభివృద్ధిని కాంక్షించి తక్షణమే నిర్ణయం తీసుకోవాలని వైయస్‌ఆర్‌సీపీ డిమాండ్‌ చేస్తోందన్నారు.

ఎలా లాలూచీ పడ్డారో ఆలోచించండి
చంద్రబాబు తన సొంత ప్రయోజనాల కోసం కేంద్రం, తెలంగాణ రాష్ట్రంతో  ఎలా లాలూచీ పడ్డారో ఒక్క సారి ఆలోచించాలని బొత్స సత్యనారాయణ సూచించారు. పదేళ్ల ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను ఓటుకు కోట్లు కేసు నుంచి బయట పడటం కోసం చంద్రబాబు కేసీఆర్‌తో ఒడంబడిక చేసుకున్న ప్రకారం హైదరాబాద్‌ నుంచి తోక ముడిచి అమరావతికి పారిపోయారని విమర్శించారు. ఈమధ్యలో సింగపూర్, చైనా కంపెనీలను ముందుకు తీసుకొని వచ్చారని ధ్వజమెత్తారు. నిర్దిష్టమైన కార్యాచరణ, నిర్ణయాలు తీసుకోకుండా ఈ కేసు ఉందన్న ఉద్దేశంతో ప్రజల ప్రయోజనాలను పక్కన బెట్టి చంద్రబాబు  నిర్ణయం తీసుకున్నారని నిప్పులు చెరిగారు.  

హోదాను తాకట్టు పెట్టారు
ఏపీకి సంజీవని అయిన ప్రత్యేక హోదాను చంద్రబాబు తన స్వార్థం కోసం కేంద్రానికి తాకట్టు పెట్టారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. చట్ట సభల సాక్షిగా రాజ్యసభలో ఆ నాడు ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాటి ప్రధాన మంత్రి, నాటి ప్రతిపక్ష పార్టీ వాగ్ధానం చేశాయని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో పదిహేనేళ్లు ప్రత్యేక హోదా కావాలన్న చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో చిక్కుకున్న నాటి నుంచి మాట మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు  నుంచి  బయటపడే నేపథ్యంలో చంద్రబాబు ప్రత్యేక హోదా అనే సంజీవని అంశాన్ని నీరుగార్చారని ఫైర్‌ అయ్యారు. దీనితో పాటు పోలవరం ప్రాజెక్టును కూడా తన స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు.   పోలవరాన్ని కేంద్రమే కడుతుందని చట్టంలో చెప్పినా కూడా..కేంద్రానికి వేసులుబాటు ఇస్తూ బాబు ఈ కేసు నుంచి బయటపడేందుకు, తన అవినీతి కోసం ఆ ప్రాజెక్టును తీసుకున్నారని విమర్శించారు. సీఎం తన వ్యక్తిగత స్వార్థం కోసం, ఓటుకు కోట్లు కేసులో ముద్దాయిగా ఉన్న కారణంగా ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టారని మండిపడ్డారు.  ఈ విషయంలో ఎక్కడా శిక్షపడుతుందోనని చెప్పి ప్రతి అంశంపై రాజీ పడుతూ.. రాబోయే తరాల భవిష్యత్తును తాకట్టు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పైగా సుప్రీం కోర్టు నోటీసులు ఇవ్వడం చిన్న విషయం అన్నట్లుగా తేలికగా మాట్లాడటం దారుణమన్నారు. ఇప్పటికైనా రాజ్యంగం పట్ల విలువలు ఉంటే నీవు పక్కకు తప్పుకో. మిగతా ఎవరినైనా పెట్టుకొండి, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడండి అని సూచించారు.   

ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగుతోంది
ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.  ప్రత్యేక హోదా కోసం ఎందాకైనా ఉద్యమిస్తామని, పార్టీ అ«ధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే ఢిల్లీ నుంచి గల్లీ దాకా పోరాటం చేశారని గుర్తు చేశారు. రేపు ఎన్నికల్లో కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా తీసుకుంటామన్నారు. ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తారో వారితో మేం జతకడుతామని మా నాయకుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారని చెప్పారు. ఇందుకోసమే పార్లమెంట్‌లో ప్రైవేట్‌ బిల్లు ప్రవేశపెడుతున్నామని బొత్స సత్యనారాయణ చెప్పారు. చంద్రబాబు లాగానే ఆయన కుమారుడు లోకేష్‌ కూడా అవినీతికి పాల్పడుతున్నారని, ఐదు నెలల్లోనే ఆయన ఆస్తులు 22 శాతం పెరిగాయంటే ఏ మేరకు అవినీతికి పాల్పడుతున్నారో అర్థం చేసుకోవాలని బొత్స సత్యనారాయణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  
Back to Top