హోదా కోసం ఎంపీలతో రాజీనామా..?

*పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హోదా హామీకి తూట్లు

*అధికారంలోకి వచ్చాక ప్లేటు ఫిరాయించిన టీడీపీ, బీజేపీలు 


*హోదా సాధనకు రాబోయే రోజుల్లో పోరాటం ఉధృతం

*పార్లమెంట్‌ శీతకాల సమావేశాలను స్తంభింపజేస్తాం
*అప్పటికీ దిగిరాకపోతే వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలతో రాజీనామా 
*హోదా అంశాన్ని ఎన్నికల ఎజెండాగా మారుస్తాం
*అందరం ఒక్కటై పోరాడుదాం..హోదా సాధిద్దాం
*వైయస్ జగన్ కర్నూలు యువభేరికి విశేష స్పందన


కర్నూలు: అందరం ఒక్కటై పోరాడితే ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేకహోదా హామీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలో తొక్కాయని ఆయన మండిపడ్డారు. నాడు అధికార, విపక్షాలు ఏకమై ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి విడగొట్టాయని, తీరా అధికారంలోకి వచ్చాక టీడీపీ, బీజేపీ ప్లేటు ఫిరాయించాయని ధ్వజమెత్తారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన కర్నూలు నగరంలోని వీజేఆర్‌ కన్వేన్షన్‌ హాల్‌లో యువభేరి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా ఆవశ్యకత గురించి యువతకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వివరించారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని, అవసరమైతే రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్తామని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ప్రత్యేక హోదా సంజీవినే
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సంజీవినే అని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. హోదా ఇస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని విడగొట్టేముందు హామీ ఇచ్చారని తెలిపారు. హైదరాబాద్‌ వంటి నగరం లేకుండా పోతుంది కాబట్టి ఏపీకి హోదా అవసరమని పార్లమెంట్ నే సాక్షిగా చేస్తూ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.  దాదాపు 98 శాతం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు, ఫార్మా, మ్యానిఫాక్చరింగ్ కంపెనీలన్నీ అక్కడే ఉన్నాయన్నారు. చదువుకున్న పిల్లలకు మేలు జరగాలంటే హైదరాబాద్‌ వంటి నగరం అవసరమని నాడు చెప్పిన నేతలే ఇప్పుడు మాట మార్చారని వైయస్‌ జగన్‌ మండిపడ్డారు. హైదరాబాద్‌ స్థానంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే.. ఏపీ కూడా బాగుపడుతుందని, ప్రతి జిల్లా కూడా హైదరాబాద్‌ అవుతుందని, ఇందుకోసం హోదా ఇస్తామని అధికార, ప్రతిపక్షంలో ఉన్న వారు హామీ ఇచ్చారని తెలిపారు. అధికార పక్షం వారు ఐదేళ్లు ఇస్తామంటే..లేదు పదేళ్లు కావాలని బీజేపీ అడిగిందన్నారు. ఆ తరువాత చంద్రబాబు ఒక అడుగు ముందుకేసి పరిశ్రమలు పెట్టడానికి మూడేళ్లు సరిపోతుంది..కాబట్టి పదిహేనేళ్లు హోదా కావాలని డిమాండ్‌ చేశారన్నారు. పరిశ్రమలు అంటే దానికి అర్థం ఉద్యోగాలు వస్తాయన్నది వాస్తవం కాదా? అని నిలదీశారు. అదే నాయకులు అధికారంలోకి వచ్చాక ఫ్లేటు మార్చారని...హోదాకు, పరిశ్రమలకు సంబంధం లేదని ఇప్పుడు మాట మార్చడం దుర్మార్గమని దుయ్యబట్టారు.

