నా ప్రాణాలకు ముప్పు ఉంది

  • టీడీపీ శ్రేణుల దురాగతం
  • వైయస్‌ఆర్‌సీపీలో చేరారని సర్పంచ్‌ కారు దగ్ధం
  • నిడమనూరు సర్పంచ్ కారును తగలబెట్టిన పచ్చనేతలు
  • పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన కోటేశ్వరరావు
  • టీడీపీ అరాచకాలపై పార్థసారథి ఆగ్రహం
విజయవాడ: అధికార తెలుగు దేశం పార్టీ అరాచకాలకు అంతే లేకుండా పోయింది. నిన్న అనంతపురం జిల్లాలో మంత్రి పరిటాల సునీత పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ఎంపీపీ ఉప ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఏకంగా ప్రభుత్వ కార్యాలయంలోనే నరికి చంపుతానని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీటీసీ సభ్యులను భయాందోళనకు గురి చేసిన సంఘటన మరువకముందే కృష్టా జిల్లాలో టీడీపీ శ్రేణులు మరో దురాఘతానికి పాల్పడ్డారు. టీడీపీని వీడి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారన్న అక్కస్సుతో దాడులకు బరితెగించారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం నిడమనూరులో బుధవారం అర్ధరాత్రి టీడీపీ నేతలు సర్పంచ్‌ కోటేశ్వరావు తన ఇంటి వద్ద పార్క్‌ చేసిన కారును తగులబెట్టారు. నిడమనూరు సర్పంచ్‌ కోటేశ్వరరావు ఇటీవలే టీడీపీ నుంచి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయన పార్టీ మారడంతో జీర్ణించుకోలేక టీడీపీ వర్గీయులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.  ఈ మేరకు విజయవాడ పడమట పీఎస్‌లో కోటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. 

ఎందుకంత అక్కస్సు
వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి
రాజధాని నడిబొడ్డున శాంతిభద్రతలు కరువయ్యాయని, టీడీపీ నేతలు బరితెగించి భౌతిక దాడులకు పాల్పడుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ శ్రేణులు దాడులకు దిగుతున్నారని ఆయన ఫైర్‌ అయ్యారు. ప్రభుత్వ వైఫల్యంతో పార్టీ వీడి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతుంటే టీడీపీ నేతలకు ఎందుకంత అక్కస్సు అని పార్థ సారధి ప్రశ్నించారు. నిడమనూరు సర్పంచ్‌ కోటేశ్వరరావు కారు దగ్ధం చేసిన ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. గురువారం పడమట పోలీసు స్టేషన్‌ వద్ద పార్థసారధి మీడియాతో మాట్లాడారు..ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు విజయవాడలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. సీఎం, డీజీపీ మకాం వేసిన విజయవాడ నగరంలో అధికార పార్టీ నేతలు అరాచకాలకు పాల్పడుతుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. అసలు ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా? లేదా? అని ఫైర్‌ అయ్యారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు తమ ఉనికి కాపాడుకోవడానికి ప్రత్యక్ష దాడులకు పాల్పడటం దారుణమన్నారు. ప్రభుత్వ దమనకాండను సహించేది లేదని, దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులను రకరకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నా బెదిరే ప్రసక్తి లేదని పార్థసారధి తేల్చి చెప్పారు.

ప్రాణ భయం ఉంది
నిడమనూరు సర్పంచ్‌ కోటేశ్వరరావు
టీడీపీ నేతలతో తన ప్రాణాలకు ముప్పు ఉందని గన్నవరం నియోజకవర్గం నిడమనూరు సర్పంచ్‌ కోటేశ్వరరావు పేర్కొన్నారు. తన ఇంటి వద్ద పార్క్‌ చేసిన కారుకు టీడీపీ నేతలు నిప్పు పెట్టడంతో ఆయన గురువారం విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం సర్పంచ్‌ మీడియాతో మాట్లాడుతూ..బుధవారం అర్ధరాత్రి ఒక్కసారిగా ఇంటి ముందు ఉన్న కారు నుంచి మంటలు రావడంతో భయంతో ఇంట్లోనే దాక్కున్నాయని చెప్పారు. ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇచ్చి, బంధువులతో కలిసి బయటకు వచ్చి చూసే సరికి కారు పూర్తిగా కాలిపోయిందన్నారు. తనకు రెండు కార్లు ఉండగా వీటిపై కిరోసిన్‌ పోసి అంటుపెట్టాలని దుండగులు భావించారని తెలిపారు. ఒక కారుకు నిప్పంటించి పరారయ్యారని తెలిపారు. అదృష్టం బాగుండి తనపై దాడి జరగలేదని, భవిష్యత్తులో భౌతిక దాడికి దిగే అవకాశం ఉందన్నారు. గ్రామాభివృద్ధి కోసమే ఇటీవల తాను టీడీపీ వీడి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరానని కోటేశ్వరరావు తెలిపారు. బ్యాంకులో కాంట్రాక్ట్‌ ఉద్యోగిగా పనిచేసే తాను సర్పంచ్‌గా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ఇలా తనపై టీడీపీ నేతలు కక్షగట్టడం సరికాదన్నారు. పోలీసులు తనకు రక్షణ కల్పించాలని కోటేశ్వరరావు కోరారు.
   
Back to Top