నాడు బకాయిలు కట్టకపోతే జైళ్లలో పెట్టావే!

తాట్రకల్లు

(అనంతపురం జిల్లా) 5 నవంబర్ 2012 : తన హయాంలో బకాయిలు కట్టకపోతే రైతులపై కేసులు పెట్టి, జైలు పాలు చేసి వారి ఆత్మహత్యలకు కూడా కారణమైన చంద్రబాబు ఇప్పుడు బకాయిలు కట్టొద్దంటూ నిస్సిగ్గుగా పిలుపులు ఇస్తున్నారని షర్మిల విమర్శించారు. బాబు జమానాలో వేధింపుల కారణంగా ఏకంగా నాలుగువేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారనీ, ఇప్పుడు అదంతా మరచి పోయినట్లు మాట్లాడుతున్నారనీ ఆమె దుయ్యబట్టారు. కానీ ప్రజలు అమాయకులు, పిచ్చివాళ్లూ కారని ఆమె అన్నారు. 19 వ రోజు పాదయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా తాట్రకల్లులో సోమవారం జరిగిన ఒక బహిరంగసభలో షర్మిల ప్రసంగించారు.
"చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా నాలుగువేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆనాడు అన్ని చార్జీలనూ పెంచేశారు. కట్టమని బలవంతం చేశారు. రైతుల మీద కేసు పెట్టి, జైళ్లలో పెట్టారు. ఇంట్లో సామాన్లు కూడా ఎత్తుకు పోయేవారు. మగవాళ్ల లేకపోతే ఆడవాళ్లను కూడా తీసుకెళ్లి జైలులో పెట్టేవారు. అవమానం తట్టుకోలేక, బకాయిలు కట్టలేక నాలుగువేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మళ్లీ ఈ రోజు నిస్సిగ్గుగా ఈ ప్రభుత్వానికి కట్టాల్సిన బకాయిలు కట్టొద్దండీ అని చెబుతున్నాడు. బకాయిలు కట్టకపోతే జైళ్లలో పెట్టి, కేసులు పెట్టినవాడాయన. అవన్నీ తాను మరచిపోయినట్టు, మీరు కూడా మరచిపోయారనుకుని ఇట్లా మాట్లాడుతున్నాడు. కానీ ప్రజలు అమాయకులు కారు. ఆయన అనుకుంటున్నట్లు ప్రజలు పిచ్చివాళ్లు కూడా కారు" అని షర్మిల అన్నారు.

"చంద్రబాబు సొంత మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డిని జాక్‌పాట్‌ ముఖ్యమంత్రి, ఎన్వలప్‌ ముఖ్యమంత్రి, సీల్డ్‌కవర్‌ ముఖ్యమంత్రి అంటున్న ఈయనగారు కూడా అలా వచ్చినవారే" అని షర్మిల వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
"కిరణ్ కుమార్‌ రెడ్డిగారికి, చంద్రబాబుగారికి లేనిది రాజన్నకు, జగనన్నకు మాత్రమే ఉన్నది విశ్వసనీయత అని ప్రజలకు తెలుసు.
రాజశేఖర్ రెడ్డిగారు చనిపోయి మూడు సంవత్సరాలైనా ఇంతగా ప్రజలు జ్ఞాపకం పెట్టుకున్నారంటే దానికి కారణం విశ్వసనీయత. జగనన్న ఇన్ని నెలలుగా మీ మధ్య లేకపోయినా, అందరూ కలిసి ఆయనను దోషి, దోషి అంటున్నా, లేదు, మాకు రాజన్న కొడుకే మాకు కావాలి, జగనన్ననాయకత్వమే కావాలి, జగనన్నే ముఖ్యమంత్రిగా రావాలని మీరు కోరుకుంటున్నారంటే దానికి కారణం జగనన్న విశ్వసనీయత." అని షర్మిల అన్నారు.
ప్రతి విషయంలోనూ ప్రతి ఫథకానికీ ఈ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని షర్మిల విమర్శించారు. ఫోన్ చేసిన 20 నిమిషాల్లో కుయ్..కుయ్..కుయ్‌మని వచ్చే108 ఇవాళ ఎక్కడా కనిపించటం లేదనీ, అది నాడు ఎంతో మందికి ప్రాణభిక్ష పెట్టిందనీ ఆమె గుర్తు చేశారు. "నిన్న ఎర్రన్నాయుడిగారిని చూశాం. 11 ఫోన్ చేసినా పలకలేదట. చివరకు ఆక్సిజన్ సౌకర్యం కూడా లేని మరో వాహనంలో ఆయనను ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఆయన చనిపోవడం జరిగింది. ఆయన ఒక్క ప్రాణమే కాదు, ప్రతి ఒక్కరి ప్రాణమూ ముఖ్యమే" అని ఆమె ఉద్వేగంగా అన్నారు.
"ఫీజు రీ ఇంబర్స్‌మెంట్‌ పథకమూ ఇలాంటిదే. ప్రతి కుటుంబం నుండి పెద్ద చదువులు చదివినవారు రావాలని రాజశేఖర్ రెడ్డిగారు ఆ పథకానికి రూపకల్పన చేశారు. కానీ ఇప్పటి ప్రభుత్వం కాలిస్తాం, సగమిస్తాం, ముక్కాలిస్తాం అంటూ కోతలు పెడుతోంది. ఆరోగ్యశ్రీతో పేదలకు కూడా కార్పొరేట్ ఆసుపత్రి వైద్యం అందించాలనుకుంటే, ఈ ప్రభుత్వం చాలా వ్యాధులను కార్పొరేట్ లిస్టులోంచి తొలగించింది. కనీసం పారాసెటమల్‌ మాత్రలు కూడా ఉండని ప్రభుత్వాసుపత్రులకు పేదలు మాత్రమే వెళ్లాలంటోంది ఈ ప్రభుత్వం" అని ఆమె విమర్శించారు. ఇలా ప్రతి పథకానికీ తూట్లు పొడుస్తున్నా, నిలదీయాల్సిన తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై నీచరాజకీయాలు సాగిస్తోందన్నారు. "ఇన్ని కుట్రలు, ఇంత నీచరాజకీయాలు మునుపెప్పుడూ చూడలేదు" అని ఆమె వ్యాఖ్యానించారు. జగనన్నను ఒక్క మనిషిని చేసి, బెయిలు కూడా రానివ్వకుండా పెద్దపెద్ద మనుషులు కుట్రలు పన్ని నాలుగు గోడల మధ్య బందీని చేశారనీ, అందుకే జగనన్న తనను పంపించాడనీ ఆమె చెప్పారు. దేవుడే జగనన్నను బయటకు తెస్తాడనీ, ఆ రోజు రాజన్నరాజ్యం దిశగా అడుగులు వేస్తామనీ, సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్, టిడిపిలకు గట్టిగా బుద్ధి చెప్పాలనీ. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచాలనీ షర్మిల కోరారు.

Back to Top