అధికారం కోసం అందర్ని మోసం చేశాడు
చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విమర్శించారు. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు రైతు రుణాలన్నీ భేషరత్తుగా మాఫీ చేస్తామన్నారని తెలిపారు. రైతుల ఓట్లు ఒక్కటే సరిపోవని.. ఆడవాళ్ల ఓట్ల కోసం బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలంటే చంద్రబాబు సీఎం కావాలన్నారని చెప్పారు. అంతటితో ఆగకుండా బీదవాళ్లపై పడ్డారని, డ్వాక్రా రుణాలు మాఫీ కావాలంటే బాబు సీఎం కావాలని నమ్మించారన్నారు. అయినా గెలుస్తామన్న నమ్మకం బాబుకు లేక..చివరకు పిల్లలను సైతం మోసం చేసేందుకు మరో వాగ్ధానం చేశారన్నారు. జాబ్‌ కావాలంటే బాబు సీఎం కావాలని మోసం చేశారన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని నమ్మించారని, నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని దగా చేశారని వైయస్‌ జగన్‌ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఓట్లు సంపాదించుకునేందుకోసం పదిహేను సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్ధానం చేశారన్నారు. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీని టీడీపీ, బీజేపీలు విస్మరిస్తే ఇక ఎవర్ని అడగాలని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తులను చూసినప్పుడు వ్యవస్థలో రాజకీయ నాయకులను నమ్మే పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. ఇటువంటి వ్యవస్థను, మోసం చేసే నాయకులను చూస్తే బాధనిపిస్తోందని వైయస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వసనీయత అనే పదానికి అర్థం తెలియని ఇటువంటి నాయకులు ఉండబట్టే వ్యవస్థ బ్రష్టుపట్టిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఫలాని వాడు మా నాయకుడు అని కాలర్‌ ఎగిరేసుకునే వాళ్లుంటే విశ్వసనీయత అనే మాటకు అర్థం ఉంటుందన్నారు.  

హోదాతోనే ఉద్యోగాలు
చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేకమైన మంత్రదండం ఏమీ అక్కర్లేదని, ప్రత్యేక హోదా ఉంటే యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. హోదా వస్తే రెండు మేళ్లు జరుగుతాయన్నారు. ఒకటి గవర్నమెంట్‌కు సంబంధించి.. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే నిధుల్లో హోదా కలిగిన రాష్ట్రానికి 90 శాతం గ్రాంట్‌గా ఇస్తారని, పది శాతం లోన్‌గా ఇస్తారని తెలిపారు. అందరికి సంబంధించిన మేలు ఇంకొకటి ఉందన్నారు. ఏ రాష్ట్రాలకు లేని విధంగా పారిశ్రామిక రాయితీలు వస్తాయన్నారు. పెట్టుబడుల కోసం ఏపీ సీఎం చంద్రబాబు 16 సార్లు విదేశాలకు వెళ్లారని, ఎక్కడికి వెళ్లినా కూడా ప్రత్యేక విమానాల్లోనే ఆయన వెళ్తారని ఎద్దేవా చేశారు. అయితే పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రానికి రావాలంటే ప్రభుత్వం ఇచ్చే రాయితీలను చూసి వస్తారు కాని.. మన మొహాలను చూసి ఎవరూ రారని చెప్పారు. ఈ విషయం బాబుకు అర్ధం కాదని దుయ్యబట్టారు. ఏదైన పరిశ్రమ పెట్టేటప్పుడు హోదా ఉన్న రాష్ట్రంలో వంద శాతం ఎక్సైజ్‌ పన్ను కట్టాల్సిన పనిలేదన్నారు. ఇన్‌కంట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదన్నారు. పావలావడ్డీకే రుణాలు ఇస్తారని,. ఇలా పరిశ్రమలు పెట్టేందుకు వచ్చిన వారికి ట్రాన్స్‌ఫోర్టు ఖర్చులు కూడా వెనక్కి ఇస్తారన్నారు. ఇలాంటి రాయితీలు ఉంటే ఎవరైనా ముందుకు వచ్చి పరిశ్రమలు పెడతారని వైయస్‌ జగన్‌ చెప్పారు. ఇటువంటి బెనిఫిట్లు ఉంటేనే పరిశ్రమలు పెడతారని తెలిపారు. ఈ విషయం చంద్రబాబుకు తెలిసి కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదావల్ల జరిగే ప్రయోజనాలపై చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. 

