అదీ చంద్రబాబు ఘనత: మైసూరారెడ్డి

న్యూఢిల్లీ, 28 ఆగస్టు 2013:

ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా కొత్త రాజధాని నిర్మాణానికి నాలుగైదు లక్షల కోట్లు కావాలని అడిగిన ఘనత చంద్రబాబు నాయుడిదని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ కేంద్ర పాలక‌ మండలి సభ్యుడు డాక్టర్‌ ఎం.వి. మైసురారెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలోని జంతర్ మంత‌ర్ వద్ద వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ బుధవారం‌ చేపట్టిన ధర్నా వేదిక నుంచి ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడి తీరుపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొత్త రాజధాని ఏర్పాటు కోసం చంద్రబాబు నాయుడు నాలుగైదు లక్షల కోట్లు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను చంద్రబాబు వెన‌క్కి తీసుకుంటే సమైక్య రాష్ట్రం సాకారమవుతుందని మైసూరారెడ్డి అన్నారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు తాము పోరాడుతుంటే చంద్రబాబు ఇంట్లో కాలక్షేపం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. దశాబ్దాల పాటు చెమటచుక్కలు చిందించి నిర్మించికున్న రాష్ట్రాన్ని   ఓట్ల కోసం, సీట్ల కోసం ముక్కలు చేసిన ఘనత సోనియాదేనని మైసూరరెడ్డి విమర్శించారు. విభజనకు ముందు వేయాల్సిన మంత్రులు కమిటీని ఇప్పుడు వేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఏ మాత్రం కృషి చేయని టిడిపి నాయకులు... కేవలం వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ మీద ఆరోపణలు చేసేందుకు ముందుంటున్నారని మైసూరారెడ్డి విమర్శించారు.

Back to Top