రైల్వే జోన్ ఇచ్చి తీరాల్సిందే

అమర్నాథ్ దీక్షకు వెల్లువలా మద్దతు
సంఘీభావంగా తరలివస్తున్న ప్రజానీకం
ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్న చంద్రబాబు
హామీలను విస్మరించిన కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలపై ఫైర్
విశాఖకు రైల్వే జోన్ ప్రకటించాలని డిమాండ్ 

విశాఖపట్నంః విశాఖకు రైల్వే జోన్ సాధనే లక్ష్యంగా నిరవధిక నిరాహార దీక్షకు దిగిన వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ కు రాష్ట్రవ్యాప్తంగా  వెల్లువలా మద్దతు లభిస్తోంది. వామపక్షాలు, లోక్ సత్తా, ప్రజా, విద్యార్థి సంఘాలు, మేధావులు, జర్నలిస్టులు సహా అన్ని వర్గాల వారు పెద్ద సంఖ్యలో దీక్షా స్థలికి చేరుకొని అమర్నాథ్ కు సంఘీభావం ప్రకటిస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం పోరాటం చేస్తున్న అమర్నాథ్ కు ఈసందర్భంగా వారు అభినందనలు తెలిపారు. ప్రజాసమస్యలపై నిత్యం ఉద్యమాల్లో ఉంటున్న వైఎస్సార్సీపీ పోరాటపటిమను కొనియాడారు. 

దశాబ్దాలుగా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కోసం ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయని మద్దతుదారులు తెలిపారు. తామేమీ గొంతెమ్మ కోర్కెలను కోరడం లేదని...కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఇచ్చిన  హామీని అమలు చేయమని మాత్రమే అడుగుతున్నామని వారు అన్నారు.  విశాఖ జిల్లా సమస్యలన్నీ పరిష్కరిస్తామంటూ టీడీపీ, బీజేపీనేతలు ఎన్నికల్లో ఓట్లు, సీట్లు దండుకొని ...ప్రజలకు వెన్నుపోటు పొడిచారని నిప్పులు చెరిగారు.  అధికారంలోకి వచ్చాక హామీలను తుంగలో తొక్కి ఏసీ గదుల్లో కునుకుతున్నారని ధ్వజమెత్తారు. 

రైల్వే జోన్ కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు  తొడగట్టి సవాల్ చేస్తుంటే.. దానికి సమాధానం చెప్పే మొహం లేక టీడీపీ నాయకులు ఇళ్లలో దాక్కోవడం సిగ్గుచేటన్నారు.  విశాఖపట్నం వాల్తేర్ డివిజన్ నుంచి ఒరిస్సాకు 10 వేల కోట్లకు పైగా ఆదాయం తరలిపోతుంటే...కూరగాయల బేరం మాదిరి కొంతమంది దాన్ని తక్కువ చేసి చూపిస్తూ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని మేధావులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వాల్తేరు భువనేశ్వర్ చేతిలో ఉండడం వల్ల ఆర్ఆర్సీ పరీక్షల సమయంలో తెలుగు విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్నారు. తెలుగోళ్లకు జరుగుతున్న అన్యాయంపై ఆందోళన చేస్తే...పోలీసులు కేసులు పెట్టి అరెస్ట్ లు చేయడం శోచనీయమన్నారు. రైళ్లన్నీ వైజాగ్ పేరుతో భునవేశ్వర్ కు తరలిపోతుంటే స్థానిక బీజేపీ ఎంపీ హరిబాబు అక్కడకు పోయి రిబ్బన్ లు కట్ చేయడం బాధాకరమన్నారు. విశాఖకు రైల్వే జోన్ రావాలని ధైర్యంగా తీర్మానం చేసినందుకు వివిధ సంఘాల నేతలు వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. 

ఇతర రాష్ట్రాల ఎంపీలంతా వాళ్ల సమస్యలపై పార్లమెంట్ లో బల్లగుద్ది పోట్లాడుతుంటే..టీడీపీ ఎంపీలు మాత్రం పార్లమెంట్ కు వెళ్లరు. వెళ్లినా మాట్లాడరని ఎద్దేవా చేశారు. ఏపీలో విమానం ఎక్కేటప్పుడు అదీ చేస్తాం, ఇదీ చేస్తామని చెప్పడమేగానీ...ఢిల్లీలో విమానం దిగాక రాష్ట్రాన్ని, రాష్ట్ర సమస్యలను గాలికొదిలేస్తున్నారని ఫైరయ్యారు.  విశాఖ రైల్వే జోన్  వైఎస్సార్సీపీకి సంబంధించిన అంశం కాదని ప్రజలకు సంబంధించిన అంశమని ఉత్తరాంధ్ర జర్నలిస్టులు పేర్కొన్నారు. పార్టీలకతీతంతా ప్రతి ఒక్కరూ  అమర్నాథ్ పోరాటంలో భాగస్వామ్యం అయితేనే అనుకున్నది సాధించగలమని అన్నారు. కమిటీలు వేస్తామంటే కుదరదని, దీన్ని ప్రభుత్వం కచ్చితంగా అనుమతించి తీరాలన్నారు. 
  

తాజా వీడియోలు

Back to Top