పోలవరం పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలిఒక్కసారైనా ఇచ్చిన మాటకు కట్టుబడు బాబూప్రధానిలను, రాష్ట్రపతులను చేసిన వ్యక్తి మాటకు కట్టుబడలేవాపోలవరం నా కల.. నిద్రపోతే పోలవరం అంటూ గొప్పలు2004లో ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తీసుకొచ్చారు చత్తీస్‌ఘడ్, ఒరిస్సాలతో కోర్టులో పిటీషన్‌లు వేయించింది టీడీపీ కాదాపోలవరం పూర్తి చేసే ఉద్దేశ్యం ఉందో.. లేదో చెప్పాలిహైదరాబాద్: సీఎం చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తరువాతే ఎన్నికల్లో ఓటు అడిగేందుకు వెళ్లాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌వీఎస్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. మొదటి మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామన్నారు. తరువాత నాలుగు సంవత్సరాలు అన్నారు. మళ్లీ ఇప్పుడు పూర్తి చేశాకే ఎన్నికలకు వెళ్తామన్న చంద్రబాబు ఈ ఒక్కసారైనా మాటమీద నిలబడాలన్నారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాగిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం ఒక వరం లాంటిదని 1995లో పశ్చిమగోదావరి జిల్లా నాయకుడు నారాయణస్వామి ఆధ్వర్యంలో పోలవరం సాధన సమితి పేరుతో ఉద్యమం చేపట్టారని గుర్తు చేశారు. ఆరోజున పోలవరం నిర్మాణం అవసరమనే ఆలోచన కూడా చంద్రబాబుకు లేదన్నారు. పైగా ఉద్యమాన్ని అణచివేసేందుకు.. మీకేం పనీపాట లేదా అని విమర్శించారని నారాయణస్వామి స్వయంగా వేదికపై చెప్పారన్నారు. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు పోలవరం నా కల.. నిద్రపోతే పోలవరం కలకంటున్నానని గొప్పలు చెప్పుకుంటున్నాడని మండిపడ్డారు.
2004లో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టు అవసరాన్ని గుర్తించి నిర్మాణానికి కావాల్సిన అన్ని అనుమతులను తీసుకొచ్చారని నాగిరెడ్డి గుర్తు చేశారు. పోలవరం వైయస్‌ఆర్ కలల స్వప్నం అన్నారు. సుమారు రూ. 5 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి ప్రాజెక్టుకు ఇందిరాసాగర్‌గా నామకరణం చేశారన్నారు. దాదాపు 170 కిలోమీటర్ల పొడవున్న కుడికాల్వను 130 కిలోమీటర్లు పూర్తి చేశారన్నారు. కానీ చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో పోలవరం ఊసే ఎత్తకపోగా.. చత్తీస్‌ఘడ్, ఒరిస్సా రాష్ట్రాలతో సుప్రీం కోర్టులో పిటీషన్ వేయించాడని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పిటీషన్ విత్‌డ్రా అయ్యాయంటే టీడీపీ వేయించినట్లు కాదా అని ప్రశ్నించారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత రూ.16 వేల కోట్లు ఉంటే దాన్ని 58 కోట్లకు అంచెనాలు పెంచారన్నారు. నాలుగేళ్లుగా ప్రాజెక్టుకు రూ. 4 వేల కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. అనుభవం ఉంది.. కేంద్రంలో చక్రం తప్పడమే కాదు.. ప్రధానిలను, రాష్ట్రపతులను నేనే చేశానని చెప్పే చంద్రబాబు పోలవరం పూర్తి చేశాకే ఎన్నికలకు వెళ్తాననే మాటకు కట్టుబడి ఉండాలన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో ఉంటే... చంద్రబాబు శాసనసభలో మనం అడగకుండానే పోలవరం మనకు కేంద్ర ఇచ్చిందని తెలుగులో.. మళ్లీ వెంటనే మనం రిక్వస్ట్ చేస్తేనే పోలవరం రాష్ట్రానికి వచ్చిందని ఇంగ్లీష్‌లో చెప్పారని, పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు వ్యతిరేకి అని రెండు మాటలను బట్టే అర్థం అవుతుందన్నారు. మీడియా, ప్రజల ఎదుట పోలవరం కోసం ప్రత్యేక హోదాకు రాజీపడ్డానని చెప్పారు. ఇంత రెండు నాలుకల ధోరణితో మాట్లాడడం చంద్రబాబుకే చెల్లుతుందన్నారు. ఇది మంచి విధానం కాదన్నారు. పోలవరం పరిస్థితులు చూస్తుంటే 2019 కాదు 2029 కన్నా పూర్తవుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు.
వైయస్‌ఆర్ జలయజ్ఞం పేరుతో మొట్టమొదటగా చేపట్టిన ప్రాజెక్టు పులిచింతల అని నాగిరెడ్డి గుర్తు చేశారు. కానీ చంద్రబాబు వాస్తవాలను పక్కనబెట్టి అసత్యాలను చెప్పుకుంటున్నారన్నారు. పట్టిసీమ విషయంలో ప్రతిపక్షంతో పాటు ప్రజా సంఘాలు కూడా వ్యతిరేకత వ్యక్తం చేసినా వినిపించుకోకుండా వేల కోట్లు ఖర్చు చేసి తాత్కాలిక ప్రాజెక్టు చేపట్టారన్నారు. పట్టిసీమ వల్ల రైతులకు మేలు లేదన్నారు. అదే పోలవరం నిర్మాణం చేపడితే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. పోలవరం ప్రమాదంలో పడుతుంటే సబ్ కాంట్రాక్టర్‌లను నియమిస్తూ మార్చేస్తున్నారని, మళ్లీ కేంద్రం నిధులు ఇస్తే పూర్తి చేస్తామని మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం పూర్తి చేసే ఉద్దేశ్యం మీకు ఉండా లేదా చెప్పాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.