పారిపోయే జాతికాదు..తిరగబడే జాతి

రాజమండ్రి: మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు. చంద్రబాబుకు మళ్లీ లేఖాస్త్రం సంధించారు. 'ముఖ్యమంత్రి గారు పిచ్చి పిచ్చిగా మామీద దాడి చేయిస్తే తోక ముడిచి పారిపోతామనుకుంటున్నారేమో..బంతిని ఎంత గట్టిగా కొడితే అంత ఎత్తుకు లేస్తుంది. అలాగే మా జాతి తిరగబడడానికి భయపడదు. తప్పుడు పాలన మార్చుకోండి. లేకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని లేఖలో పేర్కొన్నారు.

పిల్లనిచ్చిన మామగారిని చెప్పులతో కొట్టిస్తే పదవి వదిలి వెళ్లిపోయారు... అలాగే ఎదురు దాడులు చేయిస్తే పారిపోతామనుకుంటున్నారేమో ఈ కాపు కులం పారిపోయే జాతి కాదు. ఇచ్చిన హామీలు తెచ్చుకునే వరకు నిద్రపోము. మా జాతి ఎవరి రక్తమో ఎక్కించుకోలేదు. ఆ అవసరం కూడా లేదు. అందుచేతనే పౌరుషంగా తిరగబడతారు.

మీ నుండి మీ నాయకుల వరకు తరచు సభలు సమావేశాలలో కాపులను బీసీల్లో చేరుస్తాము అని కొంగ జపాలు చేస్తున్నారు. జపాలు ఆపి హామీలు ఆచరణలో పెట్టే ఆలోచన చేయండి. రాత్రులు అమ్మకు ఇల్లు కట్టిస్తాం ఉదయం మరచిపోతాం అనే సామెత గుర్తు తెచ్చుకోండి. అయ్యా మీ కాకమ్మ కబుర్లు మాని కార్యాచరణ చెయ్యమని డిమాండ్ చేస్తున్నాము' అంటూ ఘాటుగా లేఖ రాశారు.
Back to Top