బాబుకు ఇంగ్లీష్‌ వచ్చా?
విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన నిధుల్లో కూడా కేంద్రం కోత విధిస్తూ ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటన చేసినా..దాన్ని చంద్రబాబు స్వాగతించడం దుర్మార్గమని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మన తరఫున పోరాటం చేయాల్సిన వ్యక్తి దగ్గరుండి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. హోదా విషయంలో సీఎం పూర్తిగా రాజీ పడ్డారని విమర్శించారు. సెప్టెంబర్‌7, 2016న అర్ధరాత్రి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమని ప్రకటించారని, చట్టప్రకారం మనకు రావాల్సిన నిధుల్లో కోత విధిస్తున్నట్లు  ఈ స్టేట్‌మెంట్‌ ఉందన్నారు. జైట్లీ ప్రకటన ఎవరైనా చదివితే ఇంగ్లీష్‌ వచ్చిన వారు అంగీకరించారన్నారు. కానీ చంద్రబాబు మాత్రం అర్ధరాత్రి ప్రెస్‌ ముందుకు వచ్చి దీన్ని స్వాగతిస్తున్నామనడం దారుణమన్నారు. ఈ పరిణామాలను చూస్తే.. నిజంగా బాబుకు ఇంగ్లీష్‌ వచ్చా?రాదా అన్న అనుమానం కలుగుతుందన్నారు. బాబు అంతటితో ఆగిపోకుండా హోదా కోసం  అసెంబ్లీలో మేం గొడవ చేస్తున్నామని, కౌన్సిల్‌లోకి వెళ్లి కేంద్రానికి కృతజ్ఞతలు తెలపడాన్ని తప్పుపట్టారు. ఆ తరువాత ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులకు సన్మానాలు చేశార ని ఫైర్‌ అయ్యారు. ప్యాకేజీ అంటే ఏంటో చంద్రబాబుకు తెలుసా? అని వైయస్‌ జగన్‌ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఫలాని చేస్తామని చెప్పార ని గుర్తు చేశారు. అవి కాక ఇంకా ఏమైనా ఇస్తే దాన్ని అభినందించాలని, ఏదైతే చేస్తామని చెప్పారో..అందులో కోతలు విధిస్తూ జైట్లీ ప్రకటన చేస్తే..చంద్రబాబు చంకలు గుద్దుకోవడం ఆశ్చర్యకరమన్నారు. దుగ్గరాజు పట్నం పోర్టును పీపీపీ పద్ధతిలో క్లియరెన్స్‌ ఇచ్చామని చెబుతున్నారని, యాక్టోలో చెప్పిన వాటిని ఇవ్వమంటే బాబు స్వాగతించడం ఎంత వరకు సబబు అన్నారు.  పోలవరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇచ్చారని, దీనికి 90 శాతం నిధులు కేంద్రం ఇస్తుందని, 10 శాతం నిధులు రాష్ట్రం భరించాల్సి ఉందన్నారు. పోలవరాన్ని కేంద్రమే దగ్గరుండి కడుతుందని చట్టంలో పేర్కొన్నారని గుర్తు చేశారు. అయితే పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి అరుణ్‌జైట్లీ ప్రకటన ప్రకారం విద్యుత్‌ కోసం రూ.2020 కోట్లు, రాష్ట్రం విడిపోకముందు కేంద్రం ఖర్చు చేసిన రూ.5130 కోట్లు ఇవ్వమన్నా చంద్రబాబు చంకలు గుద్దుకుంటున్నారని విమర్శించారు. 

