సమైక్య ప్రయోజనాన్ని చాటడమే 'శంఖారావం' లక్ష్యం

హైదరాబాద్ 16 అక్టోబర్ 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త్వరలో సమైక్య శంఖారావం సభను నిర్వహించనుంది. హైకోర్టు అనుమతి లభించిన అనంతరం పార్టీ నేత డాక్టర్ ఎమ్.వి. మైసూరారెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి, తదితరులు ఈ సభలో ప్రసంగిస్తారని తెలిపారు. సంబంధిత అధికారులు, పోలీసు శాఖను సంప్రతించిన తదుపరి సభ నిర్వహించే తేదీని త్వరలో వెల్లడిస్తామని మైసూరా రెడ్డి చెప్పారు.

హైదారబాద్‌లో సమైక్య శంఖారావం సభ నిర్వహించేందుకు హైకోర్టు అనుమతినీయడం సంతోషం కలిగిస్తోందని ఆయన తెలిపారు. అక్టోబర్ 19నే సభ నిర్వహించాలంటే ఏర్పాట్లు కష్ట సాధ్యమవుతాయన్నారు. పోలీసు శాఖ, ఇతర అధికారులను సంప్రతించి తేదీని నిర్ణయిస్తామని వెల్లడించారు. సభ వేదికలో ఎటువంటి మార్పూ లేదనీ, ముందుగా ప్రకటించిన ప్రకారం ఎల్.బి. స్టేడియంలోనే సభను నిర్వహిస్తామనీ ఆయన వెల్లడించారు.

వైయస్ఆర్ కాంగ్రెస్ తాను తలపెట్టిన సభను నిర్వహించుకోవచ్చని హైకోర్టు తెలిపింది. కానీ సభను మద్యాహ్నం 2-3 గంటల మధ్యలో పెట్టుకోవాలని సూచించింది. సభను అనుమతించకపోవడంపై కోర్టు పోలీసు కమిషనర్ను తప్పుపట్టింది.

ప్రభుత్వం అనుమతినీయకపోవడంతో తమ పార్టీ హైకోర్టును ఆశ్రయించామని మైసూరారెడ్డి చెప్పారు. హింసించి ఆనందించే స్వభావం ఉన్న ప్రభుత్వ పర్యవేక్షణలో పోలీసులు వ్యవహరిస్తుండడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. శాంతి, భద్రతల సాకు చూపించి ప్రభుత్వం తొలుత తమ సభకు అనుమతి నిరాకరించిన అంశాన్ని గుర్తుచేశారు. చివరికి న్యాయం గెలిచిందనీ, తమకు అనుమతి లభించిందనీ మైసూరారెడ్డి తెలిపారు. భారత రాజ్యాంగం పౌరులందరికీ వాక్సాతంత్య్రాన్ని కల్సించిందని గుర్తుచేస్తూ, తాము తలపెట్టిన సభ ఎవరి మనోభావాలను గాయపరచడానికో లేదా ప్రజల మధ్య విద్వేషాలను రగల్చడానికో కాదని ఆయన స్పష్టంచేశారు. సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతాయనే బలమైన సందేశాన్ని ప్రజలలోకి పంపడమే తమ సమావేశ ముఖ్య ఉద్దేశమని వివరించారు. సమైక్యంగా ఉండటం మన రాష్ట్రానికే కాదు.. దేశానికి కూడా క్షేమమని ఆయన తెలిపారు. రాష్ట్రం విడిపోతే మూడు ప్రాంతాలు ఇక్కట్ల పాలవుతాయని మైసూరా రెడ్డి చెప్పారు.

Back to Top