ఒకేష‌న‌ల్ కాలేజీ ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేయాలి

విశాఖ: ఒకేషనల్‌ కాలేజీ విద్యార్థినిపై అత్యాచారానికి యత్నించిన ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేయాలని కలెక్టర్‌కు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వినతిపత్రం అందజేశారు. బాధితురాలు, కాలేజీ విద్యార్థులతో విజయసాయిరెడ్డి కలెక్టర్‌ను కలిశారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.

విశాఖ నగరంలోని డాబాగార్డెన్స్‌కు చెందిన విశాఖ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాల డైరెక్టర్‌ కుమార్‌ గత మంగళవారం తనను లైంగిక వేధింపులకు గురిచేసినట్టు బాధిత విద్యార్ధిని శనివారం రాంబిల్లి మండలం ధారభోగాపురం వద్ద వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ఫిర్యాదు చేసిన విష‌యం విధిత‌మే. అతనికి కళాశాల కరస్పాండెంట్, కృష్ణా కళాశాలలో కాంటాక్ట్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్న గ్లోరీ అలియాస్‌ గౌరి సహకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. వీరిపై కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసి తరువాత విద్యార్థి సంఘాలతో ఆందోళనలు నిర్వహించినా ఫలితం లేకుండా పోయిందని చెప్పింది. నిందితులకు మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ అనుచరుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని, దీంతో నిందితులను వారిని పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించినా ఇప్పటి వరకు అరెస్ట్‌ చేయడం గాని, ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాని చేయలేదని తెలిపింది.

కళాశాలకు ప్రభుత్వ గుర్తింపు కూడా లేకపోవడంతో అక్టోబరులో జరిగే జనరల్‌ నర్సింగ్‌ మిడ్‌వైఫ్‌ పరీక్షలకు హాజరు కావాల్సిన 250 మంది విద్యార్ధుల భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉందని తెలిపింది. నింధితులను కఠినంగా శిక్షించేలా చూడాలని విజ్ఞప్తి చేసింది.  వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు విజ‌య‌సాయిరెడ్డి విశాఖ జిల్లా క‌లెక్ట‌ర్‌ను క‌లిశారు. ఒకేషనల్‌ కళాశాల నిందితులపై చర్యలు తీసుకోకపోతే వైయ‌స్ఆర్‌సీపీ తరపున ఆందోళన చేస్తామని విజ‌య‌సాయిరెడ్డి హెచ్చరించారు.
 

తాజా ఫోటోలు

Back to Top