పౌరుషం అప్పుడేమైంది పవన్‌ కళ్యాణ్?

హైదరాబాద్:

రాయలసీమ పౌరుషం‌పై పవన్ కల్యా‌ణ్ పెద్ద మాటలు మాట్లాడుతున్నా‌రని, చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న‌ప్పుడు ఆయన అనుచరుడైన ఒక టీడీపీ ముఖ్యనేత చేతిలో పవన్ కల్యాణ్‌కు తీరని అవమానం జరిగిందని, ఆ సంఘటన ఏమిటో, అప్పుడీ పౌరుషం పవన్‌ కళ్యాణ్‌లో ఏమైందో రాష్ట్ర ప్రజలకు వివరించాలని వైయస్ఆర్‌సీపీ ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీ సభ్యుడు‌ డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ‌శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పౌరుషం అనేంత పెద్ద మాటలు తాను మాట్లాడలేనని, కానీ పవన్ మాదిరిగా తనకు అవమానం జరిగి ఉంటే కోట్లాది రూపాయలు కాదు కదా, తన ఎత్తు బంగారం రాసి పోసినా అలా అవమానించిన వ్యక్తులతో వేదిక పంచుకునేవాడిని కాదని చెప్పారు.

‌మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి పాలన‌ వల్లే తెలంగాణ ఏర్పాటు జరిగిందని పవన్ చెప్పడం ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని‌ మైసూరారెడ్డి విమర్శించారు. వైయస్ఆర్ రెండోసారి ‌ముఖ్యమంత్రి అయ్యాక టీఆర్‌ఎస్ తరపున ఎన్నికైన పది‌ మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లో చేరిపోవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు అప్పట్లో పత్రికల్లో వార్తలొచ్చాయని గుర్తుచేస్తూ... వైయస్ఆర్‌ మరణించాక కాంగ్రెస్ అసమర్థత, చేతగానితనం‌ వల్ల, టీడీపీ కుమ్మక్కు రాజకీయాల ఫలితంగానే రాష్ట్ర విభజన జరిగిందని వివరించారు.

1999లో చంద్రబాబు రెండోసారి సీఎం అయిన తరువాతనే టీడీపీలో కొందరు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలనే డిమాండ్‌తో ఒక బృందంగా ఏర్పడ్డారని శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని 194వ పేజీలో వివరించారు (అందుకు సంబంధించిన ప్రతులను మైసూరా పత్రికలకు విడుదల చేశారు). తర్వాత ఒక్క ఓటు రెండు రాష్ట్రాలనే నినాదాన్ని బీజేపీ తెరమీదకు తెచ్చిందన్నారు. ఆ తరువాత ఎన్డీయే ప్రభుత్వం 2000 సంవత్సరంలో ఛత్తీస్‌గఢ్, ఉత్తరాంచల్ రాష్ట్రాలను ఇచ్చిందన్నారు. ఆ స్ఫూర్తితో 2001లో టీడీపీ అసమ్మతి నేత ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారని ఈ నివేదిక స్పష్టంగా పేర్కొందని మైసూరారెడ్డి గుర్తుచేశారు. ఈ వాస్తవాలన్నింటినీ మర్చిపోయి విభజన వ్యవహారాన్ని వైయస్ఆర్‌సీపీకి అంటగట్టడం గర్హనీయం అన్నారు.

అధికారంలోకి వస్తే మూడు నెలల్లోపు తెలంగాణ ఇస్తామని ప్రకటించిన పార్టీ బీజేపీ అని, రాష్ట్ర విభజనకు పూర్తిగా సహకరించింది అదే అని మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని విభజించండి అంటూ ఒకటికి రెండుసార్లు లేఖలు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడన్నారు. అలాంటి వ్యక్తులతో వేదిక పంచుకుని వైయస్ఆర్‌సీపీకి, టీఆర్‌ఎస్‌కు సంబంధాలున్నాయని పవన్ కల్యా‌ణ్ ఆరోపించడం పెద్దోళ్ల అమాసకు పీర్ల పండుగకు ముడిపెట్టినట్లుందని ఎద్దేవా చేశారు. పవన్‌ కళ్యాణ్ విమర్శల్లో నిజం నేతి‌ బీరకాయలో నెయ్యి చందమే అని అభివర్ణించారు.

తెలంగాణకు ముందుగా లేఖ ఇచ్చింది తానే అని ఒప్పుకుంటూ వరంగల్‌ ప్రజాగర్జన సభలో చంద్రబాబు జై తెలంగాణ నినాదాలు చేశారని మైసూరారెడ్డి గుర్తుచేశారు. తెలంగాణ కోసం బీజేపీ ఎంతో పోరాటం చేసిందని మోడీ తెలంగాణ సభల్లో చెప్పిన వైనాన్నీ ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్ వీపు మీద గుద్ది బీజేపీయే తెలంగాణ తెచ్చిందని పవ‌న్‌ కళ్యాణే ఇటీవల చెప్పారని అన్నారు. వీరు ముగ్గురూ సీమాంధ్రకు వెళ్లి ఈ ప్రాంతాన్ని రక్షించేది తామే అని చెప్పడం.. రెండు నాల్కల ధోరణికి, అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట అని విమర్శించారు. అయినా రాజకీయ పార్టీ పెట్టుకున్నవాడు ఎన్నికల్లో పోటీచేసి ప్రచారం చేసుకోవాలి గానీ ఇతరులను విమర్శించడానికే పార్టీ పెట్టడం ఏమిటి? అని మైసూరారెడ్డి ప్రశ్నించారు.

పవన్‌ కళ్యాణ్ వాలకం చూస్తూంటే ప్రజలకు జ్ఞాపకశక్తి చాలా తక్కువ అనుకుంటున్నట్లుగా ఉందని అన్నారు. డబ్బు కోసం సినిమా డైలాగులు చెప్పినట్లు రాజకీయాల్లోనూ మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్‌ కళ్యాణ్‌ ప్రజారాజ్యంలో ఉండగా... అవినీతి గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు, బాబుది పొలిటికల్ ర్యాగింగ్, అవినీతి కిటికీలు తెరిచింది బాబే, అదొక దగా కూటమి, టీడీపీ కాగితపు పువ్వు అని చంద్రబాబును, టీడీపీని విమర్శించడం మరిచారా? జూనియ‌ర్ ఎన్టీఆర్ సభలకు వస్తున్న స్పందన చూసి పవ‌న్ మరింత తాగుతారంటూ చంద్రబాబు చేసిన విమర్శలు గుర్తులేవా?‌ అని నిలదీశారు.

మహానేత, తన తండ్రి ఆశయాల సాధన కోసం శ్రీ వైయస్ జగ‌న్ పెట్టిన పార్టీకి ఆయన తల్లి‌ శ్రీమతి విజయమ్మ సహకరించడం తప్పేమీ కాదన్నారు. పవన్ లాంటి వారు ఎన్ని చిందులు వేసినా వై‌యస్ఆర్ కాంగ్రె‌స్‌కు ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ వస్తుందన్నారు. శ్రీ జగన్ ‌సీఎం కావడం తథ్యం అన్నారు.

Back to Top