హోదాపై తప్పుడు ప్రచారం
పదిహేనేళ్లు ప్రత్యేక హోదా కావాలన్న చంద్రబాబు ఇప్పుడు మాట మార్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైయస్‌ జగన్‌ ఫైర్‌ అయ్యారు. ఇటీవల 26 పేజీలకు సంబంధించిన ఓ పుస్తకాన్ని అధికారికంగా ముద్రించి ప్రతిప్రతినిధులకు పంచిపెడుతూ అబద్ధాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు.   బాబు ముద్రించిన ఈ పుస్తకంలోని కొన్ని మాటలు చూస్తే..14వ ఆర్థిక సంఘం ఒప్పుకోవడం లేదు కాబట్టి మేం హోదా ఇవ్వలేకపోతున్నామని చెప్పడం విడ్డూరమన్నారు. 14వ ఆర్థిక సంఘం చైర్మన్‌  ౖÐð వీ వేణుగోపాల్‌రెడ్డి ఇటీవల హైదరాబాద్‌లో మాట్లాడుతూ..హోదా అంశంపై చర్చించే హక్కు 14వ ఆర్థిక సంఘానికి లేదని స్పష్టం చేశారన్నారు. ఇదే సంఘానికి చెందిన సభ్యుడు  అభిజిత్‌షేన్‌ కూడా లిఖితపూర్వకంగా స్పష్టం చేశారని గుర్తు చేశారు. వీటన్నింటికి నివృత్తి చేస్తూ వైయస్‌ఆర్‌సీపీ వెబ్‌సైట్‌లో కరపత్రం రూపొందించి అందుబాటులో పెట్టామని వైయస్‌ జగన్‌ తెలిపారు.

హోదా వచ్చేవరకు నిరంతర పోరాటం
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వచ్చే వరకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పోరాటం అన్నది అందరం కలిసికట్టుగా ఒక్కటై చేస్తేనే సాధ్యమవుతుందన్నారు. రేపే హోదా వస్తుందని నేను చెప్పనన్నారు. అసాధ్యమన్న తెలంగాణను వాళ్లు పోరాటం చేసి సాధించగా లేనిది. మనం పోరాటం చేస్తే హోదా రాకపోదా? అన్నారు. ఇవాళ కాకపోతే రేపు హోదా సాధించుకోవచ్చు అని «భరోసా కల్పించారు. హోదా ఇచ్చే వారికే కేంద్రంలో మద్దతిస్తామని వెల్లడించారు. ఈ పోరాటం కొనసాగించే కార్యక్రమంలో భాగంగా యువభేరి, ధర్నాలు, బంద్‌ల నుంచి పైస్థాయికి తీసుకెళ్తామన్నారు. ఎంపీల చేత గట్టిగా పార్లమెంట్‌లో పోరాటం చేస్తామన్నారు. పార్లమెంట్‌ శీతకాల సమావేశాలను ముందుండి స్తంభింపజేస్తామని తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే బడ్జెట్‌ సమావేశాల తరువాత వైయస్‌ఆర్‌సీపీ ఎంపీల చేత రాజీనామా చేయిస్తామని ప్రకటించారు. అప్పుడైనా బుద్ధి రావాలని సందేశం ఇచ్చేందుకు ఉప ఎన్నికలకు వెళ్లి మళ్లీ గెలిచి అదే అంశంపై పోరాడుతామన్నారు. 2019 ఎన్నికల్లో కూడా హోదానే ఎజెండాగా పోటీ చేస్తామన్నారు. ఎవరైనా ఓట్ల కోసం మైక్‌ పట్టుకోవాలంటే హోదా ఇస్తామని హామీ ఇవ్వాల్సిందే అన్నారు. ఈ పోరాటంలో వైయస్‌ జగన్‌కు మీఅందరి తోడు, అండదండలు కావాలని కోరారు. మీరందరూ తోడుంటే ఖచ్చితంగా ఏపీకి ప్రత్యేక హోదా తీసుకువస్తానని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు.  అందరం ఒక్కటై ప్రత్యేక హోదా సాధించుకుందామని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పిలుపునిచ్చారు.


 
Back to Top