► కొనుగోలు 53 ఎకరాలు ►చెల్లించినది 16 కోట్లు ► ప్రస్తుత విలువ 212 కోట్లు హైదరాబాద్‌లో హైటెక్ సిటీ, పరిసర ప్రాంతాల్లో సినీనటుడు మాగంటి మురళీమోహన్ సంస్థ జయభేరి పేరిట సాగిన భూదందా మీకు గుర్తుందా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి తనకు అత్యంత సన్నిహితుడైన ప్రస్తుత రాజమండ్రి ఎంపీ మురళీమోహన్‌ను రంగంలోకి దింపారు. కోర్ కేపిటల్‌కు సమీపంలోనే... హైటెక్ సిటీ, పరిసర ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులు చేపట్టి భారీగా సొమ్ము చేసుకున్న మురళీ మోహన్ ఇప్పుడు కలకత్తా- చెన్నై జాతీయ రహదారి పరిసర ప్రాంతాల్లోని భూములపై దృష్టి పెట్టారు. ప్రధాన రాజధాని ప్రాంతం(కోర్ కేపిటల్)కు అత్యంత సమీపంలో తాడేపల్లి మండలం కుంచనపల్లిలో జాతీయ రహదారి పక్కనే ఉన్న81/3సీ, 80/4బీ, 81/2, తదితర ఎనిమిది సర్వే నంబర్లలోని 2.775 హెక్టార్ల (సుమారు 7 ఎకరాలు) విస్తీర్ణంలో రెసిడెన్షియల్ ప్రాజెక్టు నిర్మించేందుకు జయభేరీ సంస్థ సిద్ధమైంది. ఆ మేరకు భూముల యజమానులతో యార్లగడ్డ రవి కిరణ్, గీతాంజలి, నిఖిల్ ఆదిత్య, శ్రీధీర, బెస్ట్ ఫార్చూన్ కంపెనీ పేరిట ఒప్పందం కుదుర్చుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జయభేరి సంస్థకు 14 అంతస్తులతో రెసిడెన్షియల్ ప్రాజెక్టును నిర్మించడానికి జూలై 21, 2015న సీఆర్‌డీఏ అధికారులు ఆగమేఘాలపై అనుమతి ఇచ్చేశారు. దీంతో జయభేరి సంస్థ బహుళ అంతస్తుల రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి ముందే బ్రోచర్లతో హడావుడి చేసి.. ఇప్పటికే సగానికి పైగా ప్లాట్లను ఎన్‌ఆర్‌ఐలకు అమ్మేసి సొమ్ము చేసుకుంది. ఈ ప్రాజెక్టుకు సమీపంలోని 53 ఎకరాల భూమిని ఎకరం రూ.30 లక్షల చొప్పున తన బినామీ పేర్లతో మురళీమోహన్ కొనుగోలు చేశారు. ఈ భూమిలో స్టార్ హోటళ్లు, షాపింగ్‌మాల్స్, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆయన ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.