బాబు ధ్యాసంతా ముడుపులపైనే



  కమీషన్ల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు
– విభజన చట్టం ప్రకారం కేంద్రమే పోలవరం నిర్మించాలి
– ముడుపుల కోసం ఆ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు బాబు తీసుకున్నారు
– 2019కి కూడా పోలవరం పూర్తి అయ్యేలా లేదు
 –  వైయస్‌ఆర్‌ చొరవ వల్లే పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు
 –రేపు పోలవరం సందర్శించేందుకు వైయస్‌ఆర్‌సీపీ బృందం

హైదరాబాద్‌: చంద్రబాబుకు ప్రజల ప్రయోజనాల కంటే ముడుపులపై ధ్యాస ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. విభజన చట్టం ప్రకారం కేంద్రం నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తన కమీషన్ల కోసం తీసుకున్నారని ఆరోపించారు. ఇప్పుడేమో మాట మార్చి ఒక పథకం ప్రకారం పోలవరానికి సమాధి కట్టేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు దుర్మార్గ వైఖరిని ప్రజలకు చూపించేందుకు రేపు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధుల బృందం పోలవరాన్ని సందర్శిస్తున్నట్లు ఆయన చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.  పోలవరం సమస్య నాలుగు రోజులుగా చర్చ జరగడం కారణంగా చంద్రబాబు వైఖరే కారణమన్నారు. పోలవరాన్ని కేంద్రమే తీసుకోవచ్చు అని చంద్రబాబు చెప్పడంతోనే ఇదంతా జరుగుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా గురించి మా నాయకుడు  వైయస్‌ జగన్‌ పోరాటం చేశారని గుర్తు చేశారు.  విభజన చట్టంలో పోలవరాన్ని కేంద్రమే నిర్మించాలని పొందుపరిచారని వివరించారు. ఈ ప్రాజెక్టుకు ఇంత ఇబ్బందులు రావడానికి కారణం ఏంటీ? అని ప్రశ్నించారు.


వైయస్‌ రాజశేఖరరెడ్డి చొరవతోనే
దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి చొరవతోనే పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చాయని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. 2004లో పోలవరం ప్రాజెక్టును గుర్తించి, ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకువచ్చారన్నారు. 2009లో మహానేత మరణాంతరం డిసెంబర్‌ 9కే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగా అంగీకరించడం, 2014లో పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడం అందరికి తెలుసు అన్నారు. 

పనులు సాగకపోవడానికి చంద్రబాబే కారణం
కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నిర్మించి ఇస్తామంటే..చంద్రబాబు తన ముడుపుల కోసమే ఈ ప్రాజెక్టును తీసుకున్నారని సుబ్బారెడ్డి విమర్శించారు. ప్రాజెక్టు పనులు ముందుకు సాగకపోవడానికి చంద్రబాబే కారణమన్నారు.  చంద్రబాబు ఓ ప్రాజెక్టును స్థాపించి, శంకుస్థాపన చేసిన సందర్భాలు ఎప్పుడైనా చూశామా అన్నారు. ఏ విధంగా పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తామని తీసుకున్నారో అర్థం కావడం లేదన్నారు. 2014 విభజన చట్టంలో స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. ప్రతి పైసా కూడా కేంద్రమే భరిస్తుందని చెబితే చంద్రబాబుకు ఎందుకు మధ్యలో దూరారో తెలియడం లేదన్నారు. రాష్ట్రాభివృద్ధి కన్న ముడుపులే బాబుకు ముఖ్యమన్నారు. ఓ పద్ధతి ప్రకారం చంద్రబాబు కుట్రలు చేస్తూ పోలవరం ప్రాజెక్టు కేంద్రమే తీసుకోండి అని చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్నారు.

విదేశాల్లో ఉన్నా కూడా అదే ధ్యాస..
విదేశాల్లో ఉన్నా కూడా చంద్రబాబుకు ముడుపులపైనే ధ్యాస ఉందని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. నిన్న కేంద్ర మంత్రికి ఫోన్‌ చేసి మాకు రావాల్సిన నిధులు ఎప్పుడిస్తారని బాబు కోరడం కమీషన్ల కోసమే అన్నారు.  2019 నాటికి పోలవరం పూర్తి అయ్యేలా లేదని అనుమానం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టుకు ఎలాంటి కేటాయింపులు లేకపోయినా కేంద్రాన్ని చంద్రబాబు ప్రశ్నించలేదన్నారు.  2014 అంచనాల మేరకే పోలవరం నిర్మిస్తామని కేంద్రం చెబితే ఆ రోజు చంద్రబాబు ఎందుకు ఒప్పుకున్నారని నిలదీశారు. 2017లోగా పోలవరం నిర్మిస్తామని మొదట చెప్పిన చంద్రబాబు ముడుపుల కోసం పట్టిసీమ చేశారని, మళ్లీ పురుషోత్తం పట్నం కూడా చేస్తున్నారని మండిపడ్డారు. సీఎంకు చిత్తశుద్ది ఉంటే పోలవరం పూర్తి చేసే వారన్నారు. పాత లెక్కల ప్రకారం రూ.16 వేల కోట్లు ఉండేదని, ఇప్పుడే రూ.58,313 కోట్లు అంచన వ్యయం ఉందని, మిగతా డబ్బులు ఎవరిస్తారని సుబ్బారెడ్డి ప్రశ్నించారు. ఇవన్నీ తెలసి కూడా నిర్మాణ బాధ్యతలు ఎందుకు తీసుకున్నారని నిలదీశారు.  ప్రతి పైసా కేంద్రమే భరిస్తామంటే, చంద్రబాబు ఈ ప్రాజెక్టును తీసుకోవడంతో ఈ డబ్బులు రాష్ట్ర ప్రజలు భరించాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్యాకేజీ అన్నారు. ఇప్పటికైనా  కేంద్రమే పోలవరం నిర్మించి ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలని సూచించారు. లేదంటే ప్రజా ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
 
Back to Top