18 నెలల్లో పైసా కూడా విదిల్చలేదు

చంద్రబాబు అనుభవాన్ని పాలనలో చూపించు
రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉంది
ఇప్పటికైనా కళ్లు తెరిచి ఆదుకో

హైదరాబాద్ః
వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి ప్రభుత్వ పాలనపై నిప్పులు
చెరిగారు. రాష్ట్రంలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉంటే చంద్రబాబు ఏమాత్రం
పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కరవు, తుపాన్ లతో రైతులు తీవ్రంగా
నష్టపోతే వారిని ఆదుకోకుండా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందని
విమర్శించారు. పక్కరాష్ట్రాలన్నీ ఇప్పటికే కేంద్రానికి కరవు మండలాల
నివేదికలు పంపించాయని, కానీ చంద్రబాబు మాత్రం ఇంతవరకు రిపోర్ట్ పంపించకుండా
అలసత్వం ప్రదర్శిస్తున్నారని దుయ్యబట్టారు. వరద ప్రాంతాల్లోకి వెళ్లి
చంద్రబాబు ఫోటోలకు ఫోజులిస్తున్నారు తప్ప ఎక్కడా వారిని ఆదుకునేలా చర్యలు
తీసుకోవడం లేదన్నారు. 

తూర్పుగోదావరి జిల్లా,
కూనవరంనకు చెందిన సత్తిబాబు అనే కౌలు రైతు...నీలం, లైలా, జల్ తుఫాన్ తాలూకు
పరిహారం ఇప్పటివరకు చెల్లించలేదని ఫ్లెక్సీ పెడితే అతన్నీ అరెస్ట్
చేశారన్నారు. ప్రజా ప్రతినిధులకైతే రూ.5 కోట్లు ఇస్తారు, రైతులకు రూ.5 వేలు
కూడా చెల్లించరా అని న్యాయబద్ధంగా ఆరైతు ప్రశ్నిస్తే అతన్ని అరెస్ట్
చేయించారని నాగిరెడ్డి మండిపడ్డారు. ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదన్నారు.
భూసమీకరణకు భూములివ్వని రైతుల పంటలు తగలబెడుతున్నారు. తిరిగి బాధితులపైనే
పోలీసులను ఉసిగొల్పి కేసులతో వేధిస్తున్నారని ప్రభుత్వంపై నాగిరెడ్డి
నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యంలో ఎదుర్కోలేక పోలీసులను అడ్డుపెట్టుకొని
చంద్రబాబు దుర్మార్గమైన పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. రాబోయే
రోజుల్లో ఇదే పరిస్థితి ఉంటే ప్రజలు తిరగబడడం ఖాయమన్నారు.  

గత
సంవత్సరం ప్రకటించిన కరవు మండలాలకు సంబంధించి ఇంతవరకు ఇన్ పుట్ సబ్సిడీ
చెల్లించలేదని నాగిరెడ్డి అన్నారు. అవి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందినవని
మాట్లాడుతున్న చంద్రబాబు... అప్పటి కాంగ్రెస్ వ్యాపారస్తులకు కాంట్రాక్ట్
లు ఎలా కట్టబెడుతున్నారని ప్రశ్నించారు.
పుష్కరాలకు,
శంకుస్థాపనకు, విమానాలకు, కాంట్రాక్టర్లకు వందలకోట్లు ఖర్చుచేస్తున్న
చంద్రబాబు...దేశానికి తిండిపెట్టే రైతన్నకు, ప్రకటించిన నష్టపరిహారం కూడా
చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన అనుభవాన్ని పాలనలో,
రైతులను ఆదుకోవడంలో చూపించాలి గానీ, మాటల్లో కాదని విరుచుకుపడ్డారు.

రుణాలు
మాఫీ కాక రైతులు బ్యాంకులకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని నాగిరెడ్డి
అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం లేదు. ఇన్ పుట్ సబ్సిడీ
చెల్లించడం లేదని ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నించారు. రూ. 5 వేల కోట్లతో ధరల
స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు ఇప్పటివరకు ఆ ఊసే లేదన్నారు.
18 నెలల పాలనలో రైతులకు ఒక్క పైసా అయినా చెల్లించారా అని నిలదీశారు.
ఇప్పటికైనా చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకొని రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్
చేశారు. 
Back